డీజీల్ ఖర్చు తగ్గించేందుకు సింగపూర్ కొత్త ప్లాన్

ఎండలు దంచి కొడుతుండటంతో సింగపూర్‌‌లో ఏసీ బస్సులు లీటర్లకు లీటర్లు డీజిల్‌‌ను తాగడం మొదలుపెట్టాయి. బస్సు, ఏసీ రెండూ డీజిల్‌‌ను జుర్రేస్తుండటంతో సింగపూర్‌‌ సర్కారు ‘ఇదెక్కడి లొల్లిరా’ అనుకుంది. ఆఫీసర్లను పిలిచి ఓ మంచి ఐడియా చెప్పమంది. ఇంకేముంది ఎండ దిగొచ్చే ఐడియా చెప్పారు వాళ్లు. బస్సులపై మొక్కల మ్యాట్‌‌లు పెట్టమన్నారు. దీంతో బస్సులో వేడి, ఏసీపై ఒత్తిడి తగ్గి డీజిల్‌‌ ఖర్చు తగ్గుతుందన్నారు. దీనికే ‘గార్డెన్‌‌ ఆన్‌‌ ద మూవ్‌‌’ అని పేరు పెట్టారు.

మొదలై మూడ్రోజులు

‘గార్డెన్‌‌ ఆన్‌‌ ద మూవ్‌‌’ బస్సులను సింగపూర్‌‌లోని లేక్‌‌ సైడ్‌‌ గార్డెన్‌‌ ప్రాంతంలో మే 5న తొలిసారి ప్రారంభించారు. ఇలాంటి బస్సులు మొదలవడం ఆసియాలోనూ మొదటిసారే. తొలుత చిన్న మార్గాల్లో ఈ సర్వీసులు ప్రారంభించారు. ప్రస్తుతం చైనీస్‌‌ గార్డెన్‌‌ ఎంఆర్టీ స్టేషన్‌‌ నుంచి సింగపూర్‌‌ గార్డెన్‌‌ ఫెస్టివల్‌‌ హార్టికల్చర్‌‌ షో జరుగుతున్న లేక్‌‌ సైడ్‌‌ గార్డెన్‌‌ వరకూ తిరుగుతున్నాయి. వీటి ద్వారా బస్సులోని వేడి తక్కువై ఆయిల్ ఏమైనా ఆదా అవుతుందా? అని చెక్‌‌ చేయనున్నారు. వీటి రూపకర్త జీడబ్ల్యూఎస్‌‌ లివింగ్‌‌ ఆర్ట్‌‌. టేమాసేక్‌‌ ఫౌండేషన్‌‌ ఫండ్స్ ఇస్తోంది నేషనల్‌‌ పార్క్స్‌‌ బోర్డ్‌‌, మూవ్‌‌ మీడియా, సింగపూర్‌‌ గ్రీన్‌‌ బిల్డింగ్‌‌ కౌన్సిల్‌‌ సాయమందిస్తున్నాయి.

మట్టి లేకుండా పెంచిన మొక్కలతో..

ప్రాజెక్టులో భాగంగా ప్రతి బస్సుపై మట్టి లేకుండా పెంచిన గడ్డి, ఇతర మొక్కలున్న మ్యాట్‌‌ను సెట్‌‌ చేస్తారు. ప్రతి మ్యాట్‌‌ బరువు 25 నుంచి 40 కేజీలు, పొడవు 1.8 మీటర్లు, వెడల్పు 1.05 మీటర్లు ఉంటుంది. స్థానిక వాతావరణానికి అలవాటు పడిన మొక్కలనే రూఫ్‌‌లపై వాడుతున్నారు. తేమ, గాలి, వేడి, పొడి వాతావరణాన్ని ఇవి ఈజీగా తట్టుకోగలవు. సాధారణంగా వాడే మట్టికి బదులు రాక్‌‌ వూల్‌‌ మెటీరియల్‌‌ను ఈ మొక్కలకు వాడారు. వీటినే గయా మ్యాట్‌‌లు అంటారు. వీటిని బస్సులపై ఈజీగా సెట్‌‌ చేయొచ్చు. ఈ మొక్కలను రోజూ చెక్‌‌ చేయాల్సిన అవసరం లేదు. నీరు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. వారానికోసారి చూస్తే సరిపోతుంది. మట్టితో తయారు చేసిన మ్యాట్‌‌లను వాడితే నెలకోసారి మెయింటెనెన్స్‌‌ తప్పనిసరి. అదే గయామ్యాట్‌‌తోనైతే ఏడాదికి రెండు, మూడు సార్లయితే సరిపోద్ది.

మూడు నెలలు ట్రయల్స్‌‌

మూడు నెలల పాటు ఈ బస్సులను పరిశీలిస్తారు.  పని తీరు ఆధారంగా మరిన్ని బస్సులపై ఏర్పాటు చేయాలో వద్దో నిర్ణయిస్తారు. ఈ మ్యాట్‌‌ల ద్వారా బస్సుల్లోపల వేడి తగ్గి ఏసీలకు వాడే ఇంధనం ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. ఇంటిపై పెంచుకునే మొక్కల మాదిరి బస్సులపైనా గ్రీన్‌‌ రూఫ్‌‌ ఏర్పాటు చేశామని నేషనల్‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌ సింగపూర్‌‌కు చెందిన టెర్రెన్స్‌‌ టాన్‌‌ చెప్పారు. ఎండలు మండే సమయంలోనూ వీటి ద్వారా వేడి 20 నుంచి 30 డిగ్రీలు తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. నగరాలన్నీ ప్రకృతితో మమేకమవ్వాల్సిన అవసరముందని, ఈ ప్రాజెక్టు ద్వారా నగరాలకు గ్రీన్‌‌ రూఫ్స్‌‌ ఎంత అవసరమో ప్రజలకు అవగాహన వస్తుందని జీడబ్ల్యూఎస్‌‌ లివింగ్‌‌ ఆర్ట్‌‌ వ్యవస్థాపకుడు జాక్‌‌ తోహ్‌‌ చెప్పారు.

 

Latest Updates