ఎమ్మెల్యే చిన్నయ్య ఆర్మీ పేరిట యువకుల హల్​చల్​

మంచిర్యాల, వెలుగు:  లాక్​డౌన్​ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  ఆర్మీ పేరిట కొంతమంది యువకులు చేతిలో కర్రలు పట్టుకొని రాత్రివేళ పోలీసులతో కలిసి రోడ్లపై హల్​చల్​ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కొందరు ట్విటర్​ ద్వారా రాష్ర్ట డీజీపీకి, సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో విషయం హయ్యర్​ ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. తాజాగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐదుగురు పై ఎపిడెమిక్​ డిసీస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది..

లాక్​డౌన్​ సందర్భంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 25న ఎమ్మెల్యే చిన్నయ్య ఆర్మీ పేరిట కొంత మంది యువకులు స్వయానా వన్​టౌన్​ సీఐ తో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్​ ఏరియాలో రాత్రి 10 గంటల సమయంలో గస్తీ తిరిగారు. చేతిలో కర్రలు పట్టుకొని రోడ్లపై ఓవరాక్షన్​ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ పత్రికలో వార్త రావడంతో  కొంతమంది ట్విటర్​లో  రాష్ర్ట డీజీపీ, సీఎంవోలకు ట్యాగ్​ చేస్తూ చిన్నయ్య ఆర్మీ, పోలీసుల తీరును ప్రశ్నించారు. అది మార్చి 25న జరిగిందనీ, వెంటనే తాను వారిని హెచ్చరించానని మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి చెప్పారు. కానీ సీఎంవో, డీజీపీ సీరియస్​ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్​188 కింద కేసు నమోదు చేశామని వన్​టౌన్​ సీఐ బి.రాజు వెల్లడించారు.

కేసు పెట్టాం: ఉదయ్ కుమార్ రెడ్డి, డీసీపీ

కోవిడ్19 కట్టడి చర్యల్లో భాగంగా వలంటరీ సర్వీస్ చేస్తామంటూ కొంతమంది యూత్ వచ్చారని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. మార్కెట్ ఏరియాలో పోలీసులతో ఫోటోలు దిగారని , అట్ల బయటకు రావద్దని వారికి సూచించి కేసు నమోదు చేశామన్నారు.

Latest Updates