సందమామ సన్నబడ్డడు

మన చందమామ నెమ్మదిగా కుచించుకుపోతున్నాడు. గడిచిన కొన్ని కోట్ల సంవత్సరాల్లో 50 మీటర్లు సన్నబడ్డాడు. దీంతో చంద్రుడిపై కంపనాలు విరుచుకుపడుతున్నాయి. దీని వల్ల పెద్ద ముడతలు వచ్చి, పగుళ్లు ఏర్పడుతున్నాయని నాసా పేర్కొంది. ‘గూఢచర్య ఆర్బిటార్’ తీసిన 3,500 ఫొటోలను పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. చంద్రుడి నేల లోపల చల్లబడిపోవడం వల్ల ఇలా జరుగుతోందని నాసా వెల్లడించింది. ముడతలుగా ఏర్పడ్డ నేల, పక్కన ఏర్పడ్డ మరో ముడతలోకి దూసుకెళ్లి, పగుళ్లుగా మారుతున్నాయని చెప్పింది. ఇలా వెన్నెలపై చాలా చోట్ల కొన్ని మీటర్ల ఎత్తుకు ఎగసిన ముడతలు, కిలోమీటర్ల కొద్దీ వ్యాపించివున్నట్లు తెలిపింది. ఒక ముడత మరో ముడతని ఢీ కొట్టినప్పుడు 5 కంటే ఎక్కువ తీవ్రతతో ప్రకంపనలు వస్తున్నాయని వివరించింది.

చంద్రకంపాన్ని పసిగట్టారిలా..

అపోలో అంతరిక్ష నౌకలో చంద్రుడిపైకి వెళ్లిన అమెరికా సైంటిస్టులు, అప్పట్లో అక్కడ నాలుగు సీస్మోమీటర్లను వదిలేసి వచ్చారు. నాలుగు వారాల పాటే ఇవి పని చేసినా, అప్పట్లో అక్కడ సంభవించిన ప్రకంపనల తీవ్రతను రికార్డు చేశాయి. వాటి సిములేషన్స్​తోనే ఈ అంచనాకు వచ్చారు.అయితే, భూమిలాగా చంద్రుడి లోపల టెక్టానిక్​ ప్లేట్లు లేవని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.  అవి లేకపోయినా ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయంటే.. చంద్రుడు పుట్టిన నాటి నుంచి చంద్రుడి గర్భంలో వేడి తగ్గుతోంది. దీంతో చంద్రుడి నేల బోలుగా తయారవుతోంది. చంద్రుని ఉత్తర ధ్రువానికి సమీపంలోని మారే ఫ్రిగోరిస్‌‌ అనే ప్రాంతం పగుళ్లు ఏర్పడి కదులుతున్నట్లు రీసెర్చ్​లో తేలింది. కాగా, 2024లో చేయబోయే మానవ సహిత మూన్ మిషన్​కు నాసా ఆర్టెమిస్ అని పేరు పెట్టింది. ఆలోగా మరో 160 కోట్ల డాలర్లు (సుమారు ₹11 వేల కోట్లకు పైనే) కావాలని తెలిపింది. మొత్తం మిషన్​కు  2150 కోట్ల డాలర్లు (సుమారు లక్షన్నర కోట్లు) ఖర్చవుతాయని అంచనా.