మెదడు లేకున్నాఆలోచిస్తది..కాళ్లు లేకున్నానడుస్తది

  • మొక్కలా కనిపిస్తూ.. జంతువులా ప్రవర్తిస్తూ..
  • ప్రపంచంలోనే వింత జీవి ‘బ్లాబ్’
  • పారిస్ జూలో ప్రదర్శనకు ఉంచిన సైంటిస్టులు

ఇది మొక్కా? జంతువా? ఫంగసా? ఆ రెండింటికీ మధ్యస్తంగా ఉన్న మరో జీవా? అన్నది సైంటిస్టులు కూడా తేల్చలేకపోతున్నారు! ప్రపంచంలోనే అత్యంత చిత్ర విచిత్రమైన ఈ జీవి పేరు ‘బ్లాబ్’!  ప్రజలు చూసేందుకు వీలుగా శనివారం నుంచి పారిస్ జూలోని ఒక పెద్ద ట్యాంకులో దీన్ని ఉంచారు. బ్లాబ్ అనేది1958 నాటి ఓ హర్రర్ మూవీలోని పాత్ర. అందులో జిగట పదార్థంలా ఉండే బ్లాబ్ అనే ఒక ఏలియన్ జీవి భూమిపైకి వస్తుంది. పాకుతూ వెళుతూ జనాలను మింగుతూ క్రమంగా పెరుగుతుంటుంది. ఇది కూడా ఆ ఏలియన్ లాగే జిగురుగా ఉండి పాకినట్లుగా కదులుతూ ఉంటుంది. అందుకే దీనిని ఆ మారుపేరుతో పిలుస్తున్నారు. మామూలుగా అయితే ఆడ, మగ, థర్డ్‌‌ జెండర్‌‌ అంటూ మూడు సెక్స్‌‌లు మనుషులకుంటాయి. కానీ, వీటికి మాత్రం 720 సెక్స్‌‌లు (లింగాలు) సొంతం. వాటితోటే వివిధ రకాల అవయవాలనూ అది తయారు చేసుకోగలదు.

100 కోట్ల ఏండ్ల నుంచే భూమిపై..

బ్లాబ్‌లు సుమారుగా 100 కోట్ల ఏండ్ల నుంచే భూమిపై నివసిస్తున్నాయని అంచనా. అంటే.. మనుషుల కన్నా 50 కోట్ల ఏండ్ల ముందు నుంచే ఇవి భూమిపై ఉన్నాయన్నమాట. అయితే మొదటిసారిగా ఇవి 1973లో మనిషి కంట పడ్డాయి. టెక్సస్‌లోని ఓ ఇంటి వెనక పెరట్లో పసుపురంగులో మెరిసిపోతున్న ఒక నాచులాంటి మొక్క రోజూ రెట్టింపు సైజులో పెరుగుతుండటాన్ని ఆ ఇంటి మహిళ గమనించింది. దీని గురించి ఆనోటా ఈనోటా వ్యాపించి కలకలం రేగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ బ్లాబ్ మాయమైపోయింది. ఇవి యూరప్ అడవుల్లోని ఓక్ చెట్లపై ఎక్కువగా ఉంటాయని తర్వాత తెలిసింది. దీంతో 2016లో ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ బయాలజిస్ట్ ఆడ్రీ డస్సూటౌర్ టీం యూరప్‌లో దొరికిన బ్లాబ్‌లపై రీసెర్చ్ చేయడంతో మళ్లీ ఇవి వార్తల్లోకి వచ్చాయి.

గంటకు 4 సెంటీమీటర్లు కదులుతాయ్

బ్లాబ్‌కు సైంటిస్టులు పెట్టిన అసలు పేరు ఫైసేరమ్ పాలీసెఫాలం. అంటే ‘అనేక తలలు ఉన్న జిగట జీవి’ అని అర్థం. ఎక్కువగా పసుపు రంగులోనే ఉంటాయి. కొన్ని ఎరుపు, తెలుపు, లేదా గులాబీ రంగుల్లోనూ ఉంటాయట. ఇవి అడవుల్లో ఎల్లప్పుడూ చల్లగా, తేమగా ఉండే పొదల్లో చెట్ల మొదళ్లపై ఉంటాయట. ఇక కండ్లు లేకపోయినా ఇవి తన ఫుడ్ ను వెతుక్కోవడంలో నిపుణులట. చుట్టుపక్కల ఉన్న పుట్టగొడుగుల రంధ్రాలు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను గుర్తించి ఆక్రమించేసి జీర్ణం చేసుకుంటాయట. గంటకు 4 సెంటీమీటర్ల చొప్పున కదులుతాయట.

మాట్లాడుకుంటయ్‌.. తెలివి పంచుకుంటయ్‌

ప్రకృతిలోని మిస్టరీల్లో సజీవంగా ఉన్న ఒక మిస్టరీలాంటిది బ్లాబ్‌‌‌‌‌‌‌‌ అని పారిస్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ డైరెక్టర్ బ్రూనో డేవిడ్ అంటున్నారు. దీనికి  మెదడు ఉండదు కానీ కొత్త విషయాలను నేర్చుకోగలదని ఆయన చెబుతున్నారు. రెండు బ్లాబ్‌లను ఒక దగ్గర చేరిస్తే, ఒక బ్లాబ్‌ నుంచి రెండో బ్లాబ్‌ అనేక విషయాలు నేర్చుకుంటుందని  పేర్కొంటున్నారు. 2016లో చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందట.  ప్రయోగంలో భాగంగా ఒక బ్లాబ్‌కు ఉప్పుతో వేసిన బ్రిడ్జిని దాటడం నేర్పించారు. తర్వాత  ఆ విషయం తెలియని మరో బ్లాబ్‌ను దానికి జత చేశారు.  కొంత సేపటికి కొత్త బ్లాబ్‌ను ఉప్పు బ్రిడ్జి దగ్గర వదలగా అది అలవోకగా ఆ బ్రిడ్జిని దాటేసిందట! ఇదివరకే ఆ విషయం నేర్చుకున్న బ్లాబ్ నుంచి కొత్తదానికీ ఈ విద్య అబ్బిందట. రెండు బ్లాబ్‌లు కలిసినప్పుడు రెండింటి మధ్య రక్తనాళం వంటిది ఏర్పడుతుందని, ఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా రెండింటి మధ్య సమాచార మార్పిడి జరిగి తెలివిని పంచుకుంటున్నాయని అంటున్నారు.

చంపడం అంత ఈజీ కాదు

బ్లాబ్‌లు నిదానంగా కదులుతాయిగానీ, ఒక్కరోజులోనే రెట్టింపు సైజుకు పెరుగుతాయట. వీటిని చంపడం అంత తేలిక కాదని సైంటిస్టులు చెబుతున్నారు. నేలంతా ఎండిపోయి, పొదల్లో సైతం తేమ దొరకని ప్రతికూల పరిస్థితులు వస్తే ఇవి నిద్రావస్థలోకి వెళ్లిపోయి, పూర్తిగా ఎండిపోయినట్లు అవుతాయట. ఎండ, కరువు మాత్రమే వీటికి శత్రువులని  ఆడ్రీ డస్సూటౌర్ వెల్లడించారు. నిద్రపోయిన బ్లాబ్‌ను కొన్ని నిమిషాల పాటు ఒవెన్‌లో పెట్టినా  ఏంకాదని ఆమె తెలిపారు. దీనిపై మళ్లీ కొన్ని నీటి చుక్కలు పడగానే యాక్టివ్ అయిపోతుందని, ముక్కలు ముక్కలుగా అయి పిల్ల బ్లాబ్ లుగా మారి ఆహార వేటను మొదలుపెడుతుందన్నారు. ల్యాబ్‌లో చేసిన ప్రయోగంలో కొన్ని బ్లాబ్‌లు 33 అడుగుల వరకూ పెరిగాయని సైంటిస్టులు చెబుతున్నారు.

ప్రమాదాలను మర్చిపోవు! 

ఫుడ్ కోసం వెళ్లేదారిలో అడ్డంకులు ఉంటే దారిని మార్చుకుని మరీ బ్లాబ్‌లు తమ టార్గెట్‌ను చేరతాయట. ఒక సమస్యకు రకరకాల పరిష్కారాలు ఉంటే.. వాటిలో ఏది మంచిదో దాన్నే ఎంచుకునే తెలివి కూడా వీటికి ఉందట. అంతేకాదు.. ఇవి విషపూరిత పదార్థాల జోలికి వెళ్లవని, ఒకవేళ వెళితే, దాని వల్ల కలిగే ప్రమాదాలను ఏడాది తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటాయని అంటున్నారు.

Latest Updates