తెలంగాణ యాస కాళోజీ శ్వాస

50 ఏండ్ల నుంచి ఒంటి ఊపిరి మనిషి అని, క్షయ వ్యాధి ఉండటంతో ఎక్కువగా మాట్లాడితే ఆరు నెలల్లోనే చనిపోతావని డాక్టర్లు చెబితే.. ‘‘మాట్లాడకుండుంటే ఇప్పుడే చచ్చిపోతా” అని చెప్పిన పీడితుల పక్షపాతి కాళోజీ .

తెెలంగాణ భాషంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. “అంత అగ్వకున్నదా తెలంగాణ భాష? ఇగ సహించవద్దు. నేను గిట్లనే మాట్లాడ్త, గిట్లనే రాస్త. మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ సంస్కృతున్నది, ఈ యాసలున్న పల్కుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నది” అంటూ నినదించిన కవి మన కాళోజీ నారాయణరావు, తెలంగాణ గాంధీ. పోరాటమే శ్వాసగా జీవించిన వ్యక్తి. ‘‘నేను నేటి ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని” అని చెప్పుకున్న నిజమైన ప్రజాకవి. సమాజం పట్ల కవి బాధ్యతను తెలియజేయడం కోసం సులభంగా, సరళంగా సజీవమైన ప్రాంతీయ భాషలో, చక్కని నుడికారాలతో, కొత్త పదాలతో, చమత్కారం, ఉద్రేకంతోపాటు సమాజాన్ని మందలించే ధోరణితో.. పామరులకు సైతం అర్థమయ్యేట్టుగా ఉంటుంది కాళోజీ కవిత్వం. భాష, శైలి, రూపం, వస్తువు ఇలా ప్రతి అంశంలో తెలంగాణ గోడు అడుగడుగునా కన్పిస్తుంది. తెలంగాణ భాష గౌరవాన్ని నిలబెట్టిన ఆ మహనీయుడి జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి ఇది ప్రతిక.

‘‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. -అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’’ అని సగర్వంగా ప్రకటించిన కాళోజీ.. కర్ణాటకలోని రట్టిహళ్లి గ్రామంలో 1914 సెప్టెంబర్ 14న జన్మించాడు. ఆయన తల్లి రమాబాయి కర్ణాటక ప్రాంతానికి, తండ్రి మహరాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. బతుకు దెరువు కోసం వరంగల్ జిల్లా మడికొండకు వచ్చి స్థిరపడ్డారు. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. వరంగల్, హైదరాబాద్​లలో చదువు పూర్తిచేసి, న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. కాళోజీ బహుభాషావేత్త. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఉంది. విద్యార్థిదశలోనే నిజాం నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్​లో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. ఆ కాలంలోనే పెద్ద చదువులు చదివినప్పటికీ ఎక్కడా ఉద్యోగం చెయ్యలేదు. జీవితాంతం ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ భాష కోసం పోరాడినవాడిగా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు వరంగల్ జిల్లా బైరంపురంలో ఒకేరోజు 90 మంది ఉద్యమకారులను కాల్చి చంపారు. ఆ ఘటన కాళోజీని తీవ్రంగా బాధించింది. “మన కొంపలార్చిన, మన స్ర్తీలను చెరిచిన, మన పిల్లలను చంపి మనలను బంధించిన మానవధుములను, మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే. కాలంబు రాగనే కాటేసి తీరాలే” అంటూ తన కలంతో నిజాం నవాబును ఎదిరించాడు.

రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు మహాసభలను నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన ధైర్యం సామాన్యమైనది కావు. వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరేయడానికి ప్రయత్నించినందుకు నగర బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొన్న ఉస్మానియా స్టూడెంట్లను వర్సిటీనుంచి బహిష్కరించినప్పుడు వారిని నాగ్​పూర్  వర్సిటీలో చేర్పించి ఆదుకున్నారు.

కాళోజీ రచనల్లో ‘నా గొడవ, జీవన గీత, అణా కథలు, కాళోజీ కథలు.’ ప్రసిద్ధి పొందాయి. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యాక్షుడయ్యాడు. 1958లో టీచర్ల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 1968లో ఖలీల్ జిబ్రాన్ రచన ‘ది ప్రొఫెట్’ను తెలుగులో ‘జీవన గీత’గా అనువాదం చేసి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు గెలుచుకున్నారు. కాకతీయ వర్సిటీ 1992లో ఆయనకు డాక్టరేట్​ ఇచ్చింది. అదే ఏడాది కేంద్రం కాళోజీని పద్మ విభూషణ్​తో సన్మానించింది. ‘‘ఇదిగో గింజలు రాలిపోతున్నంత మాత్రాన.. పిట్టనోట, ఆ పిట్ట గద్దనోట పడి నేల రాలినంత మాత్రాన- జీవితం ముగిసినట్లు కాదు. అక్కడ విత్తనం చెట్టయి ఫలవంతమవుతుంది” అన్న కాళోజీ.. 2002 నవంబర్ 13న కన్నుమూశారు. తన శరీరాన్ని వరంగల్ మెడికల్ కాలేజీకి అందించారు. ఆయన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9వ తేదీని ‘తెలంగాణ భాష దినోత్సవం’గా జరుపుతోంది. కాళోజీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండలో కళాక్షేత్రం కట్టిస్తోంది.

నిజాం నవాబు ఆగ్రహానికి గురై రెండు సార్లు (1939,1943) జైలుకు వెళ్లాడు కాళోజీ. ‘‘ఆధిపత్యాన్ని ముక్కలు చేసిన అక్షరాన్ని రాజ్యం ఎప్పుడైనా చెరసాలకే పంపుతుంది. చెరసాలలో, ఉరికొయ్యలపై ఉయ్యాలలూగిన అక్షరాలే కొత్త తరానికి బాటలు వేస్తాయి.’’ అని గొంతెత్తి నినదించాడు. ఆర్య సమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. అందరితో కలిసి అన్యాయంపై తిరుగుబాటు చేశాడు. ఆయన అహింసా వాదే.. కానీ అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రతిఘటించాలని చెప్పాడు.
“హింస తప్పు.. రాజ్య హింస మరీ తప్పు ప్రతి హింస తప్పుగాదు” అన్నాడు.

కాళోజీ దృష్టిలో మాట ఒక భావ ప్రకటన, సంభాషణ, సంవాదం, సందేశం, రచన, ప్రసంగం.. రూపమేదైనా మనసులోని మాట చెప్పడమే ప్రధానమని ఆయన భావన. ‘‘మన ఆలోచనలను ప్రకటించడానికి భాష అవసరం. ఆ భాష రెండు తీర్లు. ఒకటి బడి పలుకుల భాష. రెండోది పలుకుబడుల భాష. నాది పలుకుబడుల భాష. ఎక్కడైనా పలుకుబడుల భాషే కావాలె. అది అయితేనే అవతలోడికి తెలుస్తది. మన యాస, మన భాష అన్న అభిమానం ఉండాలి..”అని గట్టిగ చెప్పిండు. ఆదిలాబాద్ లో ఉదారి నారాయణగారు ‘ఆకుపచ్చని ఎడారి’ అన్న పుస్తకానికి ముందు మాట రాస్తూ గోపి అన్నాడు.. ‘తెలంగాణ మాండలికం అనుడు తప్పు.. తెలంగాణ భాష అనాలె’ అని. అవును తెలంగాణ బతుకు వేరే, తెలంగాణ భాష వేరే. ఇవి ప్రత్యేకమైనవి.

తెలంగాణ భాషపై, కవులపై కోస్తాంధ్రా కవులకు చులకన భావం ఉండేది. రాఘవాచారి తెలంగాణలో కవులే లేరని అన్నారు. ఆ మాటను సవాలుగా తీసుకుని సురవరం ప్రతాపరెడ్డి 350 మందితో గోలకొండ పత్రికను తీసుకువచ్చారు. ఈ సందర్భాన్ని కాళోజీ గుర్తు చేసుకుని.. మీకు ఎంత మంది ప్రతాపరెడ్లు కావాలో చెప్పండి చూపిస్తానన్నాడు. “రెండున్నర జిల్లాలదే దండి భాషైనప్పుడు తక్కినొళ్ల యాస తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పు కాదు” అని స్పష్టం చేశాడు.“తెలంగాణ యాస నెపుడు.. యీసడించు భాషియుల “సుహృద్భావన”ఎంతని.. వర్ణించుట సిగ్గుచేటు

కాళోజీ పురుషాధిక్యతను నీరసిస్తూ.. ‘‘ఆడవారిని నిందించడం మీకలవాటైంది. నిజంగా చూస్తే పీసిడితనం అంతా మొగవారిలోనే ఉంది”అంటాడు.

“ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. నేను ఒలకబోసింది సీసాలకొద్దీ కాదు, పీపాలకొద్దీ..అయినా ఎవరి మెదడూ కదలదే”అంటూ నిరాశ భావాన్నీ వ్యక్తం చేశాడు.

ఇకనైనా తెలంగాణ భాషల రాయండ్రి,తెలంగాణ భాషల మాట్లాడుండ్రి,తెలంగాణ బతుకు బతుకుండ్రి.మన బతుకులను అన్యాయం చేసి,దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకాతన్ని తరమాలె. మన ప్రాంతంవాడే దోపిడీ చేస్తే.. ప్రాణంతోటే పాతర పెట్టాలె.- ‘నా గొడవ’లో కాళోజీ

వై.శివకుమార్, హెచ్​సీయూ రీసెర్చ్​ స్కాలర్

 

Latest Updates