మంచు కొండల్లో మహా యాత్ర

హిమాలయ యాత్రల్లో అమర్‌‌నాథ్‌‌ యాత్ర ప్రముఖమైనది. అమర్‌‌నాథ్‌‌లోని కొండగుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు శైవులు సాహస యాత్ర చేస్తారు. ఎత్తయిన మంచు పర్వతాలు, దట్టమైన అడవులు, అందమైన మైదానాలు, మనోహరమైన చెరువుల మధ్య సాగే ఈ యాత్ర మధురమైనది. అలాగే సాహసోపేతమైనది కూడా. ఒక పక్క ఎత్తయిన పర్వతం, మరొపక్క లోతైన లోయ ఉండే దారుల్లో సాగే ఈ సాహసయాత్ర ఒక గొప్ప అనుభూతి.

ప్రపంచంలోని అతిపెద్ద గుహల్లో అమర్‌‌నాథ్‌‌ గుహ ఒకటి.  150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉన్న గుహ ఇది.  దీనిని చూసేందుకు ఏటా ఎంతో మంది యాత్రికులు తరలివస్తున్నారు. శీతాకాలంలో పేరుకుపోయిన మంచు నెమ్మదిగా తొలగిపోతూ అమర్‌‌నాథ్‌‌ యాత్రకు దారి చూపుతోంది. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం  వల్ల ఈ గుహ మంచు నుంచి బయటపడి, సందర్శనకు వీలుగా ఉంటుంది. గుహలోని మంచు తేరుకుంటున్న వేళ నీటిబొట్టు మంచుగా మారి శివలింగాకారం ధరిస్తోంది. ఈ అద్భుతాన్ని దర్శించుకునేందుకు జూలై, ఆగస్టు అనుకూలమైన రోజులు.

ప్రతి ఏటా జూలైలో అమర్‌‌నాథ్‌‌కు యాత్ర మొదలవుతుంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. ఇది అతి కష్టమైన యాత్ర. జ్యోతిర్లింగాలలో అమర్‌‌నాథ్‌‌లోని మంచులింగం ఒకటి. కశ్మీర్‌‌ రాజధాని శ్రీనగర్‌‌కు 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ గుహలో ఇప్పుడు శివుడు కొలువుదీరుతాడు.గుహలో మంచులింగం ఏటా ఒకే చోట ఏర్పడుతుంది. ఒకే ఎత్తులో ఏర్పడటం విశేషం. గుహలో పైనుంచి బొట్టుబొట్టుగా పడే నీరు ఈ గుహలో మంచురూపంలోకి మారుతుంది. ఈ మంచు శివలింగాకారంలో ఉంటుంది. ఈ కాలంలో కైలాస పర్వతం నుంచి శివుడు ఇక్కడికి వస్తాడని భక్తుల నమ్మకం. ఆ శివుడిని దర్శించుకోవాలని వాళ్ల కోరిక. మృత్యు రహస్యం తెలిసిన శివుడు తన సతి పార్వతికి ఈ గుహలోనే ఆ రహస్యం చెప్పాడట. ఈ గుహలో మంచులింగం పక్కనే రెండు మంచు ఆకారాలు ఏర్పడతాయి. వాటిలో ఒకదానిని పార్వతిగా, మరోదానిని విఘ్నేశ్వరుడిగా భావిస్తారు. 45 రోజులపాటు ఈ మంచులింగం కనిపిస్తుంది.

ప్రాచీన యాత్ర..

అమర్‌‌నాథ్‌‌ యాత్ర ప్రాచీన కాలం నుంచీ ఉంది. కశ్మీర్‌‌ రాజుల చరిత్ర వివరించే ‘రాజతరింగిణి’లో అమర్‌‌నాథ్‌‌ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ శివుడికి త్రిశూలం, బాణ లింగాలు సమర్పించినట్టు ఆ గ్రంథంలో పేర్కొన్నారు.  ప్రజయభట్టు రాసిన ‘రాజవిప్లతక’లో కూడా అమర్​నాథ్​ యాత్రా విశేషాల ప్రస్తావన ఉంది.

శేష్‌‌నాగ్ సరస్సు..

పెహల్​గాంకి 27 కి.మీ దూరంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 3,658 మీటర్ల ఎత్తున ఉంది. అమర్‌‌నాథ్‌‌కు సమీపంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో శేషనాగ్‌‌ సరస్సు ఒకటి. పెహల్​గాం నుంచి కాలి నడకన ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సు శీతాకాలమంతా గడ్డకట్టి ఉంటుంది. జూన్‌‌ నెల ముగిసిన తర్వాత మంచు కరిగిపోతుంది.

బొటానికల్ గార్డెన్(కొకెర్‌‌నాగ్)…

అనంతనాగ్‌‌కు 10 కి.మీ దూరంలోని కొకెర్‌‌నాగ్‌‌లో ఉన్న బొటానికల్ గార్డెన్ ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో లక్షల చెట్లు ఉన్నాయి. కొన్ని వందల రకాల వృక్ష జాతులు ఈ గార్డెన్‌‌లో ఉన్నాయి! ఇక్కడ దేశీయ, విదేశీ వృక్ష జాతులను చూడొచ్చు. కొండల మధ్య ఉండే విశాలమైన ఈ బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు వినోదమే కాదు విజ్ఞానాన్నీ ఇస్తుంది.

పెహల్‌‌గాం… 

అమర్‌‌నాథ్‌‌కు పెహల్‌‌గాం నుంచి కాలినడకన వెళ్లాలి. ఇది అనంతనాగ్‌‌ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. లిద్దర్‌‌ నదీ తీరంలో పెహల్‌‌గాం ఉంది.  ఇది పర్వత పట్టణం. సముద్రమట్టానికి 7,200 మీటర్ల ఎత్తున ఉంది. అమర్‌‌నాథ్‌‌ యాత్ర మొదలయ్యే ప్రాంతాలలో ఇది ముఖ్యమైనది. అందమైన పచ్చిక మైదానాలకు, దట్టమైన పైన్‌‌ అరణ్యాలకు ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం.

Latest Updates