హుజూరాబాద్​లో మంత్రి హరీశ్ అనుచరులు

హుజూరాబాద్​లో మంత్రి హరీశ్ అనుచరులు


సిద్దిపేట/కరీంనగర్, వెలుగు: సిద్దిపేట జిల్లాకు చెందిన టీఆర్ఎస్​నేతలు ముఖ్యంగా మంత్రి హరీశ్​రావు అనుచరులు హుజూరాబాద్​నియోజకవర్గంలో దిగారు. ఖద్దరు బట్టలు వదిలిపెట్టి, ఆఫీసర్ల లెక్క తయారై వారికి కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఓటరు లిస్టులు పట్టుకొని ఇల్లిల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. ‘మీకేమైనా ప్రభుత్వ స్కీములు అందుతున్నాయా? మీ ఇంట్లో పింఛన్లు రాని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలున్నారా?’ అని అడుగుతున్నారు. తర్వాత మెల్లగా టీఆర్ఎస్​ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? అని ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా, ఈటల రాజేందర్​కు అనుకూలంగా మాట్లాడిన వాళ్ల పేర్లను ప్రత్యేకంగా రాసుకెళ్తున్నారు.

ఇంటింటికీ వెళ్తూ.. 

సిద్దిపేట నేతలు గడిచిన మూడు, నాలుగు రోజులుగా హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో తిరుగుతున్నారు. హుజురాబాద్​టౌన్​లో ఒక్కో వార్డుకు రెండు టీమ్​ల చొప్పున వెళ్తున్నారు. ఓటరు లిస్టులు పట్టుకొని ప్రతి ఇంటి తలుపు తడుతుండడంతో వీళ్లను ఆఫీసర్లుగా పబ్లిక్​ భావిస్తున్నారు. దీంతో వాళ్లు ఏ వివరాలు అడిగినా చెప్పేస్తున్నారు. ఫోన్​నంబర్లు కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్​ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అని మొదలుపెట్టి మెల్లగా ఓటు ఎవరికి వేస్తారు? అంటూ ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా, ఈటల రాజేందర్​కు అనుకూలంగా మాట్లాడిన వాళ్ల పేర్లు నోట్​చేసుకుంటున్నారు. ఇలా సర్వే చేస్తున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల హుజూరాబాద్​ మామిండ్ల వాడలో సిద్దిపేట లీడర్లు స్థానికుల ఫోన్​నంబర్లు సేకరిస్తుండగా, స్థానికులు అడ్డుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. దళితబంధు కోసమే వచ్చారనుకున్న కొందరు, తమ పేర్లు ఎందుకు రాసుకోవడం లేదని నిలదీశారు. కాలనీవాసులంతా పోటీ పడి తమ వివరాలు, ఫోన్​నంబర్లు ఇవ్వడం గమనార్హం.

వాడవాడలా జనాల్ని పోగేసి.. 

సిద్దిపేట నుంచి వచ్చిన లీడర్లు తాము వెళ్లే ముందే ఆ ఏరియాలోని టీఆర్ఎస్​ నేతలకు సమాచారం ఇస్తున్నారు. వీళ్లు వెళ్లేసరికి అక్కడ కులాలు, వర్గాలవారీగా జనాల్ని పోగేస్తున్నారు. ఇదే అదనుగా టీఆర్ఎస్​ లీడర్లు మాస్​క్యాంపెయినింగ్​ నిర్వహిస్తున్నారు. అందరికీ ప్రభుత్వ స్కీములు అందుతున్నాయో లేదో ఆరా తీస్తున్నారు. రానివాళ్ల వివరాలు రాసుకుంటున్నారు.  టీఆర్ఎస్​ తరపున అందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటామని, కేసీఆర్​నిలబెట్టబోయే అభ్యర్థికి మద్దతివ్వాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా కుల సంఘాలతో మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా కులసంఘాల లీడర్లను కలిసి టీఆర్ఎస్​కు మద్దతివ్వాలని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెబుతున్నారు. కాగా ఈ సర్వే, మీటింగుల విషయాన్ని బయటికి రాకుండా నేతలు జాగ్రత్త పడుతున్నారు. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు తమ హుజూరాబాద్‌‌ పర్యటన ఫొటోలు, వీడియోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.  

 సిద్దిపేటకు చెందిన రూలింగ్​పార్టీ‌ లీడర్. టీఆర్ఎస్​ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. పేరు మంచె నర్సింలు. ఈయన ఆధ్వర్యంలోని ఓ టీమ్​శుక్రవారం హుజూరాబాద్​ నియోజకవర్గంలోని కమలాపూర్ లో బీడీ కార్మికులతో సమావేశమైంది. బీడీ కార్మికుల్లో ఎంతమందికి పింఛన్లు రావట్లేదో తెలుసుకొని వాళ్లందరితో అప్లికేషన్లు ఫిల్​చేయించారు. వాటిని వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవోకు అందించారు.