వరదలు ఎప్పుడొచ్చినా బాధితులు స్లమ్స్​ పేదలే

హైదరాబాద్​ ను మూసీ నది మరోసారి వరదలతో ముంచెత్తింది. 20 ఏండ్ల క్రితం 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసి వరదలు వచ్చాయి. ఈసారి సిటీలో ఆ స్థాయి వర్షపాతం నమోదు కాకపోయినా వరదలు మాత్రం ముంచెత్తాయి. పేద, మిడల్​ క్లాస్​ ఉండే వందల కాలనీలు నీటమునిగాయి. దీంతో నగరంలోని నీటి వనరులు, ఆక్రమణలు, పట్టణాభివృద్ధిపై మళ్లీ చర్చ మొదలైంది.

హైదరాబాద్ ను ఆధునిక, నివాసయోగ్యమైన నగరంగా మార్చాలంటే సిటీ ప్లానర్లు, ఆర్కిటెక్ట్స్​ మనస్తత్వం, మధ్యతరగతి, ఉన్నత వర్గాల ఆలోచనా విధానం మారాలి. నగరంలోని 1,472 మురికివాడలు, ఇతర ప్రదేశాల్లో శ్రమజీవులైన సిటిజన్లు నివసిస్తున్నారన్న విషయం వారు అంగీకరించాలి. వారికి కూడా ఈ నగరంలో భూమి, వనరులపై హక్కు ఉంది. వారు ఆక్రమణదారులు కాదు.. నగరాన్ని నిర్మించేవారు, నగరానికి సేవలందించేవారు. తమ జీవితం, జీవనోపాధి కోసం నగరం వారికెంత అవసరమో.. నగరానికి వారి అవసరం అంతే ఉంది.

మూసీ నది లేకుండా హైదరాబాద్ చరిత్రను చూడలేం. ఈ నది, వరదలపై చాలా కథలు ఉన్నాయి. హైదరాబాద్ ను నిర్మించడానికి కులీకుతుబ్ షాను ప్రేరేపించిన నది మూసీనే. 1908 నాటి వరదలు నేర్పిన పాఠంతోనే హైదరాబాద్‌‌ ఆధునీకరణకు బీజాలు పడ్డాయి. వరదలు మళ్లీ రాకుండా ఉండేందుకు అప్పటి నిజాం ప్రభుత్వం ప్రసిద్ధ ఇంజనీర్, ప్లానర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించింది. కానీ గత యాభై ఏండ్లలో నగర అభివృద్ధి ప్రణాళికారహితంగా మారింది. ఇదే ఇప్పుడు వరదలకు దారి తీసింది.

మూసీని ప్రభుత్వమే ఆక్రమించింది

యాభై ఏండ్ల క్రితం వరకు హైదరాబాద్​ విశాలమైన చెరువులు, నీటి కుంటలు, కాల్వలతో గొలుసుకట్టుగా అనుసంధానమై ఉండేది. ఈ కాల్వల లింక్​ మూసీలో కలవడంతో ముగుస్తుంది. వాస్తవానికి ఇది అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ. కానీ అభివృద్ధి, ఆధునీకరణ పేరిట ఈ జల వనరులన్నీ కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ప్రభుత్వమే జల వనరుల అతిపెద్ద ఆక్రమణదారుగా మారింది. ఫలితంగా హుస్సేన్ సాగర్ దాని అసలు విస్తీర్ణంలో మూడింట ఒక వంతుకు తగ్గిపోయింది. మిగతా విస్తీర్ణంలో పార్కులు, రోడ్లు, ప్రైవేట్​ ఆస్తులు వెలిశాయి. అలాగే ఇమ్లిబన్ బస్టాండ్, మెట్రో రైల్వే స్టేషన్, ఇతర నిర్మాణాల కోసం మూసీ నదిని ఆక్రమించారు. ఇతర చెరువులు, కుంటలు, కాల్వలు, నీటి వనరుల పరిస్థితి ఇలాగే ఉంది.

నిరుపేదలు కారణం కాదు

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే వరదలు, విపత్తులు వచ్చిన ప్రతిసారీ నదీ తీరం వెంబడి నివసించే పేదలే కారణమని ఆరోపించడం కామన్​ అయిపోయింది. నగర నిర్మాణం, నిర్వహణలో అవసరమైన శ్రమను అందించే మనుషులను ఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నారు. కానీ మూసీ ప్రస్తుత పరిస్థితికి నదిని ఆక్రమించిన ప్రభుత్వం, బడా బిల్డర్లు, పరిశ్రమల యజమానులే కారణం. వరదలు వచ్చినప్పుడు మాత్రం మురికివాడల పేదలే బాధితులవుతున్నారు. వారు ఇండ్లే కాదు జీవనోపాధి కోల్పోయారు.

జల వనరులను రక్షించాలి

మహానగరం చిరకాలం మనుగడ సాగించి, స్థిరంగా ఉండాలంటే ఇక్కడి జల వనరులను రక్షించాల్సిన అవసరం ఉంది. మూసీ నది విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. మూసీపై ఈస్ట్-వెస్ట్​ కారిడార్స్ వంటి అవాస్తవ ప్రణాళికలను వదిలేయాలి. శ్రామిక వర్గాలకు నివాసయోగ్యమైన, తగినంత గృహనిర్మాణం, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం​ఇండ్ల పథకాన్ని పూర్తి నిబద్ధతతో అమలు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో ఇలాంటి ప్రయత్నం జరిగింది. అప్పటి ప్రభుత్వం మురికివాడల్లోని పేదలకు నివాసాలు కట్టడానికి రాజీవ్​ ఆవాస్​ యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. కానీ ఆ పథకం ముందుకు సాగలేదు.

మూసీ హైదరాబాద్​దే కాదు

మూసీ నది హైదరాబాద్ కు మాత్రమే చెందినది కాదు. ఈ నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అనేక గ్రామాలకు చెందినది. ఈ నదిపై ఆధారపడి వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. హిమాయత్​ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆనకట్టల నుంచి ఈ నదిలో చేరేది చాలా తక్కువ నీళ్లే. ఈ నది హైదరాబాద్​లోకి ప్రవేశించాక దాని విస్తీర్ణం, నీటి పరిమాణం పెరుగుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో మరోలా చెప్పాలంటే నగరం వదిలిన వ్యర్థ జలాలతో ప్రవహిస్తున్నదే మూసీ నది. ట్రీట్​ మెంట్ చేయని రసాయనిక వ్యర్థ జలాలు కలవడంతో ఈ జలాలు కలుషితంగా మారుతున్నాయి. ఫలితంగా ఈ నీళ్లు వ్యవసాయానికి పనికి రాకపోవడంతో దిగువ ఉన్న రైతులు చాలా మంది సాగును వదిలేశారు. ఈ నీళ్లతో పండించిన పంటలూ విషతుల్యంగా మారుతున్నాయి.

మాస్టర్​ ప్లాన్ రూపొందించాలి

మూసీ తీరం వెంట మురికివాడల్లో నివసించే పేదలను రక్షించడం, వారికి సురక్షిత ప్రాంతాల్లో పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వడం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. జల వనరులు, నాలాలు, నదీ తీరం వెంట ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్​ ఆక్రమణల తొలగింపునకు వెంటనే ఆర్డినెన్స్​ జారీ చేయాలి. చెరువులు, కుంటలు, వరద కాల్వలు, మురుగు నీటి కాల్వల పరిరక్షణకు హెచ్​ఎండీఏ వెంటనే హైడ్రాలాజికల్ మ్యాప్​ను సూచించే మాస్టర్​ ప్లాన్​ను రూపొందించాలి. పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వం విపత్తు ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. మురికివాడల ప్రజలు, పేదలు నివాసముండేందుకు నగరంలో భూములు, వనరులు కేటాయించాలి. ఇది చేయడానికి ప్రభుత్వానికి నిబద్ధత, చిత్తశుద్ధి అవసరం. ఈ వరదల సందర్భంగా మన ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, న్యాయవ్యవస్థ, ప్రజలు ఇదే డిమాండ్​ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వర్గీస్​ తెక్​నాథ్, కన్వీనర్, క్యాంపెయిన్​ ఫర్​ హౌసింగ్​ అండ్​ టెన్యురల్​ రైట్స్(చత్రీ)

For More News..

వరద నీటి విషయంలో కొట్టుకున్న కాలనీ వాసులు

గడ్డి కాల్చకుండా ఆపేందుకు స్పెషల్ కమిటీ

పంటలను మద్దతు ధరకే కొంటం.. మరోసారి స్పష్టం చేసిన మోడీ

Latest Updates