లాక్ డౌన్ సడలింపు ఇవ్వండి.. లేకపోతే సచ్చిపోతం

రాజన్నసిరిసిల్ల,వెలుగు కరోనా లాక్​డౌన్​తో సిరిసిల్ల నేతన్నలు ఉపాధి కరువై విలవిలలాడిపోతున్నారు. ఏండ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఈ మధ్యే బయటపడి కోలుకుంటున్న తరుణంలో కరోనా రూపంలో మరోసారి పిడుగు పడింది. లాక్​డౌన్​ మే 7 వరకు ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. వ్యవసాయ రంగానికి అనుమతి ఇచ్చినట్లుగానే తమకూ ఆంక్షలతో కూడిన సడలింపు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

కార్మిక క్షేత్రం సిరిసిల్ల..

దేశంలోనే అత్యధికంగా పవర్​లూం వర్కర్​, మరమగ్గాలు ఉన్న ప్రాంతం సిరిసిల్ల. వందలాది మంది నేత కార్మికులు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఆకలి చావులకు బలయ్యారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా బతుకమ్మ చీరల ఆర్డర్లు రూ.300 కోట్లు, ఇతర ఆర్డర్లతో ఊరట దొరికింది. కానీ..లాక్​డౌన్​తో మళ్లీ పరిశ్రమకు గడ్డుకాలం దాపురించింది.

సిరిసిల్లలో 80 శాతం చిన్నతరహా పరిశ్రమలే..

జిల్లా కేంద్రంలో 80 శాతం చిన్నతరహా పరిశ్రమలే ఉన్నాయి. వీటిని కుటీర పరిశ్రమల లాగా ఇంట్లోనే రెండు మూడు జోడిల సాంచెలు వేసుకొని నడిపించుకుంటున్న ఆసాముల సంఖ్యనే ఎక్కువ. వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య, అనుబంధ సంఘాల కార్మికులతో కలిపి.. సుమారుగా 30 వేల మంది కార్మికులున్నారు. వీరిలో 3వేల మంది వలస కార్మికులు. లాక్​డౌన్​తో 30 వేలకు పైగా మరమగ్గాలు బంద్​ పడ్డాయి. ప్రభుత్వ ఇచ్చే రూ.1500 సాయం, 12 కిలోలో బియ్యం సరిపోవడం లేదంటున్నారు. వ్యవసాయ రంగం లెక్కనే తమకూ అనుమతినిస్తే రూల్స్​ పాటిస్తూ సాంచెలు నడుపుకుంటామంటున్నారు. మంత్రి కేటీఆర్​..సీఎం కేసీఆర్​తో మాట్లాడి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పనిలేకపోతే సచ్చిపోతరు

పనిలేకపోతే కార్మికులు సచ్చిపోతరు. పాత రోజులు మళ్లొస్తయి. ఇప్పటికే తిండికి పైసలు లేక ఇబ్బందులు పడుతున్నరు.ఇండ్లల్లో ఉన్న  చిన్న పరిశ్రమలకు రూల్స్​పెట్టి అనుమతివ్వండి. ఒక్కరం లేదా ఇద్దరమే పని చేస్తం.
-సామల ఆంజనేయులు,

సిరిసిల్ల నేత కార్మికుడు

చిన్నతరహా పరిశ్రమలకు అనుమతి ఇవ్వండి

80 శాతం చిన్నతరహా పరిశ్రమలే ఉన్నయ్​. వేలాది మంది కార్మికుల కోసం ఆంక్షలతో పర్మిషన్​ ఇవ్వండి.  ఏ రూల్​ పెట్టినా మేం పాటిస్తం. -ఎల్ధండి శంకర్​,

చిన్నతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షులు

సామాజిక దూరం పాటిస్తం

వస్త్రోత్పత్తికి అనుమతిస్తే సామాజిక దూరాన్ని పాటిస్తూనే.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నరు. కార్మికుల ఇబ్బందులను మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్తాం.  -మంచె శ్రీనివాస్​,

మున్సిపల్​ వైస్​ చైర్మన్​, సిరిసిల్ల

Latest Updates