గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు శివసేన

  • బీజేపీకి రెండ్రోజుల టైమ్ ఇచ్చి.. మాకెందుకివ్వరు?
  • కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు లేఖల్నిచే అవకాశం ఇవ్వాలి
  • పిటిషన్‌లో కోరిన శివసేన.. వెంటనే విచారించాలని వినతి

మహారాష్ట్ర పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ శివసేన పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 48 గంటల సమయం ఇవ్వాలన్న తమ వినతిని ఆయన తిరస్కరించడం అన్యాయమని పిటిషన్‌లో తెలిపింది శివసేన. ఆ పార్టీ తరఫున అడ్వొకేట్ సునీల్ ఫెర్నాండెజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వెంటనే విచారించాలని కోరారు.

బీజేపీకి రెండ్రోజుల సమయం ఇచ్చిన గవర్నర్ తమకు మాత్రం ఒక్కరోజే సమయం ఇవ్వడం ఏంటని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది శివసేన. బీజేపీ చెప్పినట్లుగా ఆయన నడుచుకుంటున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు ఉన్న హక్కును కాలరాస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్-ఎన్సీపీ సపోర్టు లేఖల్ని గవర్నర్‌కు ఇచ్చేందుకు తమకు సమయం ఇచ్చేలా ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టును పిటిషన్‌లో కోరింది.

ఒకటి.. రెండు.. మూడు..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు గడిచినా.. ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబట్టడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నో చెప్పింది. తొలుత సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ ‌కోశ్యరీ అవకాశం ఇచ్చినా ఆ పార్టీ చేతులెత్తేసింది. దీంతో తర్వాత రెండో పెద్ద పార్టీగా అవతరించిన శివసేనకు చాన్స్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయిన ఆ పార్టీ.. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. వాటి మద్దతు కూడగట్టుకుని, ఆ లేఖల్ని ఇచ్చేందుకు టైమ్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరితే ఆయన నో చెప్పారు. ఆ తర్వాత సోమవారం రాత్రి ఎన్సీపీని పిలిచారు. మంగళవారం రాత్రి 8.30 వరకు టైం ఇచ్చారు. ఇలా ఒకటి.. రెండు… మూడు.. అన్ని పార్టీలకు గవర్నర్ నుంచి పిలుపు అందింది. అయినా ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ లేదు.

Latest Updates