చీఫ్‌‌ సెలెక్టర్‌‌ రేసులో శివరామకృష్ణన్‌‌!

న్యూఢిల్లీ: ఇండియా మాజీ లెగ్‌‌ స్పిన్నర్‌‌ లక్ష్మణ్‌‌ శివరామకృష్ణన్‌‌ నేషనల్‌‌ సెలెక్టర్‌‌ రేసులో నిలిచాడు. అతనితో పాటు మాజీ క్రికెటర్లు రాజేశ్‌‌ చౌహాన్‌‌, అమయ్‌‌ ఖురాసియా కూడా సెలెక్షన్‌‌ ప్యానెల్‌‌ పోస్టుకు అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని ముగ్గురు మాజీ ప్లేయర్లు ధ్రువీకరించారు. వీరితో పాటు జూనియర్‌‌ కమిటీ మాజీ సెలెక్టర్ ప్రీతమ్‌‌ గాంధీ, ప్రస్తుత జూనియర్‌‌ సెలెక్టర్‌‌ గ్యానేంద్ర పాండే కూడా దరఖాస్తు చేసినట్టు వెల్లడించారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటికే నాలుగేళ్ల టర్మ్‌‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుత కమిటీలో పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్‌‌ (సౌత్‌‌ జోన్‌‌), సెలెక్టర్ గగన్‌‌ ఖోడా (సెంట్రల్‌‌ జోన్‌‌) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుండగా సందీప్‌‌ సింగ్‌‌ (నార్త్‌‌ జోన్‌‌), జతిన్‌‌ పరాంజపే (వెస్ట్‌‌ జోన్‌‌), దేవాంగ్‌‌ గాంధీ (ఈస్ట్‌‌ జోన్‌‌) మరో ఏడాది కొనసాగనున్నారు. ప్రస్తుతం ఐసీసీ క్రికెట్‌‌ కమిటీలో మెంబర్‌‌గా, నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ స్పిన్‌‌ బౌలింగ్‌‌ కోచ్‌‌గా పని చేస్తున్న లక్ష్మణ్‌‌.. సెలెక్షన్‌‌ కమిటీలోకి వస్తే చైర్మన్‌‌ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జూనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌ వెంకటేశ్‌‌ ప్రసాద్‌‌, ఇండియా మాజీ బ్యాటింగ్‌‌ కోచ్‌‌ సంజయ్‌‌ బంగర్‌‌ కూడా రేసులోకి వస్తే ఈ పోస్టు కోసం త్రిముఖ పోటీ ఉండనుంది. అయితే, ఈ విషయంలో ప్రసాద్‌‌, బంగర్‌‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మాజీ పేసర్‌‌ అజిత్‌‌ అగార్కర్‌‌ పరిస్థితి  కూడా ఇలానే ఉంది. అప్లికేషన్లు సమర్పించేందుకు శుక్రవారమే చివరి తేదీ కావడంతో ప్రసాద్‌‌, బంగర్‌‌, అజిత్​ రేసులోకి వస్తారో లేదో చూడాలి.

Latest Updates