చదివింది పదోతరగతే..ఆర్గానిక్ ప్రొడక్ట్ లో దిట్ట

ఆరోగ్యం అందరికీ కావాలి. కానీ ఆరోగ్యాన్ని అందించేవి పండించడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. వచ్చినా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. మార్పు చాలామంది కోరుకుంటారు. ఆచరణలోకి రాగానే ‘మన వల్ల కాదులే’ అని తేలిగ్గా తీసుకుంటారు. మార్పు మనతో మొదలుకావాలన్న పట్టుదలతో పొలంలో అడుగుపెట్టిందామె. సొంతంగా ఎరువులు తయారుచేసుకుంటూ వందశాతం ఆర్గానిక్​ పంటలను పండిస్తున్నారు. ‘చరక అమృత్’ పేరుతో ఆర్గానిక్​ ప్రొడక్ట్స్​ను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఆమె పేరు ఉడుముల లావణ్యారెడ్డి.

మంజీరా తీరంలో సేంద్రియ సిరులు

సంగారెడ్డి… జోగిపేట ఆందోల్​లో మెయిన్​రోడ్డు పక్కన ‘చరక అమృత్’ ఫామ్​ ఉంది. మొత్తం ఇరవై ఐదు ఏకరాలు. రైతులు, కూలీలు ఏదో ఒక ప్రయోగం చేస్తూ కనిపిస్తారు అక్కడ. మూడు వందలకుపైగా గిర్​జాతి ఆవులు ఉన్నాయి. అక్కడ వరి మొదలుకొని అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్​, అగ్రికల్చర్​ సైంటిస్టులు కూడా ఆ ఫామ్​ను చూసేందుకు వస్తున్నారు. అక్కడ జరిగే ప్రయోగాల గురించి తెలుసుకుంటున్నారు. అందుకు కారణం అక్కడ సాగయ్యే ఆర్గానిక్​ పంటలు. సొంతంగా ఎరువులు తయారుచేసుకుంటూ, రకరకాల పద్ధతుల్లో ఆర్గానిక్​ పంటలు పండిస్తున్నారు. ‘పంచగవ్య, దశగవ్య, జీవామృతం, కషాయాలు’ లాంటి నేచురల్​ ఫెర్టిలైజర్స్​తో వ్యవసాయం చేస్తూ, ఆ పద్ధతులను గ్రామీణ రైతులకూ పరిచయం చేస్తున్నారు.  జైశ్రీరాం వరి, నువ్వులు, మిర్చి.. ఆకుకూరలు, కూరగాయలు ఇలా అనేక పంటలు సాగు చేస్తున్నారు.

టెన్త్​క్లాస్​ చదివి..

లావణ్యారెడ్డిది కరీంనగర్​లోని బొమ్మకల్లు. తండ్రి చిరువ్యాపారి. ఒకవైపుచదువుకుంటూనే తండ్రికి సాయపడేది. టెన్త్ చదివిన ఆమెకు చిన్నవయసులోనే పెళ్లి అయ్యింది. భర్త అనారోగ్యం, కుటుంబ సమస్యల కారణంగా కొన్నాళ్లకే ఒంటరయ్యింది. బిడ్డ కష్టాన్ని చూడలేక తండ్రి ఆమెను హాస్టల్​లో పెట్టాడు. చిన్నప్పట్నించీ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వడం లావణ్యరెడ్డికి అలవాటు. హాస్టల్​లో ఉంటూనే రకరకాల వంటలు చేయడం నేర్చుకున్నారు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలనుకున్నారు. తండ్రి సాయంతో హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో హాస్టల్​ను ప్రారంభించారు. ఎనిమిదేళ్లలో మూడు హాస్టల్స్​ను నడిపి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్​కు చెందిన సూర్యనారాయణరెడ్డితో పెళ్లయ్యింది. సూర్యనారాయణరెడ్డికి బీబీనగర్​లో ఒక డెయిరీ ఫామ్​ ఉంది. ఆయనకు తోడుగా ఉంటూనే, ఆ ఫామ్​ బాధ్యతలు చూసుకునేవారు లావణ్య.

దేశీయ​ ఆవులతో గోశాల

వ్యాపారం అంటే కేవలం లాభాలే కాదు.. సొసైటీ అంటే కాస్త సోయి ఉండాలన్నది లావణ్యారెడ్డి ఆలోచన. హైదరాబాద్​లో ఎక్కడా స్వచ్చమైన పాలు దొరక్కపోవడం, ఏ వీధికెళ్లినా కల్తీ పాలే ఉండటం.. లావణ్యారెడ్డిని గోశాలను ఏర్పాటు చేసేలా చేశాయి. భర్తతో కలిసి గుజరాత్​కు వెళ్లి ఇరవై దేశీయ ఆవులతో గోశాలను ఏర్పాటు చేశారు. కేవలం పశుపోషణ కోసమే ప్రత్యేకంగా మనుషులను పెట్టారు. మొదట కుటుంబ సభ్యులకు, బంధువులకు ఆ పాలను అందించారు. దాంతో చాలామంది పాలను అడగడం మొదలుపెట్టారు. మరికొన్ని దేశీయ ఆవులను తెప్పించి ‘చరక డెయిరీ’ పేరుతో ఆ పాలను మార్కెట్​కు తరలించింది. స్వచ్ఛమైన పాలు అందించడంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. 2014 జీహెచ్​ఎంసీ స్టడీలోనూ ‘చరక డైయిరీ’ పాలు చాలా ప్యూర్​ అని తేలింది. అలా కొన్నాళ్లు పాల వ్యాపారం చేశారు.

ఆర్గానిక్​ సాగులోకి…

ఒకరోజు వంటకోసం ఆకుకూరలను కట్​ చేసేటప్పుడు, ఆకంతా పురుగుపట్టి నల్లగా కనిపించింది. శుచీ శుభ్రత లేని కూరగాయలు, కల్తీ తిండి అంత మంచిది కాదని భావించారు. దీనికి పరిష్కారం ‘నేచురల్​ అగ్రికల్చర్’​  అనుకున్నారామె. గతంలో వ్యవసాయం చేసిన అనుభవం ఉంది. ‘‘ఒకవైపు మంజీరా నది, మరోవైపు సాగుకు అనుకూలమైన భూమి దొరకడంతో సంగారెడ్డిలోనే వ్యవసాయం చేయాలనుకున్నాం. భూమిని సారవంతం చేసేందుకు వేప, ఆముదం పిండి వేసి సాగులోకి తెచ్చాం. జీలుగ, పచ్చిరొట్టలను కూడా వాడాం. దశగవ్య (పాలు, పెరుగు, నెయ్యి, అరటిపండు మొదలైనవి) నేచురల్​ ఎరువును చల్లాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయ భూమిని సారవంతం చేశాం. ఎక్కువ దిగుబడులు సాధించాం” అని చెప్పారామె.

చరక పేరుతో..

దేశీయ పశు సంపద ఆర్గానిక్​ సాగుకు వెన్నెముక లాంటిది. దేశీయ ఆవుల మూత్రం, పేడ వ్యవసాయ భూములను సారవంతం చేస్తుంది. అందుకే లావణ్యారెడ్డి డెయిరీ ఫామ్​ను విడిచిపెట్టినా..దేశీ ఆవులను సాకడం మానలేదు. అందోల్​లో వాటికోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు కట్టించారు. వాటి పోషణను స్వయంగా చూసుకుంటారు. వాటి నుంచే వచ్చే ఉత్పత్తులు కూడా పొలానికే వాడతారు. ఎన్నో రకాల కూరగాయలు, ఆకుకూరలు, వరి పండిస్తున్న లావణ్యారెడ్డి వాటితో సొమ్ము చేసుకోవడానికి ఇష్టపడరు. ఆర్గానిక్​ పంటలు పండిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో రైతులకు వివరించి చెప్తున్నారు. అలా ఆర్గానిక్​ పద్ధతులను ఇతరులకు పరిచయం చేస్తున్నారు. ఫామ్​లో పండే కూరగాయలు ఉచితంగా పంచి పెడతారు. పాలు, పెరుగు, నెయ్యి, బియ్యం లాంటి ఆర్గానిక్​ ప్రొడక్ట్స్​ మాత్రం ‘చరక అమృత్​’ పేరుతో అమ్ముతున్నారు. ఆమె కృషికిగాను ‘చెన్నై గ్లోబల్​ హ్యూమన్​ పీస్’ ​వాళ్లు ఈ మధ్యనే‘అగ్రికల్చర్​ డాక్టరేట్’​ ఇచ్చి సత్కరించారు. ముందు
ముందు ఆ ఫామ్​ను తెలంగాణలోనే ఒక మోడల్​ ఫామ్​గా​ మార్చి, ప్రతి రైతునూ ఆర్గానిక్​ ఫార్మర్​గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటున్నారు లావణ్యారెడ్డి.

Latest Updates