గాతా రహే.. హమారా దిల్ !

 

ఒక స్వరం… జోల పాడింది.

ఒక స్వరం… స్నేహం పంచింది. 

ఒక స్వరం… ప్రేమను పెంచింది.

ఒక స్వరం… బాధను తుంచింది.

ఆ స్వరం మూగబోయి చాలా యేళ్లయింది.

దాని తాలూకు ప్రతిధ్వని నేటికీ వినిపిస్తూనే ఉంది.

ప్రతి గుండెనీ తట్టి లేపుతూనే ఉంది. రాగాల ఝరిలో ముంచి తేల్చుతూనే ఉంది. ఆ స్వరం కిశోర్‌‌ కుమార్‌‌ది.

నేడు కిశోర్​ కుమార్ 90వ జయంతి

ప్రపంచమెరిగిన ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ తెలియని అతి కొద్దిమందికి ఆయనను పరిచయం చేయకపోతే పొరపాటు అవుతుంది. అందుకే ఈ ప్రయత్నం. ఆయనకోసం ఈ అక్షర హారం.

ఒక గాయకుడు తన జీవితంలో చాలా పాటలు పాడతాడు. కానీ పాడిన ప్రతి పాటనీ శ్రోతల గుండెల్లోకి తీసుకెళ్లలేడు. అలా ఎవరైనా తీసుకెళ్లగలిగారు అంటే అది ఒకే ఒక్క వ్యక్తి… కిశోర్‌‌ కుమార్. టీజింగ్, రొమాంటిక్,

ప్యాథటిక్… జానర్‌‌ ఏదైనా సరే. ఆయన గళం నుంచి జాలువారే క్రమంలో ఆ పాట కొత్త సొగసులు అద్దుకునేది. సూటిగా మనసుల్లోకి జొరబడి అక్కడే తిష్ట వేసేది. అందుకే ఆయన్ని బాలీవుడ్‌ నెత్తిన పెట్టుకుంది. ‘కింగ్‌ ఆఫ్‌ మెలొడీ’ అంటూ దేశమంతా గుండెల్లో నిలుపుకుంది.

రొమాంటిక్ రారాజు

దిల్ క్యా కరే జబ్‌ కిసీసే కిసీకో ప్యార్‌‌ హోజాయే (జూలీ)… అవును. ప్రేమ పురుగు లోపలికి జొరబడ్డాక మనసు మాత్రం ఏం చేస్తుంది! ప్రేమ ఎంత గొప్ప అనుభూతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ అనుభూతిని తన పాటతోనే రుచి చూపించారు కిశోర్ కుమార్. రొమాంటిక్ పాటలు పాడటంలో ఆయనకి ఆయనే సాటి. పల్‌ పల్‌ దిల్‌కే పాస్ (బ్లాక్‌ మెయిల్), హమే తుమ్‌సే ప్యార్‌‌ కిత్‌నా (కుద్‌రత్), మేరే సప్‌నోంకీ రాణీ కబ్‌ ఆయేగీ (ఆరాధన), నీలే నీలే అంబర్‌‌ పర్ చాంద్ జబ్‌ ఆయే (కళాకార్), ఓ మేరే… దిల్‌కే చేన్ (మేరే జీవన్ సాథీ), యే షామ్‌ మస్తానీ (కటీ పతంగ్), ఆనేవాలా పల్ జానేవాలా హై (గోల్‌మాల్‌), కభీ కభీ మేరే దిల్‌ మే (కభీ కభీ)… ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి! ఆయన పాటల్లో ప్రేమ పొంగి పొరలేది. ఆయన తన స్వరం నుంచి  ప్రేమభావాన్ని ఒలికించిన తీరుకి శ్రోతల మనసు పులకరించేది.

వాయిస్ ఆఫ్ పెయిన్

మేరే నసీబ్‌మే ఏ దోస్త్.. తేరా ప్యార్‌‌ నహీ (దో రాస్తే) అంటూ ఓ ప్రేమికుడు పాడుతుంటే… అతని వేదనను అందరూ అనుభవించారు. కోయీ హోతా జిస్‌కో అప్‌నా హమ్‌ అప్‌నా కెహ్‌లేతే యారో (మేరే అప్నే) అంటూ వేదన చెందుతుంటే… ఆ ఒంటరితనాన్ని చూసి జాలిపడ్డారు.  ఓ సాథీరే.. తేరే బినా భీ క్యా జీనా (ముకద్దర్‌‌ కా సికిందర్) అంటూ తపన పడుతుంటే… ఆ ప్రేమికులు మళ్లీ కలవాలంటూ ఆరాటపడ్డారు. ఇవి కేవలం సినిమా పాటలు. వాటిలో కనిపించినవి కల్పిత పాత్రలు. కానీ ప్రేక్షకులు అలా అనుకోలేదు. ఆవేదనతో నిండిన ఆ ఆలాపనకి కదిలిపోయారు. ఆ బాధను తమకి ఓన్ చేసుకుని కరిగి నీరయ్యారు. కేవలం తన స్వరంతో అంత మాయ చేయగలరు కిశోర్. ఆయన వాయిస్‌లోనే ఒక పెయిన్ ఉండేది. శాడ్‌ సాంగ్స్‌‌కి అది మరింత డెప్త్‌‌ తీసుకొచ్చేది. అందుకే అవి అంతగా గుండెల్ని మెలిపెట్టేవి. బడీ సూని సూని హై (మిలీ), మేరీ భీగీ భీగీ సీ (అనామికా), దు:ఖీ మన్‌‌ మేరే (ఫన్‌‌టూష్‌‌), జిందగీకే సఫర్‌‌‌‌ మే గుజర్‌‌‌‌ జాతే హై (ఆప్‌‌కీ కసమ్), దిల్‌‌ ఆజ్‌‌ షాయర్‌‌‌‌ హై ఘమ్ ఆజ్‌‌ నగ్‌‌మా హై (గ్యాంబ్లర్‌‌‌‌), ఘుంగ్‌‌రూకీ తర్హా బజ్‌‌తాహీ రహాహూ మై (చోర్ మచాయే షోర్), దిల్‌‌ ఐసా కిసీనే మేరా తోడా (అమానుష్), ఫిజాకె ఫూల్‌‌పే ఆతీ కభీ బహార్‌‌‌‌ నహీ (దో రాస్తే), మేరే నైనా సావన్‌‌ భాదో (మెహబూబా), మేరా జీవన్ కోరా కాగజ్‌‌ (కోరా కాగజ్), మంజిలే అప్‌‌నీ జగా (షరాబీ), హమ్‌‌ బేవఫా (షాలిమర్‌‌‌‌)… వీటిని ఏ సంగీత ప్రియుడైనా మర్చిపోగలడా! వాటిని పాడిన కిశోర్‌‌‌‌ని స్మరించుకోకుండా ఉండగలడా!

అలుపెరుగని ప్రయాణం

ఒక వ్యక్తికి ఒక విషయంలో ప్రావీణ్యం ఉండటం మామూలే. కానీ కిశోర్‌‌ కుమార్‌‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా విషయాల్లో ప్రావీణ్యం ఉందాయనకి. సింగర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, డైరెక్టర్.. ఆయనకి తెలియనిదంటూ లేదు. అధికార్, చప్‌రే చాప్, న్యూ ఢిల్లీ, భాగంభాగ్ , మిస్‌ మాల, నౌకరీ, ముసాఫిర్, మిస్ మేరీ (తెలుగులో మిస్సమ్మ. ఏఎన్నార్ రోల్​ని కిశోర్ చేశారు), చల్తీకా నామ్ గాడీ వంటి ఎనభైకి పైగా చిత్రాలు ఆయనలోని నటుణ్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ‘జిద్దీ’లో దేవానంద్‌కి డబ్బింగ్ చెప్పారు. ‘ఝుమ్రూ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు, పాటలు రాశారు. ఆయన కంపోజ్ చేసిన పాటల్లో కోయీ హమ్‌దమ్ న రహా, బేకార్ దిల్ తూ గాయే జా వంటి పాటలు చాలా ఫేమస్. ‘కిశోర్‌‌ ఫిల్మ్స్‌’ బ్యానర్‌‌ను స్థాపించి  దూర్‌‌ కా రాస్తా, జమీన్‌ ఆస్‌మా, చల్తీ కా నామ్ జిందగీ వంటి పలు చిత్రాలు నిర్మించారు, దర్శకత్వం వహించారు.

ముళ్లపై నడిచినా…

‘రుక్‌జానా నహీ తూ కహీ హార్‌‌కే… కాంటోంపే చల్‌కే మిలేంగే సాయే బహార్‌‌కే’ అంటూ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా ఓడిపోవద్దని ఓ సినిమాలో పాడారు కిశోర్. ఆ పాట ఆయన జీవితానికి అచ్చంగా సరిపోతుంది. ఆయన ఎన్నోసార్లు పడ్డారు, లేచారు, మళ్లీ పడ్డారు, మళ్లీ లేచారు. మొదటి భార్య రుమా ఉండగానే తన కలల రాణి మధుబాలకు దగ్గరయ్యారు కిశోర్. రుమాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెని పెళ్లాడారు. తన మతాన్ని సైతం మార్చుకుని కరీమ్ అబ్దుల్ అయ్యారు.  మధుబాల అనారోగ్యంతో మరణించాక యోగితాబాలిని చేసుకున్నారు. ఆమెతో విడిపోయిన కొన్నాళ్లకే లీనా చందావర్కర్‌‌ను పెళ్లాడారు. ప్రేమ కోసం పరితపించానని ఆయన అన్నారు. కానీ అందరూ ఆయన వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపారు. ఎన్నో కువిమర్శలు. ఎమర్జెన్సీ రోజుల్లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించడంతో ఎమర్జెన్సీ అయ్యేవరకూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ కిశోర్ పాటల్ని బ్యాన్ చేసింది. ఒక సమయంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ దాడులు టెన్షన్ పెట్టాయి. కొందరు హీరోలతో తలెత్తిన వివాదాలు విమర్శలపాలు చేశాయి. ఇవన్నీ ఓ పక్క. వ్యక్తిగతం జీవితంలోని ఒడిదుడుకులు మరోపక్క. చాలా సమయాల్లో చిక్కులు చుట్టుముట్టాయి. కానీ ఏవీ ఆయన్ని చలింపజేయలేదు. మనసులో వేదనకి గాంభీర్యం అనే ముసుగు వేశారు. కళలో మునిగి తేలుతూ కంటి చెమ్మను దాచేసేవారు. ఈ విషయం ఆయనతో అతి సన్నిహితంగా మెలిగినవారికి తెలుసు. అందుకే కిశోర్‌‌ మంచి కళాకారుడే కాదు, మంచి వ్యక్తి కూడానని బల్లగుద్ది చెబుతారు వాళ్లు.

అల్విదా కెహ్‌దియా

‘కభీ అల్విదా న కెహ్‌నా’ అంటూ పాడిన కిశోర్ ఉన్నట్టుండి అల్విదా చెప్పి వెళ్లిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. అది 1987, అక్టోబర్ 13.  దీపావళి కావడంతో ఊరంతా దీపాలతో వెలుగుతోంది. కానీ అదే రోజు కిశోర్ ప్రాణదీపం ఆరిపోయింది. దేశం మొత్తానికీ గుండె ఆగినంత పనయ్యింది. ఆ స్వరం ఇక వినిపించదన్న నిజాన్ని అంగీకరించడం కష్టమయ్యింది. అందుకేనేమో, నేటికీ ఆయన పాట మారుమోగుతోంది. కిశోర్ కోరుకున్నదీ అదే. ‘చల్‌తే చల్‌తే… మేరే యే గీత్ యాద్‌ రఖ్‌నా’ అన్నారుగా. కిశోర్‌‌ దా… హమ్‌నే యాద్‌ రఖ్‌దియా. ఔర్ హమేశా యాద్‌ రఖేంగే. మీ పాటల్నే కాదు… మిమ్మల్ని కూడా!

  • సింగర్‌‌గా కిశోర్‌‌ కుమార్‌‌ది తిరుగులేని రికార్డు. . హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషల్లో పాటలు పాడారు. అనేక భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్​కీ పాడారు. బెంగాలీ ఆల్బమ్స్‌ చేశారు.
  • 110 మంది సంగీత దర్శకులతో కలిసి పని చేశారు. 2678 పాటలు పాడారు. ఎక్కువ పాటలు పాడింది ఆర్‌‌డీ బర్మన్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో. ఆయనతో కలిసి ఎక్కువ పాటలు పాడిన కో సింగర్ ఆశా భోంస్లే.ఆయన పాడిన పాటల్లో ఎక్కువ శాతం నటించిన హీరో రాజేష్‌ ఖన్నా.
  • మేల్‌‌ సింగర్‌‌‌‌ కేటగిరీలో ఎనిమిది ఫిల్మ్‌‌ఫేర్ అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. లతా మంగేష్కర్‌‌‌‌ అవార్డునూ అందుకున్నారు.
  • 1997లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన పేరిట ‘కిశోర్‌‌ కుమార్ పురస్కారం’ను నెలకొల్పింది. ఆయన గుర్తుగా ఖండ్వా ప్రాంతంలో ఓ పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. అక్కడే ఓ మినీ థియేటర్‌‌ను, మ్యూజియమ్‌ను ఏర్పాటు చేసి ఆయనకు డెడికేట్ చేసింది.
  • 2012లో ఢిల్లీలో జరిగిన ఓషియన్ సినీ ఫ్యాన్ ఆక్షన్‌లో.. విడుదల కాకుండా మిగిలిపోయిన కిశోర్ కుమార్ చివరి పాటను వేలం వేస్తే 15.6 లక్షలకు అమ్ముడుపోయింది.

కిశోర్‌‌ కుమార్‌‌ ఒంటరిగా ఉండటానికి చాలా ఇష్టపడేవారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకి స్నేహితులెవరూ లేరని చెప్పారు. మరో సందర్భంలో ఒక రిపోర్టర్‌‌… మీరు అంతంతసేపు ఒంటరిగా ఎలా ఉంటారు అని అడిగితే అతణ్ని ఆయన తన గార్డెన్‌లోకి తీసు కెళ్లారట. కొన్ని చెట్లకు తాను పెట్టు కున్న పేర్లు చెప్పి, అవన్నీ తన క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేశారట.

డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తారని కిశోర్‌‌దాకి పేరుండేది. ఎవరైనా సమయానికి ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోతే తనదైన శైలిలో వారిని ఇబ్బంది పెట్టేవారట. ఓసారి షూటింగ్ లొకేషన్‌కి సగం మేకప్‌తో వచ్చారట కిశోర్. అదేంటని డైరెక్టర్ అడిగితే.. ‘సగం డబ్బులిచ్చారు కనుక సగమే మేకప్, పూర్తిగా ఇస్తే ఫుల్‌గా వేసుకొస్తా’ అన్నారట. అయితే నిజంగా ఇవ్వలేరని తెలిసినవారి కోసం డబ్బులు తీసుకోకుండానే పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రారంభం నుంచి తనను వెన్నుతట్టి, ప్రోత్సహించి, వెనక నిలబడిన కొందరికి ఎవరికీ తెలియకుండా చాలా సహాయాలు చేశారట.

ఎవరైనా తనను విసిగిస్తే వారిని తిరిగి విసిగించడంలో కిశోర్​ దిట్ట అని చెబుతుంటారు బాలీవుడ్ వారు. కిశోర్‌‌ దర్శకుల మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ నిర్మాత  కోర్టుకెళ్లాడట. దానికి కోపగించిన కిశోర్ చేసిన పని వింటే పొట్ట చెక్కలవుతుంది. ముంబైలో కార్ సీన్‌ షూట్ చేస్తుంటే.. కిశోర్​దా కారులో ఖండాలా వరకూ వెళ్లిపోయారట. ఎందుకలా చేశావని నిర్మాత అడిగితే… ‘డైరెక్టర్ కట్ చెప్పలేదు. ఆయన చెప్పిందే చేయాలి, చెప్పనిది చేయకూడదు కదా’ అన్నారట.

Latest Updates