2 రోజుల ముందే జైషే వార్నింగ్ : నిఘా వైఫల్యం

జమ్ముకశ్మీర్.. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిని దేశం అంతా ఖండిస్తోంది. ఐతే.. ఈ ఉగ్రదాడి జరగడం వెనుక నిఘావైఫల్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. భారత సైన్యాన్ని దెబ్బతీస్తామని 2 రోజుల ముందే పాకిస్థాన్ సంబంధిత జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్ధ ఓ వీడియోను ఆన్ లైన్ లో విడుదల చేసింది. భారీ పేలుడు పదార్థాలతో… వాహన శ్రేణిని పేల్చబోతున్నట్టుగా బెదిరించి… ఆప్ఘనిస్థాన్ లో జరిగిన పేలుడు వీడియోను అందులో చూపించింది.

మంగళవారం రోజున వైరల్ అయిన ఈ వీడియోను జమ్ము కశ్మీర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) పోలీసులు గుర్తించారు. ఈ వీడియో గురించి ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇచ్చారు. ఐతే… ఎప్పుడు దాడి చేస్తామన్నదానిపై ఆ వీడియోలో సమాచారం ఇవ్వలేదు ఉగ్రవాదులు. దీంతో.. అవసమైన జాగ్రత్తలు సూచించడంలో నిఘా అధికారులు విఫలం అయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

గురువారం ఫిబ్రవరి 14 రోజున.. జమ్ము శ్రీనగర్ హైవేపై 79 వాహనాల కాన్వాయ్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తుండగా ఈ టెర్రర్ ఎటాక్ జరిగింది. 350 కేజీల పేలుడు పదార్థాలను .. ఓ స్కార్పియో వాహనంలో నింపుకుని… హైవేపై వెళ్తున్న వాహనాల కాన్వాయ్ లోకి దూసుకొచ్చాడు ఓ టెర్రరిస్ట్. ఓ వెహికల్ ను బలంగా ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మరో వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. వంద మీటర్ల పరిధిలో జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోవడం పేలుడు ఎంత బలంగా జరిగిందో తెలియజేస్తోంది. బ్లాస్ట్ జరిగిన వాహనం తునాతునకలు అయ్యింది.

Latest Updates