అదరగొట్టిన అఖిల ధనంజయ

  • ఐదు వికెట్లతో చెలరేగిన ధనంజయ
  • పోరాడుతున్న రాస్‌‌ టేలర్‌‌
  • న్యూజిలాండ్‌‌ 203/5

గాలె:

బౌలింగ్‌‌ యాక్షన్‌‌ను మార్చుకొని బరిలోకి దిగిన శ్రీలంక స్పిన్నర్‌‌ అఖిల ధనంజయ (5/57) అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌ చేశాడు.  సొంతగడ్డపై న్యూజిలాండ్‌‌తో టెస్ట్‌‌ సిరీస్‌‌లో తొలి రోజే అద్భుత బౌలింగ్‌‌తో సత్తా చాటాడు. వెటరన్‌‌ ప్లేయర్‌‌ రాస్‌‌ టేలర్‌‌ (131 బంతుల్లో 6 ఫోర్లతో 86 బ్యాటింగ్‌‌) హాఫ్‌‌ సెంచరీతో మెరిసినా… అఖిల ఐదు వికెట్లతో చెలరేగడంతో బుధవారం మొదలైన తొలి మ్యాచ్‌‌లో టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న కివీస్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో తడబడింది. ఫస్ట్‌‌ డే ఆట చివరకు 68 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టేలర్‌‌తో పాటు మిచెల్‌‌ శాంట్నర్‌‌ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా మూడో సెషన్‌‌లో ఎనిమిది ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

మొదటి రోజు ఆటలో ధనంజయ బౌలింగే హైలైట్‌‌. కివీస్‌‌ కోల్పోయిన ఐదు వికెట్లూ అతని ఖాతాలోనే పడ్డాయి. అనుమానాస్పద యాక్షన్‌‌ కారణంగా గతేడాది డిసెంబర్‌‌లో ధనంజయ బౌలింగ్‌‌పై ఐసీసీ నిషేధం విధించింది. అయితే, యాక్షన్‌‌ను మార్చుకొని దాదాపు తొమ్మిది నెలల తర్వాత టెస్ట్‌‌ ఆడుతున్న అఖిల.. బ్లాక్‌‌క్యాప్స్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. మొదట కివీస్‌‌ ఓపెనర్లు జీత్‌‌ రావల్‌‌ (33), టామ్‌‌ లాథమ్‌‌ (30) డెడ్‌‌ డిఫెన్స్‌‌తో తొలి వికెట్‌‌కు 64 రన్స్‌‌ జోడించి మంచి పునాది వేశారు. వీరిద్దరూ 26 ఓవర్ల పాటు వికెట్‌‌ కాపాడుకున్నారు. అయితే, 27 ఓవర్లో  వారి డిఫెన్స్‌‌ను బ్రేక్‌‌ చేసిన అఖిల లంకకు బ్రేక్‌‌ ఇచ్చాడు. మూడు బంతుల తేడాతో లాథమ్‌‌తో పాటు కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన  అతను  కొద్దిసేపటికే రావల్‌‌ను కూడా వెనక్కు పంపి ప్రత్యర్థికి షాకిచ్చాడు. లంచ్‌‌ టైమ్‌‌కు 71/3తో కష్టాల్లో పడ్డ కివీస్‌‌ను టేలర్‌‌, నికోల్స్​(42) ఆదుకున్నారు. ఓపిగ్గా ఆడిన ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు వంద రన్స్‌‌ జోడించారు. అయితే, 171/3తో మెరుగైన స్థితిలో కనిపించిన పర్యాటక జట్టును ధనంజయ మరోసారి దెబ్బకొట్టాడు. టీ బ్రేక్‌‌కు ముందు నికోల్స్‌‌, వాట్లింగ్‌‌ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని తన టెస్ట్‌‌ కెరీర్‌‌లో నాలుగో సారి ఐదు వికెట్ల హాల్‌‌ నమోదు చేశాడు. క్రీజులో పాతుకుపోయిన టేలర్‌‌ టీ బ్రేక్‌‌ తర్వాత వేగంగా ఆడి స్కోరు 200 మార్కు దాటించాడు. కానీ, వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: 68 ఓవర్లలో 203/5 (రాస్‌‌ టేలర్ 86 నాటౌట్‌‌, నికోల్స్‌‌ 42, అఖిల 5/57).

Latest Updates