4వ స్థానానికి శ్రేయసే బెటరా!

శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఆడింది 8 మ్యాచ్‌‌లు..! అయినా ఇప్పటివరకు 4వ స్థానంలో బ్యాటింగ్‌‌ చేయనేలేదు..! మూడు, ఐదు స్థానాల్లో ఆడి మూడు హాఫ్‌‌ సెంచరీలు చేశాడు..! కానీ నాలుగో నంబర్‌‌కు అతనే సరైన ఆటగాడు అని లెజెండ్‌‌ గావస్కర్‌‌ వ్యాఖ్య..! మరి ఇది కరెక్టేనా..! ఇప్పటివరకు డజన్‌‌కు పైగా ఆటగాళ్లు విఫలమైన ఈ స్థానానికి అయ్యర్‌‌ సరిపోతాడా? అంతర్జాతీయ​, దేశవాళీ మ్యాచ్‌‌ల్లో అతను ఏ స్థానంలో ఎలా ఆడాడో చూద్దాం..!!

  • అయ్యర్​కు గావస్కర్​ మద్దతు
  • పంత్​కు ఫినిషింగ్​ బాధ్యతలు: సన్నీ

న్యూఢిల్లీ: వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా వైఫల్యం తర్వాత ఎక్కువగా దృష్టి పెట్టిన అంశం.. బలమైన మిడిలార్డర్‌‌ను తయారు చేయడం. ఎందుకంటే స్వదేశంలో బిజీ షెడ్యూల్‌‌తో పాటు వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌‌కప్‌‌ను గెలవడం విరాట్‌‌సేన ముందున్న అతిపెద్ద టార్గెట్‌‌. ఇది నెరవేరాలంటే అందుబాటులో ఉన్న కుర్రాళ్లతో బలమైన టీమ్‌‌ను రూపొందించుకోవాలి. టాప్‌‌–3లో ధవన్‌‌, రోహిత్‌‌, కోహ్లీకి తిరుగులేదు. వీళ్లను మార్చే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే..ప్రత్యామ్నాయంగా కేఎల్‌‌ రాహుల్‌‌ రెడీగా ఉన్నాడు. కానీ ఎటొచ్చి టీమిండియాలో ఖాళీగా కనిపిస్తున్న నాలుగో స్థానంపైనే అసలు చర్చ. ఆ చర్చకు ఫుల్‌‌స్టాఫ్‌‌ పెట్టేందుకు ఇప్పుడు శ్రేయస్‌‌ అయ్యర్‌‌ రూపంలో నాణ్యమైన ఓ కుర్రాడు వచ్చాడు. నిలకడ, టెక్నిక్‌‌, షాట్స్‌‌లో మాజీలను తలపిస్తున్న ఈ ముంబైకర్‌‌.. రిషబ్‌‌ పంత్‌‌తో పోలిస్తే 4వ స్థానానికి చక్కగా సరిపోతాడని గవాస్కర్‌‌ అంటున్నాడు. ‘ధోనీలాగా 5, 6 స్థానాల్లో ఫినిషర్‌‌గా పంత్‌‌ బాగా ఉపయోగపడతాడు. ఎందుకంటే  అతనిలో సహజసిద్ధమైన దూకుడు ఉంది. స్లాగ్ ఓవర్లలో కావాల్సింది అదే. ఒకవేళ టాప్‌‌–3 బ్యాట్స్‌‌మెన్‌‌ 40, 45 ఓవర్లు క్రీజులో ఉండి అద్భుతమైన శుభారంభాన్ని ఇస్తే అప్పుడు పంత్‌‌ను నాలుగో స్థానంలో ఆడించొచ్చు. కానీ బలమైన ఆరంభం లభించకపోతే మిడిల్​ ఓవర్లలో  బ్యాటింగ్‌‌ చేసేది ఎవరు? మిడిల్‌‌ బాధ్యతను తీసుకునేదెవరు? ఇలాంటి టైమ్‌‌లో నాలుగులో అయ్యర్‌‌, ఐదులో పంత్‌‌ రావడం కరెక్ట్‌‌’ అని సన్నీ వివరించాడు.

‘4’లో ఆడనే లేదు..!

సన్నీ వివరణ కన్విన్సింగ్‌‌గా ఉన్నా.. శ్రేయస్‌‌ ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఆడలేదు. స్వదేశంలో 2017 డిసెంబర్‌‌లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన అయ్యర్‌‌.. మూడు మ్యాచ్‌‌ల్లోనూ ‘మూడో’ స్థానంలోనే ఆడాడు. తొలి మ్యాచ్‌‌లో 9, తర్వాతి రెండింటిలో వరుసగా 88, 65 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాలో జరిగిన సిరీస్‌‌లో అయ్యర్‌‌ స్థానాన్ని ఐదుకు మార్చారు. అక్కడ జరిగిన సిరీస్‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌లో వరుసగా 18, 30 రన్స్‌‌ చేశాడు. మూడో మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌‌ అవకాశం రాలేదు. మళ్లీ ఇప్పుడు విండీస్‌‌పై తొలి వన్డే రద్దైనా.. రెండో మ్యాచ్‌‌లో 71 రన్స్‌‌తో ఆకట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌‌కు 125 రన్స్‌‌ జోడించడంతో టీమిండియా భారీ స్కోరు సాధ్యమైంది. అదే నాలుగో స్థానంలో వచ్చిన పంత్‌‌ (20) ఘోరంగా నిరాశపర్చాడు. 16వ ఓవర్‌‌లో రోహిత్‌‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌‌ ఏడు ఓవర్లు మాత్రమే ఆడాడు. అంటే అత్యంత కీలకమైన మిడిల్‌‌ మ్యాచ్‌‌లో పంత్‌‌ ఒత్తిడిని అధిగమించలేకపోయాడు. అదే 23వ ఓవర్‌‌లో వచ్చిన అయ్యర్‌‌.. 46వ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. అంటే దాదాపు 23 ఓవర్లు క్రీజులో నిలిచాడు. ‘శ్రేయస్‌‌ వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఐదో నంబర్‌‌లో అతనికి ఎక్కువ ఓవర్లు ఆడే చాన్స్‌‌ వచ్చింది. రెండోఎండ్‌‌లో కోహ్లీ ఉండటం కూడా కలిసొచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి విరాటే తీసుకున్నాడు. కాబట్టి అయ్యర్‌‌ స్వేచ్చగా బ్యాటింగ్‌‌ చేశాడు. క్రికెట్‌‌ నేర్చుకోవడానికి నాన్‌‌ స్ట్రయికింగ్‌‌ ఎండ్‌‌ మంచి ప్లేస్‌‌. విరాట్‌‌ ఆడుతుంటే శ్రేయస్‌‌ చేసింది కూడా ఇదే’ అని గావస్కర్‌‌  పేర్కొన్నాడు.

ప్లేస్‌‌ పర్మినెంటేనా..?

ఐపీఎల్‌‌లో ఢిల్లీ తరఫున కెప్టెన్‌‌గా, బ్యాట్స్‌‌మన్‌‌గా మంచి స్కోర్లు చేసిన అయ్యర్‌‌.. ఇంటర్నేషనల్‌‌ స్థాయిలో ఆడిన 8 మ్యాచ్‌‌ల్లో మూడు హాఫ్‌‌ సెంచరీలు చేశాడు. అదే ఇండియా–ఎ తరఫున వరుసగా 61*, 47, 2, 77  పరుగులు సాధించాడు.  విదేశాల్లో అతని బ్యాటింగ్‌‌ నైపుణ్యానికి ఈ స్కోర్లే నిదర్శనం. సో టీమిండియాలో నాలుగో స్థానం శాశ్వతం కావాలంటే ఈ పెర్ఫామెన్స్‌‌ సరిపోతుందనేది సన్నీ అభిప్రాయం. ఒకవేళ మేనేజ్‌‌మెంట్‌‌ ఇంతకంటే ఎక్కువ కోరుకుంటే ఏం చేయాలో వాళ్లే చెప్పాలన్నాడు. ‘వరల్డ్‌‌కప్‌‌లో కనీసం 15 మందిలోనైనా అయ్యర్​కు చాన్స్‌‌ ఇస్తే బాగుండేది. అది గతం. కనీసం ఇప్పుడైనా ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్లేస్‌‌ పర్మినెంట్‌‌ చేస్తే బాగుంటుంది’ అని గావస్కర్‌‌
చెప్పుకొచ్చాడు.

– శ్రేయస్‌‌ అయ్యర్‌‌

Latest Updates