ఐసీసీ చైర్మన్‌‌.. ఇప్పుడే కాదు!

న్యూఢిల్లీ: ఐసీసీ చైర్మన్‌‌ పదవి చేపట్టేందుకు తొందరేమీ లేదని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ అన్నాడు. ఇతరులతో పోలిస్తే తానింకా చిన్నవాడినేనని.. పెద్ద బాధ్యతలు చేపట్టేందుకు చాలా టైముందన్నాడు. ‘ఐసీసీ చైర్మన్ పదవి విషయం నా చేతుల్లో లేదు. ఎందుకంటే అది బీసీసీఐ బోర్డు సభ్యులంతా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. దీనికితోడు ఇప్పుడు ఐసీసీలో రూల్స్‌‌ కూడా మారిపోయాయి. ఇండిపెండెంట్ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి తన సొంత బోర్డులో పదవిని వదులుకోవాలి. కానీ బీసీసీఐలో ఈ విధానం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి బీసీసీఐలో రెండు పదవులు చేపట్టకూడదు. కానీ బీసీసీఐతోపాటు ఐసీసీ లేదా ఏసీసీలో పని చేయొచ్చు.

కరోనా దెబ్బకు ప్రపంచంతోపాటు బీసీసీఐ కూడా గడ్డు కాలంలో ఉంది. ఇలాంటి టైమ్లో బోర్డును విడిచిపెట్టి వెళ్లడం సరైంది కాదు. పైగా ఇతర పాలకులతో పోలిస్తే నేనింకా చాలా చిన్నోడిని. దీనికితోడు బీసీసీఐ బాస్ లాంటి పదవులు చాలా అరుదుగా దొరికే అవకాశాలు. అంత తేలికగా వదులుకోలేం’ అని దాదా పేర్కొన్నాడు. ఆసీస్‌‌ టూర్‌‌లో షార్ట్‌‌ క్వారంటైన్‌‌ తప్పదని సౌరవ్‌‌ తెలిపాడు. అయితే రెండు వారాల పాటు ప్లేయర్లను క్వారంటైన్‌‌కు పరిమితం చేయబోమని, కొన్ని రిలాక్సేషన్స్‌‌ ఇస్తామన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates