బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్​

ఎన్నార్సీ, సీఏఏ నేపథ్యంలో ఇండియా, బంగ్లాదేశ్​ల​కు సంబంధించిన చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. ఆ లిస్టులో స్మగ్లింగ్​ కూడా ఒకటి. ఈ రెండు దేశాల సరిహద్దులు దొంగ రవాణాకు దగ్గర దారుల్లా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండో–బంగ్లా బోర్డర్​లో పోయినేడాది బీఎస్​ఎఫ్​ జవాన్లు మొత్తం 266 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అందులో 92 మంది బంగ్లాదేశీలు, 41 మంది రోహింగ్యాలు, ఒకడు నైజీరియన్​ కాగా మిగతావాళ్లు మనోళ్లని తేలింది.

ఇండో–బంగ్లా బోర్డర్​ మీదుగా ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు మత్తు మందులను తరలించటంలో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు బీఎస్​ఎఫ్​ ఇంటలిజెన్స్​ రిపోర్ట్ చెబుతోంది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కావటం, బంగ్లాదేశ్​తో మూడు వైపులా సరిహద్దు ఉండటం, ట్రైబల్​ కల్చర్​–రెలీజియస్​ గ్రూప్స్​ కలగాపులగంలా కలిసిపోవటంతో త్రిపురకు ఈ తలనొప్పి తప్పట్లేదు. పశ్చిమ బెంగాల్ తర్వాత ఈ రాష్ట్రమే బంగ్లాదేశ్​తో ఎక్కువ బోర్డర్​ను​ పంచుకుంటోంది.

ఏ రాష్ట్రం?.. ఎంత దూరం?

ఇండో–బంగ్లా​ సరిహద్దు పొడవు 4,096 కిలో మీటర్లు. ఇందులో అధిక భాగం​(2,216 కిలో మీటర్లు) పశ్చిమ బెంగాల్​లో ఉంది. 856 కిలోమీటర్లతో రెండో స్థానం త్రిపురది. తర్వాత 443 కిలోమీటర్లతో మేఘాలయ, 318 కిలోమీటర్లతో మిజోరం, 263 కిలోమీటర్లతో అస్సాం ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతం గుండా బంగ్లాదేశ్​ నుంచి ఇల్లీగల్​ మైగ్రేషన్​తోపాటు, గన్నులు, పేలుడు పదార్థాలు, అత్యవసర సరుకులు, మనుషుల అక్రమ రవాణా జరుగుతూనే ఉంటాయి.

ఇండో–బంగ్లా సరిహద్దుతోపాటు ఇండో–పాక్​ బోర్డర్​లోనూ కాపలా కాసే బాధ్యతను బీఎస్​ఎఫే మోస్తోంది. ఇండో–పాక్​ పొలిమేర పొడవు 3,323 కిలోమీటర్లు. సరిహద్దుల్లో గస్తీ తిరిగేందుకు బీఎస్​ఎఫ్​లో రెండున్నర లక్షల మంది జవాన్లు ఉన్నారు. వాళ్లు రాత్రింబవళ్లు రెప్ప వాల్చకుండా బోర్డర్​ వైపే రెండు కళ్లేసి ఉంచుతున్నా చొరబాట్లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. స్మగ్లింగ్​కు కూడా ఫుల్​స్టాప్​ పడట్లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

బిలియన్లలో బిజినెస్​

ఇండియా, బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల రక్షణ ఏర్పాటు సరిగా లేకపోవటంతో ఈ రెండు దేశాల మధ్య ఏటా స్మగ్లింగ్​ బిజినెస్​ భారీఎత్తున జరుగుతూ ఉంటుంది. అనధికారికంగా జరిగే ఈ వ్యాపారం విలువ పదేళ్ల కిందటే నాలుగు బిలియన్​ డాలర్లు ఉండేది. ఇది అఫీషియల్​ ఎగుమతి, దిగుమతుల్ని దెబ్బ తీస్తోంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్​కి అఫీషియల్​గా జరిగే ఎగుమతులతో పోలిస్తే… స్మగ్లింగ్​ ద్వారా దాదాపు 40 శాతం,  దిగుమతుల్లో సుమారు 30 శాతం లావాదేవీలు సాగుతున్నట్లు అప్పట్లో వరల్డ్​ బ్యాంకే చెప్పింది.

బీఫ్​కి గిరాకీ

బంగ్లాదేశ్​ ముస్లిం మెజారిటీ దేశం కావటం వల్ల అక్కడ బీఫ్​కి గిరాకీ ఎక్కువ. మనది హిందూ మెజారిటీ దేశం కావటం వల్ల ఇక్కడ బీఫ్​ తినేవాళ్లు తక్కువ. అందువల్ల అక్కడికి పశువులను ఎగుమతి చేసేవారు. ఆ తర్వాత ఈ ఎక్స్​పోర్ట్​లను మన దేశం నిషేధించింది. దీంతో బంగ్లాదేశ్​ నుంచి మన దేశానికి దొడ్డిదారిన వచ్చేవాళ్లు దొంగ రవాణా చేసేవాటిలో పశువులకు ప్రయారిటీ ఇచ్చేవాళ్లు.

చలికాలంలో ఎక్కువ చొరబాట్లు

ఇండో–బంగ్లా సరిహద్దులోని నదులు, చెరువుల్లో చలికాలం నీళ్లు తక్కువ ఉంటాయి. పల్లెలు, పంట పొలాలు, అటవీ ప్రాంతాల్లో మంచు ఎక్కువ కురుస్తుంది. కాబట్టి పరిసరాలు క్లియర్​గా కనిపించవు. పైపెచ్చు శీతాకాలంలో చీకటి పడితే జనం ఇళ్లకే పరిమితమవుతారు. రోడ్లపై వచ్చీపోయేవాళ్లను పట్టించుకోరు. నిలదీయటానికి అవకాశం ఉండదు. బీఎస్​ఎఫ్​ సిబ్బంది కళ్లు గప్పి ఇండియాలోకి వచ్చేందుకు మైగ్రెంట్స్​ ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటున్నారు.

ఈ కాలంలోనే పశువులను ఎక్కువగా బంగ్లాదేశ్​కు తరలిస్తుంటారు. దొంగ సరుకుతో కూడిన మూటలను వీపుకు కట్టి పశువులను నీళ్లలోకి తోలతారు. దీంతో అవి మునిగిపోకుండా ఒడ్డుకు చేరతాయి. ఇండియా, బంగ్లాదేశ్​ మధ్య 70 కిలోమీటర్ల నదీ తీరం ఉంది. ఈ ప్రదేశాల్లో చలికాలం మంచు దట్టంగా పడుతుంది. దీంతో పెట్రోలింగ్​ వాహనాలు తిరగటం కష్టంతో కూడిన పని. బీఎస్​ఎఫ్​వాళ్లు వింటర్​లో థర్మల్​ ఇమేజర్స్​ వాడినా పొగమంచు కారణంగా అవి దెబ్బతింటున్నాయి.

Latest Updates