డీజిల్ పోయలేదని.. బంక్ సిబ్బందిపై SI దాడి

అధికార దర్పంతో ఓ ఎస్సై పెట్రోల్ బంక్ కార్మికుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపట్నం ఎస్సై రాంబాబు తన వాహనాన్ని డ్రైవరుకిచ్చి డీజిల్ పోయించుకురమ్మని స్థానిక పెట్రోల్ బంక్ కు పంపాడు. అక్కడ పనిచేస్తున్న హుమాయున్ అనే కార్మికుడు తన యజమాని చెబితేనే డీజిల్ పోస్తానని ఆ డ్రైవర్ కు చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్ ఎస్సైకి ఫోన్ చేయగా.. వాహనం తీసుకొని వెనక్కి రమ్మని ఆదేశించాడు. డ్రైవర్ వెళ్లిన కాసేపటికే ఎస్సై రాంబాబు అదే వాహనంలో వచ్చి హుమాయున్ మీద విచక్షణా రహితంగా దాడి చేశాడు.

అంతటితో ఆగక స్టేషన్ కి తీసుకెళ్లి మరీ అతన్ని కొట్టారని.. పరుష పదజాలంతో తిట్టాడని  బాధితుడు అన్నాడు. ఎస్సై దాష్టీకంపై బంకు కార్మికులు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఎస్సై రాంబాబు మాత్రం.. హుమాయున్ తమ డ్రైవర్ తో దురుసుగా మాట్లాడని, అతను చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. డీజిల్ పోయించుకునేందుకు తాము నెలా నెలా బిల్లు చెల్లిస్తున్నామని, ఆ విషయం తెలియకుండా హుమాయున్ తన డ్రైవర్ పట్ల పొగరుగా ప్రవర్తించాడని అన్నారు.

Latest Updates