లడఖ్ ప్రజల ఆశాదీపం..పంటల కోసం మంచుకొండ

చుట్టూ ఎత్తైన పర్వతాలు. నల్లబారిన ఎగుడు దిగుడు నేలలు. మధ్యలో నేలలోంచి పుట్టుకొచ్చిన తెల్లని మంచు కొండ. ఆ పర్వతాలు హిమాలయాలు. ఆ ప్రాంతం జమ్మూకాశ్మీర్ లోని లడఖ్. కానీ ఆ మంచు కొండ సహజమైనది కాదు. దాన్ని నీళ్ల కోసం సృష్టించారు. లడఖ్ లో వర్షం అతి తక్కువగా కురుస్తుంది. ఓ వ్యక్తి వడ దెబ్బకు, చలికి రెండింటికి చనిపోయే ప్రమాదమున్న ప్రపంచంలోని ఏకైక ప్రాంతం. ఇక్కడ జీవనాధారం వ్యవసాయమే. తక్కువ వానలు పడే ఇక్కడ మంచు కరగడం వల్ల వచ్చే నీటిని పంటలకు ఎక్కువగా వాడతారు. కానీ వాతావరణ మార్పు వల్ల మంచు ఏప్రిల్, మే నెలలకు ముందే పెద్ద మొత్తంలో కరిగిపోతోంది. ఫలితంగా పంటలు వేయాల్సిన టైమ్ కి నీళ్లు లేకుండా పోతున్నాయి. ఈ సమస్యకు ఓ ఇంజనీర్ చూపించిన పరిష్కారం కొత్త మంచు కొండలు సృష్టించడం!

ఒక్క ఐడియా..

సోనమ్ వాంగ్ చుక్ 2014లో లడఖ్ నీళ్ల కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. లడఖ్ అంతా కలియదిరిగాడు. ఓ రోజు పారుతున్న సెలయేటి దగ్గర ఆగాడు. కాసేపు నీళ్లను అలానే చూశాడు. అక్కడి బ్రిడ్జికి పక్కగా ఉన్న మంచు గడ్డపై సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ వేడికి అది మెల్లగా కరుగుతోంది. సూర్యుడి కాంతి పడని చోట.. మంచు తక్కువగా కరుగుతోంది. అప్పుడే.. మంచు కొండలు ఏర్పాటు చేయాలని సూపర్​ ఆలోచన వచ్చింది.

వృథా అవుతున్న నీళ్లతోనే..

మంచు కరిగినప్పుడు ఆ నీటిని ఒడిసి పట్టాలి. లడఖ్ లో అప్పటిదాకా అలా చేసిన వాళ్లు లేరు. అలా స్టోర్ చేసిన నీటిని ఏప్రిల్, మే నెలల్లో పంటలకు వాడుకోవాలి. దీని కోసం సోనమ్ ప్రతి గ్రామంలోనూ ఓ మంచు కొండను కట్టాలని నిర్ణయించారు. ఇందుకు లడఖ్ లోని చల్లటి పరిస్థితులను వాడుకోవాలని భావించారు. అనుకున్నట్లే పర్వతాలపై నుంచి కరిగి వృథాగా వెళ్లిపోతున్న నీళ్లను కిందికి తేవాలని నిర్ణయించారు. అలా ఎన్నుకున్న ప్రదేశానికి నీళ్ల పైపును అండర్ గ్రౌండ్ ద్వారా లాగారు. ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి పైపులోకి వచ్చే నీళ్లు వేగంగా 60 మీటర్ల ఎత్తు గాల్లోకి విసిరికొట్టాయి.  వెంటనే అక్కడి చల్లటి వాతావరణం నీటిని గడ్డ కట్టించేసింది. అలా 20 అడుగుల కొండ రెడీ అయింది.

ఒక్కో కొండతో 1.5 లక్షల లీటర్ల నీళ్లు..

ఒక్కో కొండ కరిగితే 1.5 లక్షల లీటర్ల నీళ్లు అందుతాయి. ఏప్రిల్, మే నెలల వరకూ వీటిపై ఎండ పడకుండా జాగ్రత్తపడతారు. చాలా తక్కువ ఎత్తైన ప్రాంతాలు, వేడి ప్రదేశాల్లో కూడా మంచు కొండలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. లడఖ్ లో మంచు కొండలను క్రియేట్ చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో 4 వేల మీటర్ల ఎత్తులో నీళ్లను గాల్లోకి పంపి గడ్డ కట్టించారు. అయితే పైపులతో నీళ్లను గడ్డ కట్టించింది మాత్రం సోనమే. ఈ పద్ధతిలో టెక్నిక్ చాలా మార్చాల్సివుందని చెప్పారు. వచ్చే సమ్మర్ లో పెరూ ఇదే తరహా ప్రయోగం చేయబోతున్నారు

Latest Updates