హోలీ సంబురం : కామదహనం.. రంగుల వసంతం

హోలీ, హోలీకా పూర్ణిమ, మహా ఫాల్గుణి…. రంగేళి…. ఇలా వివిధ పేర్లతో ఈ ఫెస్టివల్ ను పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలిచినా… రంగులతో ఆటలు, పాటలు, సయ్యాటలు. వసంతానికి స్వాగతం పలికే పండుగే హోలీ. ఈ హోలీకి పెద్ద హిస్టరీనే ఉంది. మొఘల్ కాలంలో హిందూ, ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా హోలీని జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది.

చలి ముగిసే రోజుల్లో కనువిందుచేసే వసంతం

ప్రతీ ఏడాది మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. పండుగకు చరిత్రతో పాటు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా చేసుకుంటారు. అంటే అప్పటివరకు వణికించే చలి ముగిసే రోజులు.. మండు వేసవి వచ్చే ముందు రోజుల్లో దీనిని జరుపుకుంటాం. ఈ టైంలో వచ్చేదే వసంతం. కోకిల కుహూ రాగాలు, కొత్త చిగుర్లు తొడిగే చెట్లు నిండైన పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. ఈ రోజుల్లో వచ్చే వసంత పంచమి రోజు రంగులను చల్లుకొని సంబురాలు జరుపుకుంటారు.

మత సామరస్యం చాటే ప్రకృతి పండుగ

ప్రకృతితో మమేకమై… వాకిళ్లు రంగురంగుల రంగవల్లికలతో ముస్తాబవుతాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో కులానికో, మతానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, వివిధ సంప్రదాయాలకు అనుగుణంగా పండుగను ఘనంగా జరుపుకొంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల్లో తేలియాడతారు. స్నేహం, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు వేదికగా హోలీ సంబురాలు చేసుకుంటారు.

ఉత్తరాదిన ధూంధాం పండుగ

గుజరాత్ , మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్రలో భక్తి గీతాలతో కృష్ణుడిని ఆరాధిస్తూ రంగులతో ఆటలాడుతారు. హోలీ రోజున పాలు, పెరుగు ఉన్న కుండను తాడు కట్టి ఉట్టి కొట్టడం అక్కడ సంప్రాదాయంగా వస్తోంది. పాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు కృష్ణుడిని ఊయల్లో వేసి బెంగాల్ లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు.

ముందురోజు కాముడి దహనం

హోలీకి ముందు రోజు రాత్రి కామ దహనాలు జరుగుతాయి. ప్రతీ వీధిలో పాత కట్టెలు పేర్చి కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. రాజధానిలో ఈ తంతును ఘనంగా జరుపుకున్నారు జనం. పురాణాల ప్రకారం.. తపస్సును భగ్నం చేసిన మన్మధుడిని తన కోపాగ్నితో దహనం చేస్తాడు శివుడు. మనిషికి కోరికలే శత్రువులు.. కోరికలను కలిగించే కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన కామదహనాన్ని ఆచారంగా జరుపుకోవటం జరుగుతోంది. మరుసటి రోజు రతీదేవి ప్రార్థించటంతో మన్మధున్ని శివుడు తిరిగి బతికించాడని, దీంతో దేవతలు సంతోషంతో వసంతోత్సవం చేసుకున్నారని అదే హోలీగా మారిందని చెబుతున్నాయి పురాణాలు.

హరివిల్లులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేలరంగులుంటాయి. ఒక్కో రంగు ఒక్కో తత్వాన్ని చెబుతోంది. జీవితంలోని అర్ధం, పరమార్థం ఈ పండుగలో దాగిఉంది.

Latest Updates