ముగ్గురు సేఫ్‌గా దిగారు

ఇంటర్నేషనల్‌‌ స్పేస్‌‌ స్టేషన్‌‌ (ఐఎస్‌‌ఎస్‌‌)లో సుమారు 200 రోజులు గడిపిన ముగ్గురు ఆస్ట్రొనాట్లు క్షేమంగా భూమిని చేరుకున్నారు. కజకిస్థాన్‌‌లోని స్టెప్పీ గడ్డి భూముల్లో మంగళవారం ఉదయం 8.47 గంటలకు (లోకల్‌‌ టైం) దిగారు. షెడ్యూల్‌‌ టైంకు ఒక నిమిషం ముందే రష్యా సోయజ్‌‌ ఎంఎస్‌‌ 11 క్యాప్సుల్‌‌లో భూమిని చేరుకున్నారు. వాళ్లను అక్కడి నుంచి హెలికాప్టర్‌‌లో కరగండ బేసిన్‌‌లోని కజక్‌‌ టౌన్‌‌కు తీసుకెళ్లారు. ఆస్ట్రోనాట్లు దిగుతున్నప్పటి లైవ్‌‌ వీడియోను నాసా విడుదల చేసింది.  అమెరికాకు చెందిన యానీ  మెక్‌‌క్లెయిన్‌‌, కెనడాకు చెందిన డేవిడ్‌‌ సెయింట్‌‌ జాక్వెస్‌‌, రష్యాకు చెందిన ఒలెగ్‌‌ కొనొనెన్కో రష్యా రాకెట్‌‌ ద్వారా డిసెంబర్‌‌ 3న స్పేస్‌‌ స్టేషన్‌‌కు బయలు దేరారు. 204 రోజులు అక్కడ గడిపారు. మంగళవారం సోయజ్‌‌ ఎంఎస్‌‌ 11 క్యాప్సుల్‌‌లో భూమ్మీద దిగారు. ల్యాండింగ్‌‌లో ఇబ్బంది లేకుండా పారాచూట్‌‌, థ్రస్టర్లు వాడారు. ఆస్ట్రొనాట్లు దిగగానే అప్పటికే ఆ ప్రాంతానికి వచ్చిన రష్యన్‌‌ ఆర్మీ, నాసా, కెనడా స్పేస్‌‌ ఏజెన్సీల మెడికల్‌‌ టీంలు వాళ్లకు సాయం చేశాయి. కొనొనెన్కోను క్యాప్సుల్‌‌ నుంచి బయటకు తీస్తున్నప్పుడు అలసిపోయి కనిపించారు. మెక్‌‌ క్లెయిన్‌‌, సెయింట్‌‌ జాక్వెస్‌‌ ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కసారిగా భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడంతో వారి శరీరంలో మార్పులేమైనా జరిగాయేమోనని డాక్టర్లు చెక్‌‌ చేశారు. ‘204 రోజుల తర్వాత మళ్లీ భూమి పైకి రావడం ఆనందంగా ఉంది’ అని కొనెనెన్కో అన్నారు. కొనొనెన్కో ఇప్పటివరకు 737 రోజులు స్పేస్‌‌లో ఉన్నారు. మెక్‌‌క్లెయిన్‌‌, జాక్వెస్‌‌కు ఇది తొలి అంతరిక్ష యాత్ర. కొనొనెన్కోకు నాలుగోది. ‘స్పేస్‌‌ స్టేషన్‌‌ నుంచి భూమిని చేరుకోడానికి 3.5 గంటలు పట్టింది. రోలర్‌‌ కోస్టర్‌‌లా, వాషింగ్‌‌ మెషీన్‌‌లా తిరుగుతూ భూమిపైకి చేరుకున్నాం’ అని మెక్‌‌క్లెయిన్‌‌ ట్విట్టర్‌‌లో పోస్టు చేశారు.     నాసా తొలిసారి స్పేస్‌‌ టూరిస్టులకు బంపర్‌‌ ఆఫర్‌‌ ప్రకటించింది. 30 రోజుల స్పేస్‌‌ స్టేషన్‌‌ టూర్‌‌కు తీసుకెళతామని ప్రకటించింది. వచ్చే ఏడాది స్పేస్‌‌ ఎక్స్‌‌, బోయింగ్‌‌తో కలిసి చేసే ఈ యాత్రకు  ఒక్కొక్కరికి రూ.400 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించింది. ఇప్పటివరకు ఏడుగురిని స్పేస్‌‌లోకి పంపిన రష్యా 2021లో ఆ సంఖ్యను పెంచాలనుకుంటోంది.

Latest Updates