జరిగితే మినీ ఐపీఎల్ లేదా రద్దు!

న్యూఢిల్లీఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ పదమూడో ఎడిషన్‌‌ జరుగుతుందా?  కరోనా వైరస్ దృష్ట్యా ఈ నెల 29న షురూ కావాల్సిన లీగ్‌‌ను ఏప్రిల్‌‌ 15వ తేదీకి వాయిదా వేసినప్పటికీ అప్పుడైనా మొదలవుతుందా? ఎనిమిది జట్ల ఓనర్లతో బీసీసీఐ సమావేశం అయిన తర్వాత కూడా లీగ్‌‌ నిర్వహణపై స్పష్టత రావడం లేదు.  ఒకవేళ టోర్నీ జరిగితే.. లీగ్​ను కుదించడం తప్ప మరో మార్గం లేదని బోర్డు ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ చెప్పగా.. లీగ్‌‌ రద్దయినా చేసేదేమీ లేదని పంజాబ్‌‌ కో-–ఓనర్‌‌ నెస్‌‌ వాడియా హింట్ ఇచ్చాడు. దాంతో, ఎలాంటి పరిస్థితికైనా ఫ్రాంచైజీలు మానసికంగా సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది.  ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దాదా.. దేశంలో పరిస్థితులు మెరుగైతే మినీ ఐపీఎల్ జరిగే చాన్సుందని చెప్పాడు.

‘ఏప్రిల్‌‌ 15న లీగ్‌‌ మొదలైతే.. అప్పటికే 15 రోజులు నష్టపోతాం. అందువల్ల లీగ్‌‌ను కుదించాల్సిందే. అయితే, ఎలా కుదించాలి, ఎన్ని మ్యాచ్‌‌లు తగ్గించాలి అనే విషయంపై నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను’అని గంగూలీ తెలిపాడు. అదే సమయంలో  ప్రజలు, ఆటగాళ్ల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు. ప్రభుత్వ సూచనల మేరకు డొమెస్టిక్ క్రికెట్‌‌ మ్యాచ్‌‌లను కూడా వాయిదా వేశామని చెప్పాడు. పరిస్థితులను వారానికోసారి సమీక్షిస్తామన్నాడు. ‘ఐపీఎల్‌‌ టీమ్‌‌ ఓనర్లను కలిశాం. లీగ్‌‌ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో, ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో  వారికి వివరించాం. ప్రస్తుతానికైతే లీగ్‌‌ వాయిదా పడింది. ప్రతీ వారం పరిస్థితులను సమీక్షిస్తాం. ఐపీఎల్‌‌ నిర్వహించాలని మేం కోరుకున్నప్పుడు.. ప్రజల  భద్రత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని తెలిపాడు. ఏవైనా బ్యాకప్‌‌ ప్లాన్స్‌‌ ఉన్నాయా? అన్న ప్రశ్నకు.. ప్రస్తుతానికి తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నాడు. తమకు వారం రోజుల సమయం కావాలన్న దాదా  అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని చెప్పాడు.

మిగతా ఆప్షన్లూ తెరపైకి..

లీగ్‌‌ను కుదించడంతో పాటు మరిన్ని ఆప్షన్లపై ఫ్రాంచైజీలు చర్చించాయి. ఇందులో రెండోది.. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌‌లుగా విభజించి రౌండ్‌‌ రాబిన్‌‌, ప్లే ఆఫ్స్‌‌ నిర్వహించడం. రౌండ్‌‌ రాబిన్‌‌లో రెండు గ్రూప్‌‌ల నుంచి టాప్‌‌–2లో నిలిచే జట్లు ప్లే ఆఫ్స్​కు అర్హత సాధిస్తాయి. మూడో ఆప్షన్‌‌గా వీకెండ్స్‌‌లో వీలైనన్ని ఎక్కువ డబుల్‌‌ హెడర్స్‌‌ నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే, అన్ని మ్యాచ్‌‌లను కొన్ని వేదికల్లో నిర్వహించి కేవలం ప్లేయర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్, బ్రాడ్‌‌ కాస్టింగ్‌‌ సిబ్బందినే అనుమతించాలని చూస్తున్నారు. ఇక, ఖాళీ స్టేడియాల్లో 60 మ్యాచ్‌‌లను తక్కువ సమయంలోనే నిర్వహించి వాటాదారుల నష్టాలని తగ్గించాలన్న ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. కాగా, లీగ్‌‌ను విదేశాల్లో నిర్వహించాలన్న ప్రస్తావన రాలేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

డొమెస్టిక్ క్రికెట్​కూ బ్రేక్

కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన అన్ని డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌ టోర్నీలను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇందులో రంజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్‌‌ ఇండియా మధ్య జరగాల్సిన ఇరానీ కప్‌‌ కూడా ఉంది. ఇరానీ కప్‌‌, విజ్జీ ట్రోఫీ, సీనియర్‌‌ మహిళల వన్డే నాకౌట్‌‌ టోర్నీ, సీనియర్‌‌ మహిళల వన్డే చాలెంజర్‌‌ ట్రోఫీతో పాటు ఇతర టోర్నీలను వాయిదా వేస్తున్నట్టు బోర్డు సెక్రటరీ జై షా ప్రకటించారు. తదుపరి నోటీసులు ఇచ్చేవరకు జూనియర్‌‌ మహిళల టోర్నమెంట్లు అన్నింటినీ నిలిపి వేయాలని ఆదేశించారు. ఇందులో జూనియర్‌‌ మహిళల అండర్‌‌–19 వన్డే నాకౌట్‌‌, అండర్–19 టీ20 లీగ్‌‌, సూపర్‌‌ లీగ్‌‌ అండ్‌‌ నాకౌట్‌‌, అండర్‌‌–19 టీ20 చాలెంజర్‌‌ ట్రోఫీతో పాటు అండర్‌‌–23 నాకౌట్‌‌, అండర్‌‌–23 వన్డే చాలెంజర్‌‌ టోర్నీలు కూడా ఉన్నాయి.

ఏమీ చెప్పలేంనెస్‌‌ వాడియా

వాయిదా పడ్డ లీగ్.. మొదలవుతుందా? ఎలా జరుగుతుంది? అంటే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరూ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని మీటింగ్‌‌కు హాజరైన కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ కో-–ఓనర్‌‌ నెస్ వాడియా చెప్పారు. రెండు, మూడు వారాల తర్వాత పరిస్థితులను అంచనా వేస్తామని తెలిపారు. అప్పటికి వైరస్‌‌ వ్యాప్తి తగ్గిపోతుందని ఆశిస్తున్నామన్నాడు. లీగ్‌‌ వాయిదా వల్ల వచ్చే ఆర్థిక నష్టం గురించి ఆలోచించడం లేదని, ప్రజలు, ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని వాడియా స్పష్టం చేశారు. ‘బీసీసీఐ, ఐపీఎల్‌‌, స్టార్‌‌స్పోర్ట్స్‌‌ ఆర్థిక నష్టం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మనుషులే ముందు, తర్వాతే డబ్బు అని మీటింగ్‌‌లో అందరూ ఒప్పుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను మేం పాటిస్తాం. అయితే, లీగ్‌‌ విషయంలో ఈ నెలాఖరు వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని భావిస్తున్నా. అప్పటిదాకా మేం వేచి చూడాలి. పరిస్థితి మెరుగవ్వాలని ఆశించాలి.  లీగ్‌‌కు ఫారిన్‌‌ ప్లేయర్లు వస్తారో రారో  నేను చెప్పలేను. ఏప్రిల్‌‌ 15 వరకు  వీసాలపై నిషేధం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల  ఐపీఎల్‌‌ జరిగితే మంచిదే. జరగకపోయినా చేసేదేమీ లేదు’అని అభిప్రాయపడ్డాడు. అయితే, ఐపీఎల్‌‌ నిర్వహణ విషయంలో బీసీసీఐ త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ఓనర్‌‌ పార్థ్‌‌ జిందాల్‌‌ తెలిపారు. అప్పుడు మరిన్ని సాధ్యాసాధ్యాలపై చర్చిస్తుందని అన్నారు.

షోజరుగుతుందని ఆశిస్తున్నా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి… ఐపీఎల్‌‌ జరుగుతుందని ఆశిస్తున్నట్టు కోల్‌‌కతా నైట్‌‌ రైడ్సర్‌‌ కో-–ఓనర్, బాలీవుడ్‌‌ బాద్‌‌షా షారూక్‌‌ ఖాన్‌‌ తెలిపాడు. ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశానికి షారూక్‌‌ హాజరయ్యాడు. ‘అన్ని ఫ్రాంచైజీల ఓనర్లను ఇలా మైదానం బయట కులుసుకున్నందుకు ఆనందంగా ఉంది. అయితే, ప్రేక్షకులు, ప్లేయర్ల ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యమని చెప్పేందుకు బీసీసీఐ, ఐపీఎల్‌‌ ఈ భేటీని ఏర్పాటు చేశాయి. ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వం చేసే అన్ని సూచనలను మేం పాటిస్తాం. దేశంలో వైరస్ ప్రభావం తగ్గి, షో (ఐపీఎల్‌‌) కొనసాగుతుందని కోరుకుంటున్నా. బోర్డు, టీమ్‌‌ ఓనర్లు పరిస్థితులను గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లీగ్‌‌ విషయంలో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా అందరినీ కలుసుకోవడం సంతోషమే అయినా అందరం చేతులను తరచూ కడుక్కున్నాం’అని ట్వీట్‌‌ చేశాడు.

Latest Updates