మన ఆర్థిక వ్యవస్థపై మాటల మిసైళ్లు!

ఇద్దరూ మర్యాదస్తులే. ఎప్పుడూ మాటలు మీరకుండా వ్యవహారాన్ని చక్కబెట్టే సమర్థులే. తమకు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే కార్యదక్షులే. ఇండియన్​ ఎకానమీకి ఒకరు మత్తు వదిలించి నడిపిస్తే… వచ్చే అయిదేళ్లలో పరుగులు పెట్టించాలని మరొకరు అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య మాటల మిస్సైళ్లు అటు ఇటూ దూసుకెళ్తున్నాయి. వాళ్లే మాజీ ప్రధాని మన్మోహన్​, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఎకానమీ లక్ష్యంలో మోడీ సర్కారు కలగంటున్నదని మన్మోహన్​ అంటుంటే… కల కాదు నిజం చేస్తామంటున్నారు నిర్మల.

పాతికేళ్ల క్రితం మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితాల్ని ఇప్పుడు ఇండియా రుచి చూస్తోంది. ప్రపంచ ఎకానమీలో మన దేశానిది అయిదో స్థానం.  ఒకానొకప్పుడు ఇండియాని వలస రాజ్యంగా పాలించిన ఫ్రాన్స్​, బ్రిటన్​ లాంటి దేశాల్ని వెనక్కి నెట్టేసింది.  ఈ రోజున ఇండియన్ల కొనుగోలు శక్తి (పీపీపీ) బాగా పెరిగింది. ఈ పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే… ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న  ఇండియన్​ ఎకానమీని వచ్చే అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై అనేక వర్గాలనుంచి విమర్శలు, ఆక్షేపణలు వస్తున్న మాట నిజం.

తాజాగా దేశ ఆర్థిక పరిస్థితి, బ్యాంకింగ్​ మోసాలు, జీడీపీలో తగ్గుదల వంటి ఎకానమీ సంబంధిత అంశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.  ఎకానమీ ఆశాజనకంగా లేదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్​ సింగ్​ కామెంట్​ చేశారు. ‘అయిదేళ్లుగా పదవిలో ఉంటూ, మరో అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగడానికి జనం నుంచి ఆమోదం పొందిన ప్రభుత్వం… ఇప్పటికైనా ఎకానమీ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేయాల’ని సలహా ఇచ్చారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఎకానమీకి సంబంధించి తలపెట్టిన మార్పులు, ప్రగతి పాలసీలు రూపొందించిన ఎకానమిస్ట్ మన్మోహన్​ సింగ్​. 1991–96 మధ్య ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్​ సింగ్​ ప్రవేశపెట్టిన పాలసీలను, 2004–2014 మధ్య పదేళ్లలో స్వయంగా తానే ప్రధాని హోదాలో నడిపించారు.​ ఇంత అనుభవం ఉన్నవారు కనుకనే మన్మోహన్​ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఒక సాధారణ రాజకీయ నాయకుడు చేసిన కామెంట్​లాంటిది కాదు అది.

దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఘాటుగా స్పందించారు. ఆమె ప్రస్తుతం వాషింగ్టన్​ (అమెరికా)లో జరుగుతున్న ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) వార్షిక సమావేశంలో ఉన్నారు. మన్మోహన్​ కామెంట్ల గురించి మీడియా అడగడంతో… ‘నేను బ్లేమ్​ గేమ్ (ఇతరులపై తప్పు నెట్టేయడం)​ జోలికి వెళ్లాలనుకోవడం లేదు.  గతంలో పబ్లిక్​ సెక్టార్​ బ్యాంకుల్లో అనేక అవకతవకలు జరిగాయి. మా ప్రభుత్వం సర్కారీ బ్యాంకుల్లో పేరుకుపోయిన మురికిని తొలగించాలనుకుంటోంది. రుణాల్ని ఎగ్గొట్టినవాళ్ల భరతం పట్టాలనుకుంటోంది’ అన్నారు. ఎవరినీ పేరు పెట్టి తిట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ… ఎవరి హయాంలో బ్యాంకింగ్​ వ్యవస్థ నాశనమయ్యిందో చెప్పుకోవలసిన అవసరమైతే ఉందన్నారు. ‘ఒకప్పుడు ఒక్క ఫోన్​ కాల్​ చేస్తే చాలు, బ్యాంకులు అప్పులిచ్చేసేవి. మేము ఈ రకమైన క్రోనీ క్యాపిటలిజాన్ని సపోర్ట్​ చేయం’ అని స్పష్టం చేశారు నిర్మల.

ఈ రగడ అంతా మన ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్​ బ్యాంక్​ మాజీ గవర్నర్ రఘురామ్​ రాజన్ కామెంట్లు చేయడంతో మొదలైంది. ఎకానమీ మొత్తాన్ని నరేంద్ర మోడీ సర్కారు గుప్పిట్లో పెట్టుకుందని, గ్రోత్​ లక్ష్యాలను సాధించే విషయంలో నాయకత్వానికి (మోడీకి) ఒక నిలకడైన విజన్​ ఉన్నట్లుగా కనిపించడం లేదని రాజన్​ అన్నారు. ఆ వెంటనే నిర్మల ఫైరయ్యారు. ఇండియన్​ పబ్లిక్​ సెక్టార్​ బ్యాంకులు ప్రధానిగా మన్మోహన్​ సింగ్​, ఆర్బీఐ గవర్నర్​గా రఘురామ్​ రాజన్ పనిచేసిన టైమ్​లో చాలా చేటు కాలాన్ని ఎదుర్కొన్నాయని విమర్శించారు.

బిజినెస్​కి అనుకూలం

ఇండియా ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్ (అతి తేలిగ్గా వ్యాపారం చేయడం​)లో మెరుగ్గా పని చేస్తోంది. వరల్డ్​ బ్యాంక్​ ఇండెక్స్​లో మనది 77వ ప్లేస్​. గతంలోకంటే 23 పాయింట్ల మెరు గుదల సాధించింది. దీంతో సౌత్​ ఆసియా లోనే టాప్​ ర్యాంక్​కి ఎదగ్గా, బ్రిక్స్​ దేశాల్లో మూడో స్థానాన్ని సాధించింది. రెండేళ్లలో 53 అడ్డంకులను దాటుకుని ముందుకు దూసుకొచ్చిందని వరల్డ్​ బ్యాంక్​ పేర్కొంది. కనస్ట్రక్షన్​ రంగంలో వేగంగా  అనుమతులి స్తోంది. ఇండియా పనితీరు బాగవడానికి ఆరు సంస్కరణలు బాగా పనిచేశాయని చెప్పింది. బిజినెస్​కి ప్రోత్సాహం, నిరంతర కరెంటు, కనస్ట్రక్షన్​ పర్మిట్లు, రుణాలు, పన్నుల చెల్లింపు, వ్యాపారం వంటి అంశాల్లో చక్కటి మార్పులు తీసుకొచ్చినట్లు గుర్తించింది.

లక్షకోట్ల డాలర్లు పెరిగిన ఇండియన్​ ఎకానమీ 

అగ్ర నాయకుల స్థాయిలో మాటల యుద్ధం ఎలా ఉన్నప్పటికీ… గత అయిదేళ్లనాటి ఎకానమీని పరిశీలిస్తే మరీ అంత తీసికట్టుగా లేదని ఎకనమిస్టులు అంటున్నారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చేనాటికి ఇండియన్​ ఎకానమీ లక్షా 70 వేల కోట్ల డాలర్లు. రెండోసారి పవర్​లోకి వచ్చేటప్పటికీ… అంటే ఈ అయిదేళ్లలోనూ మన ఎకానమీ చాలా పెరిగింది. ప్రస్తుతం రెండు లక్షల 70 వేల కోట్ల డాలర్లకు చేరుకుంది. వచ్చే లోక్​సభ ఎన్నికల సమయానికి (2024–25 కల్లా) 5 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీని చేర్చాలన్నది మోడీ సర్కారు లక్ష్యం.

 

Latest Updates