ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు..

హైదరాబాద్: ఆస్ట్రేలియా టూర్ లో అదరగొట్టిన టీమిండియా బౌలర్.. మన హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి దగ్గరకు వెళ్లాడు. తండ్రి మహమ్మద్ గౌస్ సమాధి వద్ద నివాళులర్పించి కంటతడిపెట్టుకున్నాడు .   తండ్రి కల నెరవేర్చినందుకు  ఆనందంగా ఉన్నా.. నువ్వు భౌతికంగా దూరం కావడం భరించలేకపోతున్నానంటూ.. గద్గద స్వరంతో సన్నిహితులతో వాపోయాడు. సిరాజ్ ను టీమిండియా క్రికెటర్ గా చూడడం కోసం హైదరాబాద్ లో ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించిన మహమ్మద్ గౌస్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. తన కొడుకు టీమిండియాకు ఎంపికై ఆస్ట్రలియా పర్యటనకు వెళ్లిన ఆనందం ఆస్వాదించేలోపే తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్ లో ఉన్న సిరాజ్.. తన తండ్రి చనిపోయినా.. చివరి చూపునకు నోచుకోలేకపోయాడు. క్రికెట్.. కరోనా నిబంధనల నేపధ్యంలో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. తాను టీమిండియాకు ఆడి.. రాణించడమే తన తండ్రి ఆశయం కాబట్టి.. ఆయన ఆశయం నెరవేర్చే సమయంలో.. వెనుదిరిగి వచ్చేందుకు నిరాకరించాడు. తండ్రి అంత్యక్రియలను ఫోన్లోనే లైవ్ చూసి విలపించాడు మహమ్మద్ సిరాజ్. తండ్రి పోయిన బాధ నుండి తేరుకునేందుకు తోటి క్రికెటర్లు ఎంతో ధైర్యం చెప్పి ఓదార్చిన ఘటన తెలిసిందే. ఈ నేపధ్యంలో గత నెల 26వ తేదీన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తో.. టెస్టుల్లోనూ అరంగేట్రం చేసి సీనియర్లు లేని లోటు తీర్చాడు. టెస్టుల్లో 13 వికెట్లు తీసినా.. భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన గబ్బా మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో.. ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని స్వదేశానికి తిరిగి రాగా… శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన మహమ్మద్ సిరాజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సొంత గడ్డకు చేరుకున్న సందర్భంగా కొద్దిసేపు ఉద్విగ్నతకు లోనైన సిరాజ్.. నేరుగా తండ్రి సమాధి వద్దకు తరలివెళ్లి నివాళులర్పించాడు.

ఇవి కూడా చదవండి..

డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణికి బెయిల్

EWS‌ రిజర్వేషన్లకు కేసీఆర్ సై..

అఖిలప్రియ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

వైరల్ వీడియో: హలో.. నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా

Latest Updates