సిద్దిపేట్ పోలీసులపై ఆరోపణ: లంచం తీసుకున్నా కేసుపెట్టారు

సిమెంట్ బస్తాలు కొన్న పాపానికి బెజ్జంకి పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని  ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యాపారి. సిద్ధిపేట్ జిల్లా బెజ్జంకికి చెందిన కృష్ణారావు సిమెంట్ బ్రిక్స్ తయారు చేసి అమ్ముతుంటాడు. కొద్ది రోజుల క్రితం ఓ లారీ డ్రైవర్.. తడిసిన సిమెంట్ బస్తాలు ఉన్నాయని.. తక్కువ ధరకు ఇస్తానని చెప్పడంతో కృష్ణారావు వాటిని కొన్నాడు. అయితే.. సిమెంట్ లోడ్ చోరీ అయ్యిందని లారీ ఓనర్ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కృష్ణారావును స్టేషన్ కు పిలిపించారు.

దొంగ సిమెంట్ బస్తాలు కొన్నావని కేసు పెడతానని బెజ్జంకి ఎస్సై అభిలాష్.. బెదిరించి 5 లక్షల రూపాయల లంచం తీసుకున్నాడని బాధితుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు. ధనాన్ని తీసుకున్నా కూడా తనపై ఎస్సై అభిలాష్… తప్పుడు కేసు పెట్టారని.. ప్రతి రోజు కానిస్టేబుల్ నాగరాజు ద్వారా ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రాశాడు. దీనిపై సిద్దిపేట సీపీతో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితమే బెజ్జంకి పోలీస్ స్టేషన్ దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా 41వ ర్యాంక్ సాధించింది. అప్పట్లో  సీపీ స్వయంగా బెజ్జకి పీఎస్ కు వచ్చి ఎస్సై అభిలాష్ ను అభినందించారు. ఇప్పుడు అదే ఎస్ఐ 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

Latest Updates