రిలయన్స్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్లు చోరీ

కస్టమర్ గా వచ్చి స్మార్ట్ ఫోన్లు ఎత్తుకుపోయాడు

హైదరాబాద్, వెలుగు: షేక్ పేటలోని రిలయన్స్ స్మార్ట్ మాల్ లో  క్లోజ్ చేసే టైమ్ కి కస్టమర్ గా వచ్చిన ఓ దొంగ..సీసీ కెమెరాలకు చిక్కుండా, సిబ్బంది కళ్లుగప్పి రాత్రంతా అక్కడే ఉన్నాడు. స్టోర్ క్లోజ్ చేసిన మూడొంతస్థుల ఆ బిల్డింగ్ లో ప్రతీ ఫ్లోర్ తిరిగాడు. రూ.10లక్షలు విలువ చేసే సుమారు 30 స్మార్ట్ ఫోన్లు కొట్టేసి తెల్లవారుజామును అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ నాలా వద్ద ఉన్న రిలయన్స్ డిజిటల్ మార్ట్ లోకి శనివారం రాత్రి ఓ కస్టమర్ వచ్చాడు. రాత్రి 9.45గంటల సమయంలో మార్ట్ లోకి వచ్చిన ఆ వ్యక్తి ముందుగా తనకు ల్యాప్ టాప్ కావాలని సిబ్బందిని కోరాడు. ఆ తర్వాత షో రూమ్ అంతా తిరుగుతూ సీసీ కెమెరాలు లేని ఏరియాను గుర్తించాడు. దీంతో పాటు విధులు ముగించుకుని మార్ట్ క్లోజ్ చేసే సిబ్బందిని గమనించాడు. సేల్స్ మెన్ తో మాట్లాడుతున్నట్లుగా నటించి మార్ట్ లోనే ఓ మూలన దాక్కున్నాడు. ప్లాన్ ప్రకారం మార్ట్ లోనే ఉన్న  ఆ వ్యక్తిని గుర్తించని సిబ్బంది శనివారం రాత్రి 10గంటల సమయంలో స్టోర్  క్లోజ్ చేసి వెళ్లిపోయారు.

ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎస్కేప్

సిబ్బంది వెళ్లిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆ వ్యక్తి రాత్రి మార్ట్ లోని మూడు ఫ్లోర్ లను తిరిగి తన చోరీకి అనువైన వస్తువులను సెలక్ట్ చేసుకున్నాడు. మందుగానే తాను రెక్కీ వేసిన విధంగా మొబైల్ ఫోన్లను టార్గెట్ చేశాడు. దొంగిలించిన తర్వాత కూడా వాటిని అమ్మేందుకు ఈజీగా ఉంటుందని సుమారు 30 స్మార్ట్ ఫోన్లను దొంగిలించాడు. శనివారం రాత్రంతా స్టోర్‌‌లోనే గడిపిన దొంగ ఆదివారం తెల్లవారుజామున ఫైర్‌‌ ఎగ్జిట్‌‌ నుంచి పారిపోయాడు.
ఆదివారం ఉదయం 10 గంటలకు మార్ట్ ఓపెన్ చేసిన సిబ్బంది చోరీ జరిగిందని గుర్తించారు. మేనేజర్ ఇస్మాయిల్ గోల్కొండ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల్లో మొహానికి మాస్క్ వేసుకున్న దొంగను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గోల్కొండ పోలీసులు తెలిపారు.

Latest Updates