గ్రామీణ విద్యార్థులకు సోనుసూద్ మరో సాయం..

మారుమూల పల్లెలో సెల్ టవర్

చండీగఢ్: బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఊళ్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగాలేక ఆన్ లైన్ క్లాసులు వినేందుకు ఇబ్బంది పడుతున్న స్టూడెంట్ల కష్టాలను తీర్చారు. ఇందుకోసం ఆ ఊరిలో సెల్ టవర్ నే ఏర్పాటు చేయించారు. హర్యానాలోని మారుమూల పల్లె దపన(మోర్ని)లో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేవు. సిగ్నల్స్ కోసం అక్కడి పిల్లలు చెట్లు ఎక్కి ఆన్ లైన్ క్లాసులు వింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను ట్విట్టర్లో సోనూసూద్, ఆయన ఫ్రెండ్ కరణ్ గిల్హోత్రకు ట్యాగ్ చేయగా, వారు వెంటనే స్పందించి సాయంచేశారు. ఇండస్ టవర్స్, ఎయిర్ టెల్ తో కలిసి ఆ ఊళ్లో టవర్ ఏర్పాటు చేయించారు. ‘‘పిల్లలు మన దేశ భవిష్యత్తు. మంచి ఫ్యూచర్ను పొందేందుకు వాళ్లకు సమాన అవకాశాలు దక్కాలి. పిల్లలు చదువుకునేందుకు సెల్ టవర్ ఏర్పాటు చేయించడం.. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని సోనూసూద్ అన్నారు. ‘‘చదువుకునేందుకు దేశంలోని పిల్లలు ఇంకా ఇబ్బంది పడడం బాధ కలిగిస్తోంది. సెల్ టవర్ ఏర్పాటు చేయించడంతో పిల్లలు హ్యాపీగా ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు” అని కరణ్ గిల్హోత్ర చెప్పారు.

Latest Updates