సిమ్​ బ్లాక్​ చేస్తరు.. కొత్తది తీసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు

సిమ్ స్వాపింగ్ తో దోపిడీకి పాల్పడుతున్న ముఠా

ముంబై గ్యాంగ్ తో కలిసి దోచేస్తున్న నైజీరియన్

శని, ఆదివారాల్లో నైజీరియా నుంచే ఆపరేషన్

సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ముంబై ముఠా

హైదరాబాద్​, వెలుగు: శని, ఆదివారాలు.. అంతా వీకెండ్​ మూడ్​లో ఉండే రోజులు. కానీ, ఓ నైజీరియన్​ ముఠాకు అవే పని రోజులు. వ్యక్తుల ఫోన్​ నంబర్లను టార్గెట్​ చేయడం.. వారి సిమ్​ కార్డులను బ్లాక్​ చేయడం.. అదే నెంబర్​తో కొత్త సిమ్​ తీసుకోవడం.. ఆ నంబర్​తో లింకైన బ్యాంక్​ అకౌంట్లను హ్యాక్​ చేసి ఖాతా ఖాళీ చేయడం. ఇదే వాళ్ల పని. 2011 నుంచి ముంబై అడ్డాగా సాగుతోందీ సిమ్​ స్వాపింగ్​ దోపిడీ. ముంబైకి చెందిన ఈ గ్యాంగ్ లోని ఐదుగురిని  గురువారం సైబరాబాద్   పోలీసులు అరెస్ట్​ చేశారు. 40 ఫేక్​ ఆధార్​ కార్డులు,4 రబ్బర్​ స్టాంపులు, 15 ఫోన్లు, కంపెనీల లెటర్​ ప్యాడ్లు, సిమ్​ కార్డులు, స్వైపింగ్​ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మాస్టర్​మైండ్​ నైజీరియన్​పై రెడ్​కార్నర్​ నోటీసులు జారీ చేశారు. కేసు వివరాలను సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ వెల్లడించారు.

ఫిషింగ్​ మెసేజ్​లు పంపి..

నైజీరియాకు చెందిన జేమ్స్  సిమ్​ స్వాపింగ్​లో మాస్టర్​మైండ్​. నైజీరియా నుంచే ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్స్​ పేరుతో ఫిషింగ్​ మెసేజ్​లను పంపి కార్పొరేట్​ కంపెనీల మెయిల్స్​నూ హ్యాక్​ చేసేవాడు. కంపెనీల బ్యాంక్​ అకౌంట్స్​, నెట్​ బ్యాంకింగ్​, ఆ అకౌంట్లతో లింకైన ఫోన్​ నంబర్ల వివరాలు సేకరించేవాడు. ఆ వివరాలతో దోపిడీలకు పాల్పడేందుకు ముంబైలో మీరారోడ్​కు చెందిన చంద్రకాంత్​ సిద్ధాంత్​ కాంబ్లే (34)తో కలిసి  గ్యాంగ్​ను ఏర్పాటు చేశాడు. ముంబైకే చెందిన అహ్మద్​ మునీర్​(28), సోహెబ్​ షేక్​(25), ఆదిల్​ హసన్​ అలీ సయీద్​(32), జునైద్​ అహ్మద్​ షేక్​(32), అశ్విన్​ నారాయణ షేర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(40)లను ఆ ముఠాలో చేర్చాడు. వీళ్లు శని, ఆదివారాల్లో ఆ ఫోన్​ నంబర్లను బ్లాక్​ చేసి.. హ్యాక్​ చేసిన కంపెనీల ఫేక్​ లెటర్​ ప్యాడ్లతో అదే నెంబర్​పై కొత్త సిమ్​కార్డులు తీసుకునేవాళ్లు. తర్వాత రాత్రి 11.30 నుంచి ఒంటి గంట మధ్యలో నైజీరియా నుంచే జేమ్స్​ నెట్​ బ్యాంకింగ్​ చేసేవాడు. చంద్రకాంత్​ తన వద్ద ఉన్న ఫోన్​ నంబర్లకు వచ్చే ఓటీపీలను జేమ్స్​కు చెప్పేవాడు. ఐఎంపీఎస్​ ద్వారా సొమ్ము కాజేసేవాడు. ట్రాన్సాక్షన్​ అయ్యాక ఆ మొత్తాన్ని ముంబై గ్యాంగ్​ అకౌంట్​లోకి పంపించేవాడు. కమీషన్​ పోనూ మిగతా డబ్బును బిట్​కాయిన్స్​, హవాలా రూపంలో తిరిగి జేమ్స్​కు ముంబై ముఠా పంపించేది.

గంటల వ్యవధిలోనే..

గతేడాది జూన్​ 21న మాదాపూర్​లోని  ఓ కంపెనీకి చెందిన వ్యక్తి సిమ్​కార్డ్​ బ్లాక్​ అయింది. సర్వీస్​ ప్రొవైడర్​ కస్టమర్​ కేర్​కు ఫోన్​ చేస్తే.. ఆ నంబర్​తో మరో సిమ్​ కార్డు తీసుకున్నట్టు చెప్పారు. దీంతో తన కొటక్​ మహీంద్రా బ్యాక్​ అకౌంట్​లోకి నెట్​బ్యాంకింగ్​ లాగిన్​ కోసం ప్రయత్నించాడు. నెట్​బ్యాంకింగ్​ ఐడీ, పాస్​వర్డ్​ మారినట్టు తెలుసుకున్నాడు. తర్వాత కొద్ది సేపటికే రూ.4.25 లక్షలు అతడి ఖాతా నుంచి మాయమయ్యాయి. మూడు ట్రాన్సాక్షన్లతో ఆ సొమ్మును ముఠా కొట్టేసింది. దీంతో సైబరాబాద్​ సైబర్​క్రైమ్​ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అక్టోబర్​లోనూ మరో బాధితుడి అకౌంట్​ నుంచీ రూ.6.75 లక్షలు కొల్లగొట్టారు. ఈ రెండు కేసుల్లో బాధితుల బ్యాంకు ఖాతాల ఆధారంగా ముంబై గ్యాంగ్​ సొమ్మును దోచేసినట్టు పోలీసులు గుర్తించారు.

సిమ్​కార్డులు హ్యాక్​ అవుతయ్​

ఫిషింగ్​ మెయిల్స్​, లింక్స్​తో జాగ్రత్తగా ఉండండి. నెట్​బ్యాంకింగ్​, బ్యాంక్​ అకౌంట్స్​తో లింకైన ఫోన్​ నంబర్లను బయటి వాళ్లకు ఇవ్వొద్దు. సిమ్​ కార్డులు హ్యాక్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిమ్​లో ఎలాంటి సమస్యలొచ్చినా సర్వీస్​ ప్రొవైడర్లను వెంటనే సంప్రదించాలి. సిమ్​ కార్డు పోయినా,
బ్లాక్​ అయినా వెంటనే కంపెనీకి కంప్లయింట్ చేయాలి. – సజ్జనార్​, సైబరాబాద్​ సీపీ

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ

Latest Updates