పార్లమెంట్ వరకు రైతుల ట్రాక్టర్ ర్యాలీ వాయిదా 

పార్లమెంట్ వరకు రైతుల ట్రాక్టర్ ర్యాలీ వాయిదా 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో నవంబరు 29న నిర్వహించాలని తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)శనివారం ప్రకటించింది. శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతు నేత దర్శన్ పాల్ సింగ్ ప్రకటించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేపట్టిన ఆందోళనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా నవంబర్ 29 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రతిరోజూ 500 మంది రైతులు శాంతియుతంగా పార్లమెంటు వరకు ట్రాక్టర్ మార్చ్‌లో పాల్గొంటారని SKM ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది.

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించారు.వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్ర కేబినెట్ కూడా గత వారం ఆమోదించింది. సోమవారం లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం ప్రకటించారు.