సింగరేణికి  ప్రతిష్టాత్మక ‘ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు’

అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్  2018 సంవత్సరానికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీని ఎంపిక చేసింది. ఈ  అవార్డును మార్చ్ 8, 2019 న ముంబై లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో అందివ్వనున్నారు. అవార్డు తీసుకునేందుకు రావాలని.. సింగరేణి  సీఎండీ ఎన్.శ్రీధర్ ను సంస్థ ఆహ్వానించింది.

ఏటా ఇండియాలో కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛంధంగా అధ్యయనం చేసి, అత్యుత్తమ సంస్థను “ఇండియాస్ బెస్ట్ కంపెనీగా ఎంపిక చేసి అవార్డును బహుకరిస్తారు. ఎల్ అండ్ టీ, హిందూస్తాన్ లీవర్, రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్, ఓ.ఎన్.జి.సి., ఇండియన్ ఆయిల్ కంపెనీ లాంటి భారత దిగ్గజ కంపెనీలకు ఈ అవార్డ్ దక్కింది.

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా… భారత ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్న సంస్థగా సింగరేణి కాలరీస్ కంపెనీని ” ఇండియాస్ బెస్ట్ కంపెనీ ” గా నిపుణుల కమిటీ తమ అధ్యయనం ద్వారా ఎంపిక చేసినట్టు బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వివరించింది.

సింగరేణి సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 646 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 620 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి , రూ. 22,667 కోట్ల టర్నోవర్ తో పాటు రూ.1200 కోట్ల రూపాయల లాభాలను సాధించింది.  ఇవి అంతకముందు ఏడాది సాధించినదానికన్నా ఎంతో ఎక్కువ. 2013-14 తో పోలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు రవాణాలో 34 శాతం వృద్ధి, బొగ్గు ఉత్పత్తిలో 22.9 శాతం, లాభాలలో 186 శాతం వృద్ధిని నమోదు చేసింది ఈ సంస్థ.

సంస్థలోని అందరి కృషికి ఈ అవార్డు ఓ గుర్తింపు లాంటిదని సీఎండీ శ్రీధర్ అన్నారు.

Latest Updates