భూమ్మీద ఒంటరి ఇవి!

ఈ ప్రపంచంలో మీ ఒక్కరి భాషే వేరైనప్పుడు..  మిమ్మల్ని అవతలివాళ్లు, వాళ్లను మీరు అర్థం చేసుకోలేరు. అప్పుడు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా.. ఒంటరే! ఒంటరిగా బతకడమంటే..చానా కష్టం. ఫోన్‌‌తోనో, బుక్‌‌తోనో గడుపుతూ కొంతవరకు ఒంటరితనాన్ని తట్టుకోగలిగినా..చివరికి ఒక తోడు ఉండాలని కోరుకుంటరు. దాంట్లో డౌటే లేదు. అయితే, కొన్ని జంతువులు మాత్రం ఏళ్లకు ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నయ్‌‌!

బ్లూవేల్‌‌52
ఒంటరి ప్రపంచానికి స్వాగతం. ఒంటరిగా బతికేవాటిలో  బ్లూవేల్52 ముందు వరుసలో ఉంటది.  సముద్రాల్లో ఉండే తిమింగలాలు(వేల్స్‌‌).. 10 నుంచి 39 హెడ్జ్‌‌ల ఫ్రీక్వెన్సీతో కమ్యూనికేషన్‌‌ నడిపితే..  బ్లూవేల్‌‌52 మాత్రం 52 హెడ్జ్‌‌ల ఫ్రీక్వెన్సీతో కమ్యూనికేషన్ నడుపుతది. అంటే బ్లూవేల్ సిగ్నల్స్‌‌ వేరే ఏ తిమింగలానికి చేరవు. అసలు అదొకటి ఉందని కూడా వాటికి తెల్వదు. ‘అంత పెద్ద సముద్రంలో దోస్తులు, ఫ్యామిలీ లేకుండా బ్లూవేల్‌‌ 52 అటూ ఇటూ తిరుగతది’అని 1980ల్లో సైంటిస్టులు కనుగొనేవరకు తెల్వదు. ప్రపంచంలో  అత్యంత ఒంటరి ప్రాణి బ్లూవేల్‌‌ 52నే!

లోన్‌‌సమ్‌‌ జార్జ్‌‌
‘లోన్‌‌’ అని పేర్లనే తెలుస్తుంది కదా ‘లోన్‌‌సమ్‌‌ జార్జ్‌‌’ ఒంటరి ప్రాణి అని. ‘లోన్‌‌సమ్‌‌ జార్జ్‌‌’ ‘పింటా’ దీవిలో ఉండే ఒక తాబేలు జాతి అంటరు. 20వ శతాబ్దం ప్రారంభంలో కనుమరుగవుతున్న జాతుల లిస్ట్‌‌లో ‘లోన్‌‌సమ్‌‌ జార్జ్‌‌’ పేరే లేదు. మనుషులు వీటిని మాంసం కోసం వేటాడటంతో.. అంతరించిపోయే దశకు చేరుకున్నయ్. ఇవి తిండి, నీళ్లు లేకుండా సంవత్సరం బతకగలవు. 1972లో అరవై ఏళ్ల వయసున్న జార్జ్‌‌ని  జూకి తీస్కపోయిన్రు. తోటి తాబేళ్లతో దాన్ని ఉంచిన్రు. అప్పుడే అది డల్‌‌ అయింది.  వాటితో ఇమడలేక చివరికి ప్రాణాలు విడిచింది.

టఫీ ఫ్రాగ్‌‌
 చెట్ల మీద జీవించే కప్పలన్నీ అంతరించిపోయే దశకు చేరుకున్నయ్‌‌. వాటిలో ‘ టఫీ ఫ్రాగ్స్‌‌’ పరిస్థితి చివరి దశకు వచ్చింది. పనామాలో ఉన్న రెయిన్ ఫారెస్ట్‌‌లో ఇవి ఒక చెట్టు మీది  నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ ఎంజాయ్ చేసేవి. ఇవి టఫీ జాతి కప్పలతో తప్ప వేరేవాటితో కలవవు. ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఒకే ఒక మగ టఫీ ఫ్రాగ్ ఏడేళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది.
చివరి ఆడ టఫీ ఫ్రాగ్‌‌ చనిపోయి.. ఏడేళ్లైంది! అదొక్కటి చనిపోతే ఈ జాతే మాయమైతది. ఇది స్పందించడం కూడా మానేసింది. ఆడ టఫీ ఫ్రాగ్‌‌ రికార్డింగ్స్‌‌కి కూడా స్పందించడం లేదు. బహుశా దానికి తెలుసేమో ఈ భూమ్మీద టఫీ ఫ్రాగ్స్‌‌ లేవని!

ది మ్యాన్ ఆఫ్ హోల్‌‌
బ్రెజిల్‌‌లోని అమెజాన్‌‌ అడవిలో ఒక మనిషి 22 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతుండు. ఎవరికీ కనపడకుండా ఉండటానికో లేక జంతువులను వేటాడటానికో తెల్వదు గానీ అడవిలో వేలకొద్ది పెద్ద పెద్ద గుంటలు తీసిండు. దాంతో  ఆయన్ను ‘ది మ్యాన్ ఆఫ్ హోల్‌‌’ అంటున్నరు.
ఇతను మాట్లాడే ట్రైబల్ భాష ఎవరికీ అర్థం కాదు. 80ల్లో స్మగ్లర్లు వీళ్లున్న ప్రాంతంపై దాడి చేసి.. అందరినీ చంపేసిన్రు. ఈ ఒక్కడు మిగిలిండు. అతనుండే  వైపు ఎవరూ పోకుండా, అతన్ని రక్షించడానికి బ్రెజిల్ చర్యలు చేపట్టింది. అటవీ అధికారులు ఎవరైనా ఈ అడవిమనిషిని చూడటానికి వస్తే.. బాణాలు కురిపిస్తడు.