ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటా ఎత్తేసిన్రు

  • ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో మాత్రం అనుమతి
  • యోగానూ క్రీడల జాబితాలో చేర్చిన వైనం
  • ప్రభుత్వం తీరుపై క్రీడాకారుల అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ ఆయా కోర్సుల నుంచి తొలగించింది. సర్కారు నిర్ణయాన్ని క్రీడాకారులు, పేరెంట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమాలను అరికట్టి, నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, ఆ కోటానే ఎత్తేయడం సరికాదంటున్నారు. తాజాగా వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పోర్ట్స్​కోటా అమలుపై ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది. క్రీడల జాబితాలో కొత్తగా యోగానూ చేర్చడం గమనార్హం.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహా..

రాష్ర్టంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్​కోటా అడ్మిషన్లపై ఈనెల 22న ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఈ కోటా పరిధిలో 31 క్రీడలను చేర్చింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహా మిగిలిన అన్ని టెక్నికల్‌ విద్యా కోర్సుల అడ్మిషన్లలో 0.5 శాతం స్పోర్ట్స్‌కోటాను అమలు చేయాలని సూచించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ట్రిపుల్ ఐటీ, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్ తోపాటు ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్, లాసెట్‌, డైట్‌సెట్‌, పాలిసెట్, ఐటీఐ వంటి వాటిలో దీన్ని అమలు చేయాలని పేర్కొంది. స్టూడెంట్ల ఐదేండ్ల ప్రతిభ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొత్తం 25 ప్రయార్టీ అంశాల(స్పోర్ట్స్)ను సూచించగా, అందులో ముందుగా ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్ ను పెట్టారు. గతంలో స్కూల్ గేమ్స్ ను ఎత్తేసిన సర్కారు.. తాజా వాటిని కూడా చేర్చింది. కొత్తగా యోగాను కూడా క్రీడగా చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోటా ఎత్తేయడమేంటి?

2017–18 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ స్పోర్ట్స్​కోటా అడ్మిషన్లలో భారీగా అక్రమాలు జరిగాయి. దీంతో కొందరు స్టూడెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్​కోటా నిలిచిపోయింది. 2018–19, 2019–20లో స్పోర్ట్స్​కోటా లేకుండానే అన్ని కోర్సుల్లో అడ్మిషన్లు జరిగాయి. హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని 2020–21 నుంచి స్పోర్ట్స్​కోటాను ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. కానీ ఎంబీబీఎస్​, బీడీఎస్​లను మాత్రం చేర్చలేదు. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోకుండా, ఆ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటానే తీసివేయడం ఏంటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఎంబీబీఎస్​లో సీట్లు పొందిన స్టూడెంట్లు.. కోర్సులో చేరిన తర్వాత స్పోర్ట్స్​ఆడటం లేదని కొందరు అధికారులు వాదిస్తుండగా, దీన్ని క్రీడాకారులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎంబీబీఎస్, బీడీఎస్​కోర్సుల్లోనూ స్పోర్ట్స్​ కోటాను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కోటా అమలు చేయాలె

మాది మధ్య తరగతి కుటుంబం. నా బిడ్డను డాక్టర్ చేయాలని నా కోరిక. ఆ చదువుకు నా దగ్గర అంత డబ్బులేకపోవడంతో స్పోర్ట్స్​కోటా ఎంపిక చేసుకున్నాను. దీంతో 8వ ఏట నుంచే స్పోర్ట్స్​కు దగ్గర చేసిన. ఇప్పటికే నేషనల్, ఇంటర్నేషనల్ పోటీల్లో మా పాప మంచి టాలెంట్​ కనబరిచింది. ఈసారి తప్పకుండా ఎంబీబీఎస్​లో సీటు వస్తుందని ఆశించా. కానీ ప్రభుత్వం ఆ కోర్సులో కోటా తీసేయడం సరికాదు. వెంటనే చేర్చాలి.

– ఓ పేరెంట్, హైదరాబాద్

Latest Updates