ఐపీఎల్‌ లేకుండా ఈ ఏడాదిని ముగించబోం: గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్‌ గమనాన్ని మార్చిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీని చాలా మంది సీనియర్స్‌ మెచ్చుకుంటారు. దాదా నాయకత్వంలోనే టీమ్ దూకుడుగా ఆడటం నేర్చుకుందనేది ఎవరూ కాదనలేని నిజం. ప్రస్తుతం బీబీసీఐ బాస్‌గా ఉన్న దాదా బుధవారం 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. ఐపీఎల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ఏడాది నిర్వహిస్తామని చెప్పాడు. డొమెస్టిక్‌ సీజన్‌లో భాగంగా ఐపీఎల్‌ జరగాల్సిందేనని స్పష్టం చేశాడు.

‘ఐపీఎల్ జరగాలని మేం అనుకుంటున్నాం. క్రికెట్ పునరుద్ధరణ జరగాల్సిందే. ఇది మాకు ఆఫ్ సీజన్ కాబట్టి ఉపయోగపడిందనే చెప్పాలి. మా డొమెస్టిక్ సీజన్ మార్చిలోనే పూర్తి చేశాం. అయితే దేశవాళీలో కీలకమైన ఐపీఎల్‌ను రద్దు చేశాం. జీవితం మళ్లీ మునుపటిలా సాగాలి. అందుకే ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్నాం. కానీ టీ20 వరల్డ్‌ కప్‌పై ఐసీసీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కరోనా కారణంగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై లాంటి సిటీస్‌లో ఐపీఎల్‌ జరుగుతుందని ధీమాగా చెప్పలేం. ఒకవేళ మన దేశంలో సాధ్యం కాకపోతే వేరే కంట్రీలో టోర్నీ నిర్వహణ గురించి ఆలోచించాలి. ఎందుకంటే టోర్నీని ఇతర దేశాల్లో నిర్వహిస్తే బోర్డు, ఫ్రాంచైజీలపై చాలా భారం పడుతుంది. అందుకే ఐపీఎల్‌ను ఇక్కడే నిర్వహించడంపైనే దృష్టి పెట్టాం. ఈ ఏడాదిని ఐపీఎల్ లేకుండా ముగించాలని అనుకోవడం లేదు’ అని గంగూలీ పేర్కొన్నాడు.

Latest Updates