కరోనాతో 21 ఏళ్ల యువకుడి మృతి.. బ్లడ్ కేన్సర్ పేషెంట్ కూడా

కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో దాదాపు 50, 60 ఏళ్లు పైబడిన వాళ్లే ఎక్కువ. కానీ తొలిసారి ఓ యువకుడు ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌కు చెందిన యువ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా (21 ఏళ్లు) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.

బ్లడ్ కేన్సర్.. నిమోనియా కూడా

స్పెయిన్‌లోని మలాగా‌లోని అట్లెటికో పోర్టడా అట్లా జూనియర్ ఫుట్ బాల్ టీమ్‌కు 2016 నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మలాగాలోని రీజనల్ హాస్పిటల్‌లో కరోనా లక్షణాలతో చేరాడు ఫ్రాన్సిస్కో. అతడికి టెస్టులు చేయగా… కరోనాతో పాటు నిమోనియో కూడా ఉందని తేలింది. అయితే ఆస్పత్రిలో చేరే వరకు అతడిలో మరో మహమ్మారి పెరుగుతున్న విషయం ఫ్రాన్సిస్కో‌కు తెలియదు. డాక్టర్లు టెస్టులు చేస్తుండగా.. బ్లడ్ కేన్సర్ (ల్యుకేమియా) ఉన్నట్లు బయటపడిందని తెలుస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకమైన తెల్ల రక్తకణాలకు సంబంధించిన కేన్సర్‌తో బాధపడుతున్న ఫ్రాన్సిస్కోకు అదే సమయంలో కరోనా రావడంతో అతడి శరీరం తట్టుకోలేకపోయింది. వేగంగా నియోనియా కూడా రావడం వల్ల యువకుడైనప్పటికీ కరోనా నుంచి కోలుకోలేక మరణించాడని వైద్యులు చెబుతున్నారు.

నీ కోసం గెలుస్తాం

ఫ్రాన్సిస్కో మరణానికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది అతడి వద్ద కోచింగ్ తీసుకుంటున్న ఫుట్ బాల్ టీమ్. అతడి కుటుంబానికి సానుభూతి తెలిపింది. ‘మీరు లేకుండా ఇప్పుడు మేమేం చేయాలి? రాబోయే లీగ్స్‌లో మేం ఎలా గెలవాలి? ఎలానో తెలియట్లేదు.. కానీ, మీ కోసం కచ్చితంగా గెలిచి చూపిస్తాం. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేం. రెస్ట్ ఇన్ పీస్’ అంటూ అట్లెటికో పోర్టడా అట్లా స్టేట్మెంట్ విడుదల చేసింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు 150కి పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో సుమారు 90 వేల మంది వైరస్ బారినపడగా.. 3200 మందిపైగా మరణించారు. ఆ తర్వాత ఇటలీలో 25 వేల మందికి కరోనా సోకగా.. 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక స్పెయిన్‌లో 10 వేల మంది వైరస్ బారినపడ్డారు. అందులో 309 మంది మరణించారు. భారత్‌లో 126 మంది కరోనా బారినపడగా.. ముగ్గురు మృతి చెందారు.

Latest Updates