ట్రైనింగ్‌ ఇచ్చి, జాబ్ ఇయ్యలె 

హైదరాబాద్‌‌: నిరుద్యోగ బ్రాహ్మణ యూత్‌‌కు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్‌‌ లక్ష్యం చేరలేదు. యువతకు ట్రైనింగ్‌‌ ఇచ్చాక ఉపాధి కల్పించాల్సిన సంస్థలు కొందరికే జాబ్‌‌లిచ్చి చేతులు దులుపుకున్నాయి. అభ్యర్థుల ట్రైనింగ్‌‌ కోసం ఫండింగ్‌‌ చేసిన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌‌కు అనుమానం వచ్చి సోషల్‌‌ ఆడిట్‌‌ చేయించగా ఈ విషయం బయటపడింది.

గోలార్స్ నెట్‌‌వర్క్స్‌‌, అపోలో మెడి స్కిల్స్ ఆధ్వర్యంలో గత ఏడాది వివిధ జిల్లాలకు చెందిన 146 మంది బ్రాహ్మణ నిరుద్యోగ యూత్‌‌కు స్కీల్స్‌‌ డెవలప్‌‌మెంట్‌‌లో ట్రైనింగ్‌‌ ఇచ్చారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి పేరిట  బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రూ.25 వేలకుపైచిలుకు ఖర్చు చేసింది. మొత్తంగా రెండు సంస్థలకు కలిపి రూ.37.46 లక్షలు చెల్లించింది. ట్రైనింగ్‌‌తోపాటు వంద శాతం ప్లేస్‌‌మెంట్‌‌ చూపిస్తామని ఆ రెండు సంస్థలు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌‌(టీబీఎస్‌‌పీ)తో ఒప్పందం చేసుకున్నాయి. గోలార్స్‌‌ నెట్‌‌వర్క్ సంస్థ వంద మందికి, అపోలో మెడిస్కిల్స్‌‌ సంస్థ 46 మందికి ట్రైనింగ్‌‌ ఇచ్చాయి. టీబీఎస్‌‌పీ విజ్ఞప్తి మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సొసైటీ ఫర్‌‌ సోషల్‌‌ ఆడిట్‌‌, అకౌంటబులిటీ అండ్‌‌ ట్రాన్స్‌‌పరెన్సీ(ఎస్‌‌ఎస్‌‌ఏఏటీ) సంస్థ ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అభ్యర్థులను విచారించగా గోలార్స్‌‌ సంస్థ ట్రైనింగ్‌‌ ఇచ్చిన వంద మందిలో కేవలం 21 మందికే ప్లేస్‌‌మెంట్‌‌ కల్పించినట్లు వెల్లడైంది. వారు హైదరాబాద్‌‌లో చూపిన ఉద్యోగాలు కూడా ట్రైనింగ్‌‌ కోర్సుతో సంబంధం లేనివని, జీతం కూడా రూ.5 వేల నుంచి రూ.8 వేలలోపేనని  అభ్యర్థులు చెప్పారు. అంతేకాకుండా చాలా మందికి కనీసం ట్రైనింగ్‌‌ పొందినట్లు ఆ సంస్థ సర్టిఫికెట్‌‌ కూడా ఇవ్వలేదని వాపోయారు. అపోలో మెడిస్కిల్స్‌‌ సంస్థ కూడా 46 మందికి ట్రైనింగ్‌‌ ఇవ్వగా, 31 మందికే ప్లేస్‌‌మెంట్‌‌ చూపింది. మిగతా 15 మందికి ప్లేస్‌‌మెంట్‌‌ ఇవ్వలేదని ఎస్‌‌ఎస్‌‌ఏఏటీ నిర్వహించిన సోషల్‌‌ ఆడిట్‌‌లో వెల్లడైంది. దీంతో ఆ రెండు సంస్థలకు టీబీఎస్‌‌పీ ఇవ్వాల్సిన లాస్ట్‌‌ పేమెంట్‌‌ నిలిపివేసినట్లు తెలిసింది.

Latest Updates