కేసీఆరే డిస్మిసయ్యే రోజొస్తది

  • హిట్లర్‌కు పట్టిన గతే సీఎంకు పడ్తది
  • సామాజిక, ప్రజాసంఘాల ఫైర్‌
  • ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తే రిజర్వేషన్లు ఉండవు
  • దొరల రాజ్యంలో బడుగులకు న్యాయం జరగదు
  • నాటి ఉద్యమంలో కార్మికులు దేవుళ్లు.. ఇప్పుడు రాక్షసులా..?
  • విలీనం ఏపీలో సాధ్యమైనప్పుడు ఇక్కడెందుకు కాదు?
  • బడుగులపై ప్రేమ ఉంటే పువ్వాడ రాజీనామా చేయాలి

హైదరాబాద్‌‌, వెలుగు:

‘‘ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఆయనే డిస్మిస్ అయ్యే రోజు వస్తుంది. నియంత హిట్లర్‌‌కు పట్టిన గతే కేసీఆర్‌‌కు పడుతుంది” అని సామాజిక, ప్రజాసంఘాలు ఫైర్‌‌ అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలు, యూనియన్ల నేతలు ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో దేవుళ్లుగా కనిపించిన కార్మికులు ఇప్పుడు రాక్షసులు అయ్యారా అని నిలదీశారు. . హైకోర్టులో ఓడిపోతామనే భయంతోనే సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం అంటున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్మికులే ఉన్నారని, దొరల రాజ్యంలో బడుగులకు న్యాయం జరగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను ఉల్లంఘించి కేసీఆర్‌‌ దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌కు ప్రేమ ఉంటే.. మంత్రి పదవికి రాజీనామా చేసి, కార్మికులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఏపీలో సాధ్యమైన ఆర్టీసీ విలీనం ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదో కేసీఆర్ చెప్పాలన్నారు.

17 నుంచి ఆందోళనలు: మందకృష్ణ

ఆర్టీసీని మూసేయాలని కేసీఆర్‌‌ ఎప్పటినుంచో అనుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు, ప్రైవేట్‌‌ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు ఉండటంతో 50 వేల మంది కార్మికుల్లో 40 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా ఉన్నారని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేట్ చేస్తే ఓనర్లు అగ్రకులాల వాళ్లే అవుతారని, ఇక బడుగులకు ఉద్యోగాలు ఇవ్వరన్నారు. ఆర్టీసీ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని చెప్పారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం సబ్బండ వర్గాలతో 17వ తేదీన ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 18న ఎమ్మార్పీఎస్‌‌ ఆధ్వర్యంలో డిపోల వద్ద నిరసన దీక్షలు చేస్తామన్నారు. కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావడంతో ఆర్టీసీ జేఏసీలో చేర్చుకోని వాళ్లకు ఇందిరా పార్క్‌‌ దీక్ష ద్వారా బుద్ధి చెబుతామన్నారు. 20న గవర్నర్‌‌ను కలవనున్నట్లు చెప్పారు. 30న లక్షలాది మందితో హైదరాబాద్ దిగ్బంధ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

యూనియన్లు ఉండొద్దని ఎట్లంటరు?: జస్టిస్‌‌ చంద్రకుమార్‌‌

దొరల రాజ్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగదని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. ఆర్టీసీలో 22 డిమాండ్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని, మిగతా 4 డిమాండ్లకు 47 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని చెప్పారు. యూనియన్లు ఏర్పాటు చేసుకోవచ్చని కార్మిక చట్టాల్లో ఉందని, చట్టం తెలిసిన వారు యూనియన్లు ఉండకూడదని ఎలా అంటారని నిలదీశారు. చట్టాలను ఉల్లంఘించి సీఎం కేసీఆర్‌‌ పరిపాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్‌‌ను కోరామని తెలిపారు. ఆర్టీసీ ప్రైవేట్‌‌ అయితే ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో మాదిరి దోచుకుంటారని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

కోర్టులకూ అబద్ధాలు చెబుతున్రు: హనుమంతు ముదిరాజ్‌‌

కోర్టులకు కూడా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆర్టీసీ జేఏసీ వన్‌‌ కన్వీనర్‌‌ హనుమంతు ముదిరాజ్‌‌ ఆరోపించారు. సమ్మె చేస్తే ఉద్యోగాలు తీసేస్తామని కేసీఆర్‌‌ హెచ్చరించినా కార్మికులు భయపడలేదన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా, నష్టాల్లో ఉందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. కానీ ఇప్పటి దాకా వేల మంది రిటైర్ అయ్యారని పేర్కొన్నారు.

కేబినెట్​లో ఏముంటది.. కేసీఆర్ చెప్పిందే రాసుకుంటరు: రాములు నాయక్‌‌

హైకోర్టులో ఓడిపోతాననే భయంతోనే సుప్రీంకోర్టుకు వెళ్తానని కేసీఆర్ అంటున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌‌ ఆరోపించారు. కేసీఆర్ మొండివాడు కాదని, చాలా భయస్తుడని అన్నారు. కేబినెట్ సమావేశంలో ఏమీ ఉండదని, కేసీఆర్ చెప్పిందే పేపర్‌‌పై రాసుకుంటారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌కు ప్రేమ ఉంటే, మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్‌‌ చేశారు. కేసీఆర్ ప్రాణం చినజీయర్ స్వామి, మై హోం రామేశ్వర రావు, మేఘా కృష్ణారెడ్డి చేతిలో ఉందని, అందుకే వాళ్ల ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తే కేసీఆర్ స్పందిస్తారని దుయ్యబట్టారు. ఇలాంటి తెలంగాణ వస్తదనుకుంటే అప్పుడే సైనెడ్ తాగి చనిపోయేవాళ్లమన్నారు.

అమరుల కుటుంబాలకు 20 వేలు: దాసు సురేశ్

ఆర్టీసీ ఉద్యమంలో అమరులైన కార్మికుల కుటుంబాల కోసం తన వంతు సాయంగా 20 వేలు ఇస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ దాసు సురేశ్ ప్రకటించారు. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను భిక్షాటన చేసి అయినా ఆదుకోవాలన్నారు.

కేసీఆర్ మెడలు వంచేది ఎస్సీ, ఎస్టీ, బీసీలే: జేబీ రాజు

నియంత హిట్లర్‌‌కు పట్టిన గతే కేసీఆర్‌‌కు పడుతుందని దళిత హక్కుల నేత జేబీ రాజు అన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులతో దుర్మార్గంగా కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గ, రాజ్యాంగ వ్యతిరేకమైన పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఏపీలో సాధ్యమైన ఆర్టీసీ విలీనం ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలతోనే సాధ్యమవుతుందన్నారు.

Social and public groups fire on CM KCR on RTC Strike

Latest Updates