రామయ్యతో సీతమ్మ సమానమే.. సీతామడిపై పెరుగుతున్న డిమాండ్స్

న్యూఢిల్లీ: హిందువులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం ఎట్టకేలకు ఆరంభమైంది. ఈ నెల 5న అయోధ్యలో వైభవంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంతో రాముడి ఆలయ పనులు షురూ అయ్యాయి. ఇప్పుడు సీతమ్మకు కూడా దేవాలయం నిర్మించాలని డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా బిహార్‌‌లోని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకొస్తున్నాయి. సీత పుట్టిన స్థలంగా చెప్పుకునే జానకి జన్మభూమి అయిన సీతామడీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని రాష్ట్రంలోని అధికార జేడీయూ మిత్రపక్షం, కేంద్రంలోని రూలింగ్ బీజేపీని కోరింది. ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తూ లెటర్‌‌ను పంపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయంపై తమ వాణిని గట్టిగా వినిపించాలని జేడీయూ భావిస్తోంది.

‘ఒకవేళ అయోధ్యలా సీత జన్మభూమి అయిన సీతామడీ కూడా అభివృద్ధి చెందితే మన దేశ శ్రేయస్సు, పర్యాటకం వృద్ధి చెందుతుంది. దీనిపై ప్రధాని మోడీకి మేం లెటర్‌‌ కూడా రాశాం. వచ్చే పార్లమెంట్ సెషన్‌లో అన్ని సంస్థలు కలిసేందుకు యత్నిస్తాం’ అని జేడీ (యూ) ఎంపీ సునీల్ కుమార్ తెలిపారు. సీతమ్మ లేకుండా శ్రీరాముడ్ని ఊహించలేమని ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ చెప్పారు. ‘80వ దశకానికి ముందు నార్త్‌ ఇండియాలో జై సీతారామ్, సియారామ్ లాంటి నినాదాలు వినిపించేవి. సియా రామ్ నుంచి జై శ్రీ రామ్‌కు మారింది. ఈ ప్రయాణంలో ఎక్కడో సీతమ్మను మనం కోల్పోయాం’ అని మనోజ్ పేర్కొన్నారు.

Latest Updates