ప్రేమజంటపై దాడి-ఆరుగురు అరెస్ట్

ఎస్.ఆర్.నగర్ లో ప్రేమజంటపై దాడి చేసి, యువకుడిపై హత్యాప్రయత్నం చేసిన ఆరుగురిని నేడు వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై డీసీపీ ఏ.ఆర్ శ్రీనివాస్ మీడియాకు మరిన్ని వివరాలు తెలిపారు.

సంగారెడ్డికి చెందిన షేక్ ఇంతియాజ్(22), బేగంపేట్ కు చెందిన జైనాబ్ ఫాతిమా (19) రంజాన్ పండుగ రోజున ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని కోరుతూ.. ఈ నెల 7 న పోలీసులను ఆశ్రయించి, ఆ తర్వాత తిరిగి సంగారెడ్డికి వెళుతున్న క్రమంలో ఫాతిమా కుటుంబ సభ్యులు అతనిపై హత్యాయత్నం చేశారు. కారులో వెళుతున్న వారిని ఆటోలో వచ్చిన ఫరూక్ ,షకీల్ ,రబ్బానీ ఇంకా మరికొందరు కత్తితో దాడి  చేసి పరారయ్యారు.

ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులను పట్టుకునేందుకు పోలీస్ సిబ్బంది కొన్ని బృందాలుగా విడిపోయి షాహీన్ నగర్ లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితులైన రబ్బానీ,షకీల్ ఇంకా పరారీ లో ఉన్నారు.

వీడియో తీయడం కూడా నేరమే

ఇలాంటి ఘటనలు జరుగుతున్న సమయం లో ప్రతి ఒక్కరు బాధ్యతతో ఉండాలని  డీసీపీ ఏ.ఆర్ శ్రీనివాస్ అన్నారు.  కాపాడాల్సిన వాళ్ళు చూస్తూ వీడియో తీయడం కూడా నేరమేనని అన్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని,  రౌడీల పై ఉక్కుపాదం మోపుతామని శ్రీనివాస్ అన్నారు

Latest Updates