ప్రపంచంలో థర్డ్ వేవ్ మొదలైంది: అలర్ట్‌గా ఉండాలన్న కేంద్రం

ప్రపంచంలో థర్డ్ వేవ్ మొదలైంది: అలర్ట్‌గా ఉండాలన్న కేంద్రం

న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ మొదలైపోయిందని, మనం మరింత అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వ్యాక్సినేషన్ నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్ డాక్టర్ వీకే పాల్ అన్నారు.  ప్రస్తుతం రోజువారీగా ప్రపంచంలో 3.9 లక్షల కేసులు నమోదవుతున్నాయని అన్నారు. మన దేశాన్ని థర్డ్ వేవ్ ముట్టడించకుండా అందరం కలిసి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఢిల్లీలో హెల్త్‌ మినిస్ట్రీ ప్రెస్‌ మీట్ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొదట్లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైన కొత్తలో ప్రపంచ వ్యాప్తంగా రోజువారీగా కేసులు సుమారు 9 లక్షల వరకు నమోదయ్యాయని గుర్తు చేశారు. భారత్‌లో థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో చర్చించడం మానేసి, ఇప్పుడు ఆ ముంపు ఎదుర్కొంటున్నామన్నట్లుగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ చెప్పారని వీకేపాల్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండే కరోనా కేసులు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారని చెప్పారు. కరోనా జాగ్రత్తలు పాటించే విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఇంటి నుంచి అడుగు బయటపెడితే మాస్కు పెట్టుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని మర్చిపోవద్దని సూచించారు.