ఇప్పుడంతా లైవ్​ స్ట్రీమింగ్ దే హవా..!

సెల్ఫీలు తీసుకుని పోస్ట్​ చేయడం…నచ్చిన పోస్టులను షేర్​ చేసుకోవడం ఇదంతా ఓల్డ్​ ఫ్యాషన్​.  ఇప్పుడంతా సోషల్ మీడియాలో  లైవ్​ స్ట్రీమింగ్​ హవా నడుస్తోంది. బర్త్​డే పార్టీ, సక్సెస్​ మీట్​.. పబ్లిక్​ మీటింగ్​…సోషల్​ ఈవెంట్స్, రాజకీయ నాయకుల ప్రసంగాలు..ఇలా ఫంక్షన్​ ఏదైనా సరే సోషల్​ మీడియాలో లైవ్​ రావాల్సిందే. ఇది ప్రజెంట్ యూత్​ ట్రెండ్.  పండగైనా, పబ్బమైనా సోషల్​మీడియా మిత్రులను పలకరించాల్సిందే. ఈ   లైవ్ ట్రెండ్స్​ని ఫాలో అవుతున్న వాళ్ల కోసమే  ఫేస్​బుక్​,ట్విట్టర్​,యూట్యూబ్​ లాంటి సోషల్​ నెట్​వర్కింగ్ సైట్స్​ లైవ్ ఆప్షన్స్​ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు  ఐఓఎస్​, విండోస్​ ఫోన్లకే పరిమితమైన ఈ ఫీచర్​ ఆండ్రాయిడ్​ ఫోన్లలోనూ అందుబాటులోకి రావడంతో లైవ్​ స్ట్రీమింగ్​ ఇప్పుడు అందరికి హాట్​ ఫేవరెట్​ అయింది.  లైవ్​ స్ట్రీమింగ్  క్రేజ్​పై  యాక్టివ్​ యూజర్స్​లో కొందరిని అడిగితే ఇలా  చెప్పారు.

ట్రెండ్ అలా మొదలైంది..

ప్రస్తుతం   లైవ్​ స్ట్రీమింగ్​ని ఎక్కువగా  వాడుతోంది ఫంక్షన్లకే . విదేశాలు, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల కోసం ఈ ఆన్​లైన్​ ప్రత్యక్షప్రసారం ట్రెండ్​ మొదలైంది . ఇక ఈ ఇంటర్నెట్​ యుగంలో  బంధుమిత్రులే కాకుండా  మొత్తం ప్రపంచమే మీ ఇంటి వేడుకని వీక్షిస్తుంది. ‘అంబరాన్నంటిన  సంబరాల్ని అందరితోనూ ప్రత్యక్షంగా పంచుకోవడం సంతోషమే కదా!!  అందుకే ఏ  వేడుకనైనా ఆన్​లైన్​లో  లైవ్​ స్ట్రీమింగ్​ చేస్తున్నారు.

ఇంట్లోకి కొత్తగా చిన్న పిల్లలు వస్తే ఆ సందడే వేరు. వాళ్లకి సంబంధించిన ప్రతి విషయం చాలా ఆనందాన్నిస్తుంది. ఇక మామా ​అల్లుళ్ల బంధం అయితే అన్నింటికన్నా  స్పెషల్​.  కానీ నా మేనల్లుడి అన్నప్రాసన రోజు నాకు ఎగ్జామ్. అది రాయకుండా ఉందామంటే ఫైనలియర్​. ఫంక్షన్ పోస్ట్​పోన్ చేసుకుందామంటే  అదీ కుదరలేదు.  ఇక చేసేదేం లేక నేను సైలెంట్ అయ్యాను. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చి  ఫోన్ ఆన్ చేస్తే ఫేస్​బుక్​లో  లైవ్​ నోటిఫికేషన్​. అక్కడే కూర్చొని ఫంక్షన్​ అంతా లైవ్​లో చూశాను. మా వాళ్లు అంత అప్​డేట్​ అయ్యారని నాకు అప్పుడే అర్థమయింది’ అన్నాడు కార్తీక్​.

ఆశీర్వచనాలు ఉండాల్సిందే

ఎక్కడో ఉన్నవాళ్లకే కాదు.. కదలలేని పరిస్థితుల్లోనూ  కొంతమంది ఉంటారు. వారికి ఈ ఆన్​లైన్ స్ట్రీమింగ్​ ద్వారా అక్కడికి వెళ్లలేకపోయామన్న బాధ ఉండదు.  ఇంటర్నెట్, ల్యాప్​టాప్,  కంప్యూటర్, స్మార్ట్​ ఫోన్​ ఉంటే చాలు  కళ్ల ముందే వేడుక ప్రత్యక్షమవుతుంది. ఎవరెంత దూరంలో ఉన్నా అందరి ఆశీర్వచనాలు  ఉండాల్సిందే కదా!   అందుకే  ఆన్​లైన్ స్ట్రీమింగ్​ బెస్ట్​ ఆప్షన్ అంటోంది సంధ్య.

రాజకీయాల్లోనూ లైవ్ స్ట్రీమింగ్

‘రాజకీయాల్లోనూ లైవ్​ స్ట్రీమింగ్​ కీలకపాత్ర పోషిస్తోంది. వార్డు మెంబర్​ మొదలుకొని రాష్ర్ట ముఖ్యమంత్రుల వరకు  ప్రతి ఒక్కరు తమ కార్యకలాపాలకు సోషల్​ మీడియా లైవ్​ని వేదికగా మలుచుకుంటున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు చేపడుతున్న కార్యక్రమాలు నేరుగా ప్రజలు తిలకించే అవకాశం వచ్చింది.  ప్రధాని  మోదీ ప్రచార ప్రసంగాలు సైతం  పలు సోషల్​ మీడియా నెట్​వర్క్​ల్లో నేరుగా లైవ్​ స్ట్రీమింగ్​ అవుతున్నాయి కదా’ అంటోంది కీర్తన.

టెక్నాలజీ ప్రియులు

టెక్నాలజీ  ప్రియులైన యువత తమ వెడ్డింగ్​ ఇన్విటేషన్​లను ఆన్​లైన్​లో పంపటం మాత్రమే కాదు.. ఇప్పుడు పెళ్లిని కూడా ఆన్​లైన్​లో అందరికీ చూపాలని కోరుకుంటున్నారు.  వివాహం కావాల్సిన వాళ్లను పెద్దలు ‘లైవ్​ పెళ్లి ప్రాప్తిరస్తు’ అని దీవించే కాలం వచ్చేసింది.  లైవ్​ స్ట్రీమింగ్​ సదుపాయం సుదూరంలో ఉండే వారికి కూడా వేడుకను వీక్షించే అవకాశం కల్పిస్తుంది. ఆన్​లైన్​లో ప్రత్యక్ష ప్రసారం కల్యాణానికి మరింత కళ తెస్తోంది. ‘ఖాళీగా ఉంటే  ఫోన్​ అంతా జల్లెడ పట్టడం నాకు అలవాటు.  ఏం తోచక ఇన్​స్ట్రాగ్రామ్​ ఓపెన్​ చేశాను. చూస్తే లైవ్​లో నా చిన్నప్పటి క్లాస్​మేట్​ పెళ్లి.  వాడు నన్ను పెళ్లికి పిలవలేదు అనుకోండి.  కానీ ఆ  వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది.  నా చిన్నప్పటి  ఫ్రెండ్స్​ గ్యాంగ్ అంతా అటుఇటు తిరుగుతూ ఫుల్​ హడావుడి చేస్తున్నారు.  ఫోన్​ని కూడా అష్ట వంకరలు తిప్పుతున్నారు. వాళ్లని చూస్తే మనసుకి చాలా రిలాక్స్​గా అనిపించింది’ అని చెప్పాడు  సాఫ్ట్​వేర్​ ఉద్యోగి  దినేష్​ కుమార్​.

నెగెటివ్ కామెంట్స్ ఎక్కువే

‘నేను మోడల్​గా పనిచేస్తున్నాను. నా ప్రొఫెషన్​ వల్ల  ఎప్పుడూ సోషల్​ నెట్​వర్కింగ్​  సైట్స్​లో యాక్టివ్​​గా ఉంటాను. ఎలాంటి అకేషన్ అయినా సరే  ఫేస్​బుక్​ లైవ్​కి  వెళ్తాను, కొందరు   నా ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి ఏవేవో ప్రశ్నలు అడుగుతుంటారు. కొందరైతే పాటలు కూడా పాడమంటారు. వాళ్లని బాధ పెట్టడం ఇష్టం లేక ఏదో  ఒక కూని రాగం తీస్తుంటాను.  నా షోస్​కి ముందు కూడా లైవ్​కి వెళ్తాను. నెగెటివ్​ కామెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి.  మొదట్లో కాస్త బాధగా అనిపించేది. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశాను.
కొన్ని సార్లు ఆ  కామెంట్స్ చూస్తే నవ్వొస్తోంది’ అంటోంది శిల్ప.

హద్దులుండాలి

‘సంతోషాలను, వేడుకలను లైవ్​లో పంచుకోవడంలో తప్పు లేదు.కానీ అంత్యక్రియలను సైతం ఫేస్​బుక్​ లైవ్​లో పెట్టేస్తున్నారు కొందరు. యాక్సిడెంట్​ అయితే సేవ్​ చేయడం మానేసి లైవ్​లో వాళ్లని చూపిస్తున్నారు. లైవ్​లో ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. ప్రమాదకరమైన స్థలాలకు వెళ్లి ప్రాణాలను  లెక్కచేయకుండా  లైవ్​ స్ట్రీమింగ్​ చేస్తున్నారు. అలాంటి వాళ్లను చూస్తే చాలా కోపమొస్తోంది’ అన్నాడు చంద్రశేఖర్​.

యూట్యూబ్​లో
వెయ్యిమంది ఫాలోవర్లుంటే లైవ్..

సోషల్​ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న ‘యూ ట్యూబ్’​ లైవ్​ స్ట్రీమింగ్​లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గతంలో  పదివేలమంది ఫాలోవర్స్​ ఉన్నవారికి మాత్రమే లైవ్​ ఆప్షన్ ఇచ్చిన యూట్యూబ్​  ఈ మధ్య ఆ సంఖ్యను వెయ్యికి సడలించింది. యూట్యూబ్​ ఓపెన్​ చేసిన వెంటనే కెమెరా ఐకాన్​ కనిపిస్తుంది.  ఐకాన్​ క్లిక్​ చేస్తే వెంటనే లైవ్​ ఆప్షన్​ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా లైవ్​ స్ట్రీమింగ్​ ఇవ్వొచ్చు. సోషల్​ మీడియాలో లైవ్​ స్ట్రీమింగ్​ను షేర్​ చేయొచ్చు.

ట్విట్టర్లో పెరిస్కోప్తో లైవ్..

సోషల్​ మీడియాలో ఎక్కువమంది సెలబ్రిటీ యూజర్స్​ ఉన్న మైక్రో బ్లాగింగ్​ ఫ్లాట్​ పామ్​ ట్విట్టర్​లోనూ లైవ్​ పోస్ట్​ చేయవచ్చు. పెరిస్కోప్​ మీర్కట్​ అనే హ్యాండిల్స్​ ద్వారా ట్విట్టర్​ లైవ్​ను అందిస్తుంది. ట్విట్టర్​ ఆధారిత సర్వీసుల్లోనూ పెరిస్కోప్​కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ యాప్​కి దాదాపు పది మిలియన్​కి పైగా ఫాలోవర్స్​ ఉన్నారు. అందులో ప్రతిరోజూ  సుమారు రెండు మిలియన్ల​ మందికిపైగా ప్రతిరోజు పెరిస్కోప్​ ఓపెన్​ చేస్తున్నారని అంచనా. ఈ యాప్​ ద్వారా ప్రపంచంలో నెట్​  సౌలభ్యం ఉన్న ఎక్కడి నుంచైనా లైవ్​ స్ట్రీమింగ్​ చేయొచ్చు.  ట్విట్టర్​లో ‘మీర్కట్’​ అనే మరో లైవ్​ ఆప్షన్ ఉన్నప్పటికీ పెరిస్కోప్​కే ఎక్కువ క్రేజ్​ ఉంది.

ఇన్స్టాగ్రామ్లోనూ

ముఖ్యమైన పోస్టులను స్టోరీలుగా చూపించే ఫీచర్​ను అందిస్తున్న ఇన్​స్టాగ్రామ్​ సైతం లైవ్​ వీడియోను షేర్​ చేసుకునే  ఫీచర్​ని అందుబాటులోకి తెచ్చింది. ట్విట్టర్​, ఫేస్​బుక్​ తరహాలో పెరిస్కోప్ వంటి యాప్స్​ అనుసంధానంతో ఇన్​స్ట్రాగ్రామ్​ లైవ్​  టెలికాస్ట్​  చేస్తుంది,

Latest Updates