బంధం మొలకెత్తిద్దాం!

రేపు రాఖీల పండుగ. అదొక్కటేనా, రేపే స్వాతంత్య్ర దినోత్సవం కూడా! రెండు పండుగలూ సెంటిమెంట్‌‌కి సంబంధించినవే. రెండింటి గురించి చెప్పుకున్నప్పుడల్లా లెక్కలేనన్ని కథలు.

ఆ ప్రేమని, మన ఇష్టాన్ని ఈ ఒక్కరోజుకి చూపించుకుంటే సరిపోతుందా? మరేం చేద్దాం, ఒక ఆలోచన ఉంది. ఇవ్వాళ కట్టుకున్న రాఖీ.. రేపటికి ఒక చెట్టు అయితే? ఇవ్వాళ ఎగరేసిన జెండా రేపూ అలాగే నిలబడాలంటే? ‘సీడ్‌‌ రాఖీ.. సీడ్‌‌ ఫ్లాగ్‌‌..’ ఇదే ఆ ఆలోచన.మొత్తం కథేందో చూద్దాం..

తోడబుట్టిన రక్తసంబంధాల మధ్య ప్రేమకు ప్రతీక రాఖీ.

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు తమ బంధం కలకాలం బలంగా, పచ్చగా ఉండాలని కోరుకుని కట్టుకునే రక్షా బంధనం. అంతటి ప్రేమాభిమానాలతో పెళ్లైన ఆడబిడ్డలు అత్తవారింటి నుంచి వచ్చి మరీ చేతికి రాఖీ కట్టి, నోరు తీపి చేసి బంధాన్ని గుర్తు చేస్తారు. అలాంటి రాఖీ.. పండుగ అయిపోయిన తర్వాతో, చేతికి కట్టిన ముడి ఊడిపోతేనో.. డస్ట్​బిన్​లోకి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి నేరుగా చెత్తకుండీలోకే. చేతికి కట్టిన రాఖీ ఊడిపోతే.. బంధానికి పెద్దగా నష్టం ఏం లేదు. కానీ.. ప్లాస్టిక్​తో తయారుచేసిన ఆ రాఖీలు భూమిలో కలిసిపోతాయా? పర్యావరణానికి కీడు చేయకుండా ఉంటాయా? బలమైన బంధాన్ని కోరుకుంటూ.. కట్టిన రాఖీ ప్రకృతి నుంచి మన బంధాన్ని వేరు చేయడం సబబేనా?

ప్రేమానురాగాల మొలకలు

‘అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను, అనుబంధాన్ని ఇప్పటి నుంచి ప్రకృతితో కలిపి ముడివేద్దాం’ అనే ఆలోచనతో విత్తన రాఖీలు పుట్టుకొచ్చాయి. ఆర్గానిక్‌‌ రాఖీలు తయారుచేస్తూ.. ఎన్జీవోలు, పర్యావరణ ప్రేమికులు ఈ ఆలోచనను ముందుకు తీసుకుపోతున్నారు. రకరకాల వెరైటీల్లో తయారుచేసిన రాఖీల్లో  రకరకాల విత్తనాలు ఉంచి డిజైన్​ చేస్తున్నారు. హైదరాబాద్​లో ‘సహజ కళ’ పేరుతో ఈ విత్తన రాఖీలు తయారుచేసి ‘అనుబంధాలకు గుర్తుగా భూమిలో ప్రేమానురాగాలను మొలకెత్తిద్దాం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు, అర్బన్​ ఫార్మింగ్​ అభిమానుల నుంచి ఇప్పటికే విత్తన రాఖీలకు విపరీతమైన స్పందన వస్తోంది. సామాన్యులు కూడా విత్తన రాఖీల పట్ల ఆసక్తి చూపిస్తూ.. ఆర్డర్లు ఇస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయమని రైతులను ప్రోత్సహిస్తున్న ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ రకరకాల పద్ధతులు, మార్గాల ద్వారా రైతులకు, ప్రజలకు పలు విత్తనాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఈ రాఖీ పండుగ సందర్భంగా రాఖీల ద్వారా విత్తనాలు పంచుతోంది. కేవలం విత్తనాలు పంచడమే కాదు, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.- ప్రవీణ్​కుమార్​ సుంకరి

భావాలు చిగురించాలి

జెండా వందనం రోజు సగర్వంగా ఎగరేసే జాతీయ జెండాకు కూడా విత్తనాలతో లింక్‌‌ చేశారు. ‘సీడ్​ పేపర్​ ఇండియా’ ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రోషన్​ రాయ్​.. ఈ ఆలోచనకు రూపకర్త. మనదేశంలో యాభై వేల టన్నుల ప్లాస్టిక్​ పతాకాలు ప్రతీ ఏడాది చెత్తకుప్పలో చేరుతున్నాయి. అందుకే.. రోషన్​ రాయ్​ ‘సీడ్​ పేపర్’​ పేరుతో ఓ సంస్థను ప్రారంభించి టొమాటో, తులసి విత్తనాలతో తయారుచేసిన పేపర్​తో జాతీయ పతాక బ్యాడ్జీలను రూపొందిస్తున్నాడు. జెండావిష్కరణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ జాతీయ పతాకాన్ని జాగ్రత్తగా మట్టిలో, పూలకుండీలో పాతిపెడితే చాలు.. తులసి, టొమాటో మొక్కలు మొలకెత్తుతాయి. అటు జెండాకు గౌరవం దక్కుతుంది. దేశభక్తి అనే భావం మొక్క రూపంలో చిగురించి ప్రకృతికి తోడుంటుంది.

ఈ మొక్క చిగురించడానికి మీరు చేయాల్సిన పని చాలా సింపుల్​..

  1. మీరు ధరించిన విత్తన పేపర్​ బ్యాడ్జీని ఒక కుండీలో పెట్టి పొరలు పొరలుగా మట్టి కప్పాలి.
  2. ప్రతిరోజూ ఓ మోతాదులో ఆ మట్టిలో నీళ్లు చల్లాలి. ఎక్కువ పోయకూడదు.
  3. కొన్నిరోజులకు మొలక బయటకొస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే.. మొక్క అవుతుంది. ‘ఆ మొక్క చూడగానే ఓసారి అద్దంలో మీ మొహం చూసుకోండి! ఆనందం, గర్వం తొణికిసలాడుతుంది’ అంటున్నాడు సీడ్​ పేపర్​ ఆలోచనకర్త రోషన్​ రాయ్​.

ప్రకృతితో మమేకమయ్యేలా..

రక్షాబంధన్​ వేడుకల సందర్భంగా అక్కలు, చెల్లెళ్లు తమ అన్నలకు, తమ్ముళ్లకు కట్టేందుకు విత్తన రాఖీలు అందించాలని సంకల్పించాం. చేతికి కట్టిన రాఖీలు కొన్నిరోజుల తర్వాత తీసి మట్టిలో పాతమని కొన్నవారికి సూచిస్తున్నాం. సుస్థిర వ్యవసాయ కేంద్రం అనుబంధంగా ‘సహజ కళ’ పేరుతో ‘బీజ్​ బంధన్​’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందుకోసం 20 రకాల విత్తనాలు వినియోగిస్తున్నాం. అందులో భాగంగా జొన్నలు, రాగులు, వడ్లు, కాకర, బీర, సొరకాయ, క్యారెట్​, దోస, చిక్కుడు, మునగ, గోధుమ, గుమ్మడి, బెండ, పెసర్లు, అలసందలు, గోరుచిక్కుడు, పొప్పడి వంటి విత్తనాలతో ఈ రాఖీలు తయారుచేశాం. ఇంట్లో, ఇంటి పెరట్లో పెంచుకోవడానికి అనువైన మొక్కల విత్తనాలనే రాఖీల్లో వాడాం. ధర యాభై రూపాయల నుంచి వంద రూపాయలుగా నిర్ణయించాం. డబ్బులు సంపాదించడం కాకుండా మన వల్ల పాడైన, మనం పోగొట్టుకున్న ప్రకృతిని, ప్రకృతి సంపదను తిరిగి సంపాదించుకోవడం అనే మార్గాల్లో ఒకటిగా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాం. కిందిస్థాయిలో ఈ ప్రచారం జరిగితే ఈ రాఖీలకు మంచి డిమాండ్‌‌ వస్తుందని అనుకుంటున్నాం.    – వంగపల్లి పద్మ, సహజ కళ నిర్వాహకురాలు  

Latest Updates