కరోనాపై ఎన్నెన్నో కథనాలు.. ఎన్నో పుకార్లు

బయో వెపన్​ నుంచి లీకైందన్న ఇజ్రాయెల్​ ఇంటెలిజెన్స్​ అధికారి

కెనడా ల్యాబ్​ నుంచి  చైనా సైంటిస్టులే పంపించారన్నది మరో వాదన

కొట్టి పారేసిన అధికారులు

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కొత్త కరోనా వైరస్​ వణికిస్తోంది. ఆ వైరస్​ తమ తమ దేశాల్లోకి రాకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం ఆ వైరస్​ ఎట్లా సోకిందన్న దానిపై కథలు అల్లేస్తున్నారు. ఇంటర్నేషనల్​ వార్తా సంస్థల నుంచి సోషల్​ మీడియా యూజర్ల వరకు రకరకాల స్టోరీలను వండేస్తున్నారు. ఏంటా కథలు..?

బయో వెపన్​ నుంచి లీక్​

ఎక్కువ సంచలనమవుతున్న విషయం ఇదే. దానికీ కారణం లేకపోలేదు. ఓ ఇంటర్నేషనల్​ న్యూస్​ పేపర్​లో ఆ వార్త వచ్చింది మరి. వుహాన్​లోని మిస్టరీ ల్యాబ్​లో తయారు చేస్తున్న బయో వెపన్​ నుంచే ఆ వైరస్​ లీకైందని ఓ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్​ అధికారి అన్నట్టు ఆ పేపర్​ వార్త రాసింది. ఆ మిస్టరీ ల్యాబ్​ వుహాన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీనేనని ఆ అధికారి చెప్పినట్టు వెల్లడించింది. అంతేకాదు, ఈ బయోవెపన్​ థియరీని చెప్పిన ఆ మాజీ ఇంటెలిజెన్స్​ అధికారి వైరస్​ స్టడీస్​లో ఎక్స్​పర్ట్​ అట. చైనా ఆర్మీ కోసం వుహాన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ఓ బయోవెపన్​ను తయారు చేస్తోందని, అక్కడి నుంచే కరోనా వైరస్​ బయటకు లీకైందని ఆ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, హెల్త్​ అధికారులు మాత్రం ఆ వాదనలను కొట్టిపారేస్తున్నారు. వైల్డ్​లైఫ్​ మార్కెట్​ నుంచే అది పాకిందంటున్నారు.

కెనడా–గూఢచర్యం

పోయినేడాది కెనడాలోని విన్నిపెగ్​లో ఉన్న నేషనల్​ మైక్రోబయాలజీ ల్యాబ్​లో పనిచేస్తున్న ఇద్దరు చైనా సైంటిస్టులను (భార్యభర్తలు) ల్యాబ్​ తీసేసింది. ల్యాబ్​ పాలసీలను తుంగలో తొక్కారన్న కారణంతో వారిద్దరితో పాటు స్టూడెంట్లను తొలగించింది. దీంతో ఆ ఇద్దరు సైంటిస్టులే వుహాన్​లోని ల్యాబ్​కు కరోనా వైరస్​ను పంపించారని, ఆ ల్యాబ్​ నుంచి అది బయటకు పాకిందని అంటున్నారు. సోషల్​ మీడియాలో ఇప్పుడు ఇది బాగా హాట్​ టాపిక్​ అయింది. అయితే, కెనడా ప్రభుత్వం ఆ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.

మందుల కోణం

ఇంగ్లాండ్​లోని పిర్​బ్రైట్​ ఇనిస్టిట్యూట్​ అనే వర్సిటీ కరోనా వైరస్​కు మందును తయారు చేసి 2015లో పేటెంట్​కు అప్లై చేసుకుందని కొందరు వాదిస్తున్నారు. సొంత లాభం కోసమే కొన్ని ఫార్మా కంపెనీలు కావాలని ఆ వైరస్​ను బయటకు లీక్​ చేశాయని ఆరోపణలు చేశారు. అంతేకాదు, వ్యాక్సిన్​ డెవలప్​మెంట్​, పిర్​బ్రైట్​ ఇనిస్టిట్యూట్​కు నిధులు ఇస్తున్న బిల్​ అండ్​ మెలిందా గేట్స్​ ఫౌండేషన్​కూ లింకు పెట్టారు.

గబ్బిలం సూప్​ నుంచా?

ఇక, చాలా మందైతే చైనా వాళ్లు తినే తిండి వల్లే వైరస్​ వ్యాపించిందని పుకార్లు పుట్టించారు. ఓ మహిళ గబ్బిలం సూప్​ తాగుతున్న వీడియోను పెట్టి చైనా వాళ్ల తిండి అలవాట్లను ప్రస్తావించారు. అయితే, అధికారులు ఆ ఆరోపణలనూ కొట్టిపారేశారు. ఆ వీడియో గురించి ఆరా తీయగా ఎప్పుడో 2016లో వెస్టర్న్​ పసిఫిక్​ ఓషన్​లోని పలావ్​లో తీసిందని తేలింది.

చైనా అనుకున్న దానికన్నా ఎక్కువా?

వుహాన్​లోని ఓ హాస్పిటల్​లో పనిచేస్తున్న నర్సు పేరిట ఓ వీడియో వైరల్​ అవుతోంది. దాదాపు 90 వేల మంది దాకా ఆ వైరస్​ బారిన పడ్డారని ఆ వీడియోలో ‘వుహాన్​ నర్స్​’ చెప్పింది. అయితే, సిటీని పూర్తిగా మూసేయడంతో ఆ వీడియోలో నిజమెంతన్నది అధికారులూ చెప్పలేకపోతున్నారు. కానీ, డబ్ల్యూహెచ్​వో లెక్కల ప్రకారం ఆర్​0 (వైరస్​ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే నంబర్​) పోలిస్తే ఆ నర్సు చెబుతున్న కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. డబ్ల్యూహెచ్​వో లెక్కల ప్రకారం ఆర్​0 కేసులు 1.4 నుంచి 2.5 రెట్లుండే అవకాశం ఉంది. నర్సు చెప్పిన కేసులంటే ఆ విలువ 14 నుంచి15 దాకా వెళుతుందని అధికారులంటున్నారు.

For More News..

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం

Latest Updates