ఆరు నెలలుగా జీతాల్లేక.. ప్రైవేటు స్కూల్ టీచర్ల గోస

కరోనా ఎఫెక్ట్​తో మార్చి నుంచి  జీతాలివ్వని మేనేజ్​మెంట్లు

రోడ్డునపడ్డ 3 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ బతుకులు

ఇల్లు గడవక పనుల కోసం దేవులాట

ఆన్ లైన్ క్లాసుల్లో కొందరికే డ్యూటీ

వారికీ సగం జీతమే… అదీ ఫీజులు కట్టిస్తేనే..

ప్రైవేటు టీచర్ల బతుకులు ఆగమైతున్నయ్. కరోనా ఎఫెక్ట్​తో ఆరు నెలలుగా జీతాలు రాక కడుపులు మాడ్చుకుంటున్నరు. కన్న బిడ్డలకు నాలుగు ముద్దలు కూడా పెట్టలేని తమ దుస్థితిని తలచుకొని గోస పడ్తున్నరు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. ఎవరన్నా పనికి పిలుస్తరా అని ఎదురుచూస్తున్నరు. కొందరు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటే.. ఇంకొందరు అడ్డా కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా మారిపోయిన్రు. మరికొందరు చికెన్​ సెంటర్​లోనో, హోటల్​లోనో వర్కర్లుగా చేరిపోయిన్రు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే నాన్​ టీచింగ్​ స్టాఫ్​ పరిస్థితీ ఇట్లనే ఉంది. జీతాలు ఆపొద్దని, ఏడాదిలో 12 నెలలు జీతాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ ఆర్డర్స్​లో ఉన్నా.. స్కూల్​ మేనేజ్​మెంట్లు పట్టించుకోవడం లేదు.
సర్కారన్నా ఆదుకుంటదంటే..  అదీ లేదు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచింగ్‌‌, నాన్‌‌ టీచింగ్‌‌ స్టాఫ్​పై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. మార్చి 16 నుంచి బడులు మూతపడ్డాయి. దీంతో మెజార్టీ మేనేజ్​మెంట్లు.. వాళ్లకు జీతాలు ఇవ్వడం ఆపేశాయి. కొన్ని స్కూళ్లలోనైతే జనవరి, ఫిబ్రవరి నుంచి కూడా జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో టీచింగ్​, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 11 వేల వరకు ప్రైవేటు స్కూళ్లుండగా.. వాటిలో రెండు లక్షల మందికి పైగా టీచర్లు, మరో లక్షమందికి పైగా నాన్ టీచింగ్ స్టాఫ్​ ఉన్నారు. దాదాపు చాలా మంది టీచర్లు పీజీలు, బీఈడీలు చేసిన వాళ్లే. వీరిలో కొందరు టెట్ క్వాలిఫైడ్​ వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో కొందరు నెలకు రూ. 5 వేల శాలరీ తీసుకునే వాళ్లు ఉండగా.. ఇంకొందరు రూ. 10వేల నుంచి 30 వేల వరకూ శాలరీ తీసుకునేవాళ్లు ఉన్నారు. అయితే.. కరోనా ఎఫెక్ట్​తో స్కూళ్లు బందైనప్పటి నుంచి బతుకులు రోడ్డునపడ్డాయి. ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారో.. ఎప్పుడు డ్యూటీలోకి తీసుకుంటారో తెలియని పరిస్థితి.

ఏండ్లపాటు వారి సేవలను వాడుకున్న మేనేజ్మెంట్లు కష్టకాలంలో వారి వైపు కన్నెత్తి చూడట్లేదు. నెల  నుంచి ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తూ.. స్టూడెంట్ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా.. టీచర్లకు, స్టాఫ్​ను ఆదుకోవడం లేదు. కొంత మంది స్టాఫ్​నే డ్యూటీలోకి తీసుకొని.. వారికి కూడా ఫీజులు వసూలు చేస్తేనే జీతాలు ఇస్తామంటూ కండిషన్లు పెడుతున్నాయి.

సర్కారు చెప్పినా ఇవ్వట్లే…

మార్చి16 తర్వాత బడులు ఓపెన్​ చేయకపోవడంతో టీచర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఏప్రిల్, మే నెలల్లో ఇంటి నుంచి బయటకు వస్తే ఎక్కడ కరోనా వస్తుందోనని చాలా మంది బయటకు వెళ్లలేదు. జీతాలు రాక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకున్నారు.  కరోనా తగ్గకపోవడంతో సిటీల్లో పని చేస్తున్న చాలామంది టీచర్లు సొంతూళ్లకు చేరుకున్నారు. సిటీల్లోనే ఉన్న టీచర్లు ఇంటి కిరాయిలు, కరెంట్ బిల్లులు కట్టేందుకూ అవస్థలు పడుతున్నారు. ఊళ్లకు వెళ్లిన టీచర్లు ఉపాధి హామీ పనులు, వ్యవసాయ కూలీ పనులను వెతుక్కుంటున్నారు. సిటీల్లో ఉన్న టీచర్లు ప్రైవేటు కంపెనీల్లో డైలీ వైజ్ కూలీలుగానో.. సెక్యూరిటీ గార్డులుగానో.. సెల్స్ వర్కర్స్​గానో.. కూరగాయలు అమ్ముకొనో బతుకు బండి నెట్టుకొస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలోని స్టాఫ్​కు ఏడాదిలో 12 నెలలు జీతాలు ఇవ్వాల్సిందేనని జీవో నెంబర్​ 1 అమలులో ఉన్నా.. మేనేజ్​మెంట్లు పట్టించుకోవట్లేదు. కరోనా కష్టకాలంలో జీతాలు ఆపొద్దని ప్రభుత్వం జీవో నెంబర్​ 45ను జారీ చేసినా మేనేజ్​మెంట్లు బేఖాతరు చేస్తున్నాయి.

ఆన్​లైన్​ క్లాసులు స్టార్టయినా..

అఫీషియల్​గా సెప్టెంబర్​ 1 నుంచి ఆన్​లైన్​ క్లాసులు స్టార్టయినా.. అన్​ అఫీషియల్​గా ఒక నెల ముందు నుంచే ప్రైవేటు స్కూళ్లలో ఆన్​లైన్​ క్లాస్​లు మొదలయ్యాయి. హైదరాబాద్​లోని చాలా స్కూళ్లు గ్రూపుగా ఏర్పడి ఆన్​లైన్ యాప్ ఏజెన్సీల సాయంతో క్లాసులు నడిపిస్తున్నాయి.  ఆ యాప్స్​ద్వారా ఒకేసారి ఐదారు స్కూళ్ల స్టూడెంట్స్​ వినేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. దీంతో టీచర్లతో పెద్దగా పనిలేకుండా పోయింది. ఒక్కో స్కూల్​లో కొద్దిమంది టీచర్లనే తీసుకొని, వారితో క్లాసులను ఫాలోఅప్​ చేయిస్తున్నారు. 20 మంది టీచర్లున్న బడుల్లో కేవలం ముగ్గురు, నాలుగురినే తీసుకుంటున్నారు. ఎక్కువ బ్రాంచ్​లున్న ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్లయితే ఒకే బ్రాంచ్​కు సరిపడా టీచర్లను డ్యూటీలోకి రావాలని సూచిస్తున్నాయి. వారితోనే క్లాసులు చెప్పిస్తున్నాయి. మిగిలిన వారంతా ఖాళీగానే ఉంటున్నారు. ప్రస్తుతం స్కూళ్లకుపోతున్న వారికి కూడా పూర్తి జీతం ఇవ్వడం లేదు. సగం జీతమే ఇస్తున్నారు. ఆ టీచర్లు స్టూడెంట్ల పేరెంట్స్​ నుంచి ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆన్​లైన్ క్లాసులను మానిటర్ చేయాల్సి వస్తోంది. హైదరాబాద్​తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

నాన్​ టీచింగ్ సిబ్బంది అష్టకష్టాలు

ప్రతి స్కూల్​లో స్వీపర్లు, అటెండర్లు, ఆయాలు, బస్​డ్రైవర్లు, క్లీనర్లతో పాటు ఆఫీస్ స్టాఫ్ కూడా ఉంటారు. ఆన్​లైన్​ క్లాసులు స్టార్టయినప్పటిన ఉంచి కేవలం ఒక స్వీపర్, ఒకరిద్దరు ఆఫీస్ ​స్టాఫ్​తోనే స్కూల్స్​ను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో లక్ష మందికి పైగా పైగా నాన్ టీచింగ్ సిబ్బంది ఉంటే 20 వేలమందిని కూడా డ్యూటీల్లోకి  తీసుకోలేదు. దీంతో మిగిలిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరు నెలలుగా జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కష్టంగా బతుకును నెట్టుకొస్తున్నారు.

సదువు చెప్పిన చేతులతోనే సంచులు కుడుతున్న

నేను బీఎస్పీ (మాథ్స్), డీఎడ్ చదివిన. కొన్నేండ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లల్లో హిందీ, గణితం చెప్పేవాన్ని. పది వేల వరకు జీతం వచ్చేది. కరోనా మా జీవితాలను అతలాకుతలం చేసింది. స్కూళ్లు నడవకపోయేసరికి రోజు గడవటం కష్టమైంది. దీంతో మండలంలోని రైస్, సీడ్ మిల్లుల్లో సంచులు కుడుతూ, బస్తాలు మోస్తూ ఇంత సంపాదించుకుంటున్నా.- సదానందం, మొలంగూర్ గ్రామం, శంకరపట్నం మండలం, కరీంనగర్‌ జిల్లా.

సెక్యూరిటీ గార్డుగా

ఈ ఫొటోలో  కనిపిస్తున్న వ్యక్తి పేరు కృష్ణారెడ్డి. సొంతూరు మెదక్ జిల్లా తూప్రాన్. 20 ఏండ్ల నుంచి పలు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ గా పనిచేస్తున్నారు. హైస్కూల్ స్టూడెంట్స్ కు మాథ్స్ తో పాటు ఇంగ్లిష్ సబ్జెక్ట్ లు చెప్తుంటారు.  నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల దాకా శాలరీ వచ్చేది. ఆరు నెలల నుంచి స్కూళ్లు మూతపడటంతో జీతాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో కృష్ణారెడ్డి ఓ కంపెనీ లో సెక్యూరిటీ గార్డుగా చేరిపోయారు.

కైకిలికి పోతున్న

ఆరేండ్లుగా ఓ ప్రైవేటు స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్న. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తరో తెల్వదు. నా భర్త ఐటీఐ చేసి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నడు. స్కూల్​లో వచ్చే జీతంతోనే కుటుంబం నడిచేది. ఆరునెలల నుంచి జీతాలు లేవు. నేను కైకిలికి పోతున్న. మొన్నటిదాక పొలాల్లో నాట్లకు పోయేదాన్ని. ఇప్పుడు  కలుపు తీయడానికి పోతున్న. – కె.భాగ్యలక్ష్మి, యన్మన్ గండ్ల,  మహబూబ్​నగర్

చికెన్​ సెంటర్​లో..

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఎం కిరణ్. ఈయనది వరంగల్ అర్బన్  జిల్లా  భీమదేవరపల్లి మండలం కొవ్వురు. దాదాపు 20 ఏండ్లుగా వివిధ స్కూళ్లలో టీచర్​గా పనిచేస్తున్నారు. బడులు బంద్ కావడంతో జీతం రాక, అప్పులు తెచ్చి కొంత కాలం కుటుంబాన్ని నడిపారు.
ఆ అప్పులు ఎలా కట్టాలో అర్థంకాక, తప్పనిసరి పరిస్థితుల్లో చికెన్ సెంటర్​లో పనికి కుదిరారు.

కూరగాయలు అమ్ముతున్న

ఎమ్మెస్సీ బీఈడీ చేసిన నేను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేసేవాడ్ని. నెలకు రూ.20 వేల జీతం వచ్చేది. స్కూళ్లు బంద్ అవడంతో సొంతూరుకు వచ్చి కూరగాయల వ్యాపారం చేస్తున్న. ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి.-ఎం.కాశి, కురవి, మహబూబ్ నగర్ జిల్లా.

కూలీ పనికి పోతున్న

నేను ఓ ప్రైవేట్ స్కూల్లో హిందీ పండిట్ గా పనిచేస్తున్న. నెలకు జీతం రూ. 15వేలు ఇచ్చేవాళ్లు. 6 నెలలుగా జీతం వస్తలేదు. కుటుంబ పోషణకు రోజువారీ కూలిగా మారాల్సి వచ్చింది. పని దొరకకపోతే మా  కుటుంబం పస్తులె.- నదీమ్​ పాషా, భూపాలపల్లి

సీఎం జోక్యం చేసుకోవాలి

ప్రైవేటు స్కూల్ మేనేజ్​మెంట్లు సర్కారు ఆదేశాలను, జీవోలను, చట్టాలను పట్టించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ మండల స్థాయి నుంచి రాష్ట్ర అధికారులందరినీ కలిసి వినతిపత్రాలు ఇచ్చినం. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పదుల సార్లు కలిసినం. అయినా ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. సీఎం కేసీఆర్​ జోక్యం చేసుకోవాలి. – షబ్బీర్ అలీ,
ప్రైవేటు టీచర్స్​ ఫోరం స్టేట్​ ప్రెసిడెంట్.

Latest Updates