కరోనాను ఎదుర్కోవడానికి ‘సోషల్ వ్యాక్సిన్’ ఒక్కటే మార్గం

సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సోషల్ వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. 940 కరోనా శాంపిల్‌ల జినోమ్ సీక్వెన్స్‌ను స్టడీ చేసిన సీఎస్‌ఐఆర్ సైంటిస్టులు వాటిలో ఏ2ఏ రకం వైరస్‌ చాలా ప్రమాదకరమని తేల్చారని ఆయన అన్నారు. దేశంలో మార్చి నుంచి జూన్ వరకు ఈ రకం వైరస్ ఎక్కువగా సోకి ఉండొచ్చని సమాచారం. సీసీఎంబీ సేకరించిన శాంపిల్స్‌లో చాలా మటుకు గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి తీసుకున్నవేనని తెలిసింది.

కొత్త డ్రగ్స్‌ను కనుగొనే పరిశోధన ప్రక్రియ ముందుకు సాగుతున్నంత వేగంగా ఉత్పరివర్తన మాత్రం జరగడం లేదని రాకేశ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి సుదీర్ఘ ప్రక్రియ అని.. మనకు మిగిలి ఉన్న ఏకైక ఆప్షన్ ‘సోషల్ వ్యాక్సిన్‌’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దానర్థం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవాలని, మాస్కులు కట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాల్సిందేనన్నారు. తెలంగాణతోపాటు మొత్తం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. తద్వారా వైరస్ లక్షణాలు లేని వారినీ త్వరగా గుర్తించొచ్చన్నారు. మనం ఇప్పుడు కఠిన పరిస్థితుల్లో ఉన్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున శాంపిల్స్‌ను సేకరించాల్సి ఉందని, తాము కనీసం నాలుగైదు నెలలు శ్రమించాల్సి ఉంటుందని రాకేశ్ మిశ్రా వివరించారు.

Latest Updates