కేసీఆర్​ గ్రామ సర్పంచా?

speaking-as-the-cm-kcr-village-sarpanch-giving-gifts-to-a-village-is-not-fair
  • ఒకే ఊరికి వరాలేంది? : మురళీధర్‌‌రావు

రాష్ట్రానికి, వేల గ్రామాల ప్రజలందరికీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్​.. గ్రామ సర్పంచ్​లాగా మాట్లాడడం, కానుకలు, వరాలు ఒక ఊరిని లక్ష్యంగా చేసుకుని ఇవ్వడం సరైంది కాదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌‌‌‌రావు తప్పుపట్టారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చింతమడక వరాలను బీజేపీ స్వాగతిస్తోందని, ఆ గ్రామస్తులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రం మొత్తం చింతమడక కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, అన్ని కుటుంబాలకు ఈ వరాలు వర్తించాలన్నారు. ఒక ఊరికే వరాలు ఇవ్వడం  ప్రజాస్వామ్యబద్ధం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్​ చట్టానికి భవిష్యత్తు లేదని, ఈ చట్టం నిలబడదని అభిప్రాయపడ్డారు.  ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్ల ప్రాతినిధ్యం రద్దు చేసే అధికారం కలెక్టర్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు.  నాటిన మొక్కల్లో 80శాతం బతకకపోతే పదవులు రద్దు చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలు రెండు కలిసిపోయాయని ఆరోపించారు. బీజేపీకి భవిష్యత్తు లేదంటూ ఆ పార్టీలు చెప్పడం మ్యాచ్‌‌‌‌ ఫిక్సింగ్​లో భాగమేనని ఆయన మండిపడ్డారు. కర్నాటక రాజకీయ సంక్షోభం మొత్తం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాల్​గా నిలుస్తోందని పేర్కొన్నారు.

Latest Updates