రాహుల్ కోటరీకి సోనియా చెక్‌

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్లీ తనదైన ముద్ర వేస్తున్నారు సోనియాగాంధీ. వరుసగా కీలక నిర్ణయాలతో మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీకి సన్నిహితులుగా పేరున్న నేతలను పక్కనబెట్టడం ఆసక్తి రేపుతోంది. తాజాగా హర్యానా పీసీసీ చీఫ్ ని మార్చడం, డేటా అనలిటిక్స్ చీఫ్ ను తప్పించడం లాంటి నిర్ణయాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. రాహుల్ ను వారు తప్పుదోవ పట్టించడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కోటరీగా ముద్రపడ్డ వర్గానికి చెక్ పెడుతున్నారని 10 జనపథ్ వర్గాలు చెబుతున్నాయి.

హర్యానాతో మొదలు

తాజాగా హర్యానా పీసీసీ చీఫ్ గా అశోక్ తన్వర్ ను తప్పిస్తూ, ఆయన స్థానంలో కుమారి షెల్జాను నియమించారు సోనియాగాంధీ. అదే సమయంలో పీసీసీ పదవిని ఆశిస్తున్న మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడాను సీఎల్పీ నేతగా నియమించారు. రెండునెలల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు పదేండ్ల పాటు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో పూర్తిగా బలహీనపడింది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పార్టీ కోలుకోలేదు. అప్పటివరకు సీఎంగా ఉన్న హుడా పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. హర్యానా ఓటమి తర్వాత రాహుల్ తన సన్నిహితుడైన అశోక్ తన్వర్ ను పీసీసీ చీఫ్ గా నియమించారు. హుడాకు సీఎల్పీ నేత పదవి కూడా దక్కలేదు. కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలన్న రాహుల్ ఆలోచన ప్రకారం ఆ పదవిని కిరణ్ చౌదరికి ఇచ్చారు.

ఇటు బీజేపీ జాట్ల ప్రాబల్యం ఉన్న హర్యానాలో నాన్ జాట్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్​ను సీఎంగా చేసింది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 10 సీట్లనూ బీజేపీ క్వీన్ స్వీప్ చేసింది. వాటిలో 7 సీట్లలో బీజేపీ 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ సీఎం హుడా అసమ్మతి రాగం మొదలు పెట్టారు. అశోక్ తన్వర్ స్థానంలో తనను పీసీసీ చీఫ్ చేసి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సొంత పార్టీ పెట్టుకుంటానని కొన్నిరోజులుగా బహిరంగంగానే బెదిరిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉండడంతో హర్యానాపై దృష్టిపెట్టిన సోనియా తెలివిగా అడుగులేస్తున్నారు. జాట్ నేత అయిన హుడా కొత్త పార్టీ పెడితే నష్టమని భావించిన ఆమె తన్వర్​ను తప్పించారు. అయితే ఆ పదవిలో తనకు సన్నిహితురాలైన కుమారి షెల్జాను నియమించారు. ఎస్సీ లీడర్ ను తప్పించి జాట్ నేతకు పీసీసీ చీఫ్ ఇస్తే ఆ వర్గాలు దూరమవుతాయన్న ఉద్దేశంతో అదే వర్గానికి చెందిన షెల్జాకు బాధ్యతలు అప్పగించారు. భూపీందర్ కోరుతున్న పీసీసీ పదవి కాకుండా ఆయన్ను సీఎల్పీ నేతగా నియమించారు.

రివర్స్ డేటా అనాలసిస్

సోనియాగాంధీ తీసుకున్న మరో కీలక నిర్ణయం కాంగ్రెస్ నేతలకే షాకిచ్చింది. రాహుల్ కు అత్యంత సన్నిహితుడైన డేటా అనలిటిక్స్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తికి రివర్షన్ ఇచ్చారు. ఏఐసీసీ డేటా అనలిటిక్స్ డిపార్ట్ మెంట్ కు చీఫ్ గా ప్రవీణ్ సీడబ్ల్యూసీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. రాహుల్ కోటరీలో ఆయన చాలా కీలకం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం గురించి రాహుల్ కు తప్పుడు విశ్లేషణ ఇచ్చారన్న విమర్శలు ప్రవీణ్ మీద ఉన్నాయి. రాఫెల్ వ్యవహారంలో మోడీ మీద ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ చేస్తున్న ఆరోపణలు జనం నమ్మేలా లేవని అప్పట్లోనే పలువురు నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. సొంత ఫ్యామిలీ లేని మోడీపై అవినీతి ఆరోపణలు చేస్తే ప్ర్రభావం ఉండదని చెప్పారు. దీనికి బదులు నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, నోట్లరద్దు, జీఎస్టీ లాంటి అంశాలతో ప్రచారం చేయాలని సూచించారు. అయితే రాఫెల్ విషయంలో జనం నుంచి గొప్ప స్పందన వస్తోందంటూ ప్రవీణ్ చక్రవర్తి ఫీడ్ బ్యాక్ ఇచ్చి తప్పుదోవ పట్టించారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ.

శక్తి యాప్ లో కాంగ్రెస్ సభ్యత్వాలను ఎక్కువగా చూపించారనీ, ఇందులో ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేలా చేయడం వల్ల గెలిచే సీట్లను కూడా కోల్పోవాల్సి వచ్చిందని ప్రవీణ్ పై పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. తప్పుడు సర్వేలతో కాంగ్రెస్ 150 సీట్లకు మించి గెలుస్తుందనీ, మోడీకి వ్యతిరేకంగా గాలి ఉందంటూ ఆయన రాహుల్ ను తప్పుదోవ పట్టించారని వారు అంటున్నారు. దీన్ని నమ్మడం వల్లే రాహుల్ ఆమ్ ఆద్మీ, తృణమూల్ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోటీకి దిగారని చెబుతున్నారు.

ఈ కారణాలతోనే ప్రవీణ్ చక్రవర్తి స్థాయిని తగ్గిస్తూ సోనియా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డేటా  అనలిటిక్స్ డిపార్ట్ మెంట్ చీఫ్ నేరుగా పార్టీ అధ్యక్షుడికి రిపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఆ డిపార్ట్ మెంట్  ను డేటా మేనేజ్ మెంట్ అండ్ ఐటీ సెల్ గా మార్చారు. సెల్ గా మారడంతో దాని ఇంచార్జి ఇక సీడబ్ల్యూసీ మీటింగ్ లకు హాజరయ్యే అవకాశం ఉండదు. ఇకపై కాంగ్రెస్ చీఫ్ కు బదులు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్ కు ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఒకే రోజు ఇద్దరు రాహుల్ కోటరీ మనుషులకు సోనియా చెక్ పెట్టడంతో మళ్లీ ఏఐసీసీలో ఆమె ముద్ర మొదలైందని పార్టీ వర్గాలంటున్నాయి. రాహుల్ ను ఆయన సన్నిహితులు ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టిస్తున్నారనీ, వారికి చెక్ పెట్టడమే మంచిదని సీనియర్ నేతలు చెబుతున్నారు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం సోనియా స్టైల్ అనీ, రాహుల్ అలా చేయకుండా తన కోటరీలోని వారిని నమ్మడం వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నది ఏఐసీసీ సీనియర్ల అభిప్రాయం.

Latest Updates