పెరగనున్న సాఫ్ట్ వేర్ల జీతాలు

పది శాతం పెరుగే చాన్స్

టాప్ పర్ఫార్మర్లకు 20 శాతం గ్యారెంటీ అంటున్న నిపుణులు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల జీతాలు ఈ ఏడాది భారీగా పెరిగే చాన్స్ ఉందట. పోయిన ఏడాది కంటే రెండు నుంచి నాలుగు శాతం ఎక్కువ ఇంక్రిమెంట్లు రావొచ్చని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్ కామ్) తెలిపింది. మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ కు రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండే ఇండస్ట్రీ బూమ్ కు కారణమని నిపుణులు చెబుతున్నారు.

గతేడాది ఎనిమిది శాతం వరకే పరిమితమైన శాలరీల పెంపు, ఈ సారి కనీసం 10 శాతం పెరుగుతాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ తదితర డిమాండ్ ఉన్న రంగాల్లో టాలెంట్ ఉన్నవారికి 20 శాతం ఇంక్రిమెంట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని నాస్ కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అభిప్రాయపడ్డారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఆన్, హ్యూమన్ రిసోరెర్స్ కన్సల్టింగ్ ఏజెన్సీ మెర్సర్ కూడా ఐటీ సెక్టార్ లో కనీసం 10 శాతం వేతనాలు పెరగొచ్చని చెప్పాయి.  2018 జూన్ ఇంక్రిమెంట్లను పోల్చుతూ వేసిన అంచనాల్లో ఈ ఏడాది కనీసం 9.8 శాతం వేతనాలు పెరుగుతాయని తేలిందని ఆన్ తెలిపింది. తుది అంచనాలు ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్నాయని, వచ్చే నెలాఖరులోగా బయటికొస్తాయని చెప్పింది.

కొత్త ఉద్యోగాలు

2017 నుంచి కొత్త రిక్రూట్ మెంట్లను ఆపుకుంటూ వస్తున్న కంపెనీలు కూడా ఈసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసుకుంటాయని నాస్ కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా తెలిపారు. ఇప్పటికే రిక్రూట్ మెంట్లు బాగా జరిగాయని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిందని తెలిపారు. 2017–18లో కేవలం 44 మందినే తీసుకున్నట్లు వివరించారు. 2018 డిసెంబర్ నాటికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలకు పైమాటే.

పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు, రివార్డులు

టాలెంట్ కలిగిన ఉద్యోగులు, ఇతర సంస్థల వైపు చూడకుండా ఉండేలా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయట. కాలానుగుణంగా స్కిల్స్ ను పెంచుకుంటూ, పర్ఫార్మెన్స్ చేస్తున్న ఎంప్లాయిస్ కు రివార్డులు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో విఫలమైన వాళ్లకి, ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని వివరించారు.

40 శాతం టాప్ పర్ఫార్మర్లకే

కంపెనీలు టాప్ పర్ఫార్మర్లకు భారీ స్థాయిలో జీతాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయని విల్లిస్ టవర్స్ వాట్సన్ స్టడీస్ పేర్కొంది. ఏటా తమ బడ్జెట్లో వీళ్ల జీతాల పెంపు కోసమే 40 శాతం కేటాయిస్తున్నాయని చెప్పింది. యావరేజ్ పర్ఫార్మర్లకు సగటున 8 శాతం వేతనాలు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది ఐటీ, ఐటీ సర్వీసుల్లో పని చేసే వాళ్లకు 9.5 నుంచి 9.7 శాతం వరకూ శాలరీలు పెరగొచ్చని ఫస్ట్ ముంబై మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ పురోహిత్ తెలిపారు

Latest Updates