అరటి పండు కనిపించదేమో

  •                 2050 నాటికి ఆ ముప్పు అవకాశం ఉందంటున్న సైంటిస్టులు
  •                 ఇండియా, బ్రెజిల్​లో సాగు, దిగుబడి భారీగా పడిపోతుందని వెల్లడి

 

వాతావరణ మార్పుల ఎఫెక్ట్​ అరటి సాగుపై పడుతుందా? పంట దిగుబడి, ఉత్పత్తి తగ్గిపోతుందా? అసలు అరటి అన్నదే కనిపించకుండా పోతుందా? అంటే అవుననే అంటున్నారు బ్రిటన్​లోని యూనివర్సిటీ ఆఫ్​ ఎగ్జీటర్​ సైంటిస్టులు. ప్రపంచంలో అరటి ఎక్కువగా పండే, ఎగుమతి చేసే మన దేశంలో అరటి సాగు తగ్గిపోతుందని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 86 శాతం అరటిని పండిస్తున్న 27 ప్రధాన దేశాలపై సైంటిస్టులు స్టడీ చేశారు. 1961 నుంచి వాతావరణం మారుతున్నా ఇప్పటిదాకా అరటి సాగు పెరిగిందే తప్ప తగ్గలేదని గుర్తించారు. అయితే, మున్ముందు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి కొన్ని దేశాల్లో అరటి దిగుబడులు తగ్గిపోవడమో లేదా పూర్తిగా అరటి కనిపించకపోవడమో జరుగుతుందని హెచ్చరించారు. ఇండియా, బ్రెజిల్​లో అయితే అరటి పళ్ల దిగుబడి దారుణంగా పడిపోతుందని తేల్చి చెప్పారు. చాలా దేశాల్లో అరటి పంట సాగు చాలా మందికి జీవనోపాధి అని, చాలా దేశాలు పెద్ద మొత్తంలో వాటిని ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయని గుర్తు చేశారు. ఒకవేళ అరటి సాగు, దిగుబడి తగ్గితే ఇటు రైతులకు, అటు దేశాల ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం పడే ముప్పు పొంచి ఉందన్నారు. కొలంబియా, కోస్టారికా, గ్వాటెమాలా, పనామా, ఫిలప్పీన్స్​లలోనూ అరటి తగ్గుతుందన్నారు. అయితే, ఈక్వెడార్​, హోండ్యురస్​, కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రం దిగుబడి పెరిగి రైతులు లాభాలు చూస్తారని చెప్పారు.

Latest Updates