సిక్కింలో సడలింపులతో ఈనెల 14 వరకు లాక్ డౌన్

సిక్కింలో సడలింపులతో ఈనెల 14 వరకు లాక్ డౌన్

గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం లాక్ డౌన్ ను ఈనెల 14 వరకు పొడిగించింది.  ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా పొడిగింపు  ప్రకటన చేసింది. లాక్డౌన్ కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయడంతో కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మంత్రులు, ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఇతర అధికారులు రాష్ట్రంలో కరోనా లాక్డౌన్.. తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాలు, కరోనా వ్యాప్తి వేగం.. వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. 

కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేస్తూనే ఈ నెలలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న 65 వేల మందికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ వేళలను కాస్త తగ్గించుకుని కొన్ని సడలింపులను ప్రకటించింది. హార్డ్ వేర్ దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయాలు విక్రయించే దుకాణాలకు ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉండగా దానిని మరో రెండు గంటలు పొడిగిస్తూ సాయంత్రం 4 గంటల వరకు తెరచుకునేందుకు అనుమతిచ్చింది.